
సాక్షి, సిటీబ్యూరో: పర్యావరణ అనుకూలమైన హరిత భవనాలకు ఆదరణ పెరుగుతోంది. అపార్ట్‌మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలే కాదు ప్రభుత్వం నిర్మించిన సచివాలయం, పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, జిల్లా కలెక్టరేట్లు, ఇతరత్రా ఆఫీసు భవనాలు సైతం పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మిస్తుండటమే ఇందుకు ఉదాహరణ.. స్వచ్ఛమైన గాలి, వెలుతురు రావడంతో పాటు సహజ వనరులను వినియోగించుకోవడం, విద్యుత్, నీటి పొదుపు, సౌరశక్తి వినియోగం, గృహోపకరణాలు సైతం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) అనుగుణంగా ఉండటమే హరిత భవనాల ప్రత్యేకత.
గ్రీన్ బిల్డింగ్స్‌లో 60 శాతం వరకు నీటి వృథాను అరికట్టవచ్చు. నిత్యావసరాలకు వినియోగించే నీరు బయటకు పంపకుండా వాటిని రీసైకిల్ చేసి తిరిగి మొక్కలు, బాత్‌రూమ్ అవసరాలకు వాడుకోవచ్చు. ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి వర్షపు నీటిని నిల్వ చేస్తారు. సాధారణ భవనాలతో పోలిస్తే గ్రీన్ బిల్డింగ్స్‌లో నిర్మాణ వ్యయం 8–10 శాతం అధికంగా ఉంటుంది. కానీ.. ఈ భవనాలలో నీరు, విద్యుత్ పొదుపు అవుతున్న కారణంగా ఇంటి నిర్మాణం కోసం అదనంగా వెచ్చించిన వ్యయం 2–3 ఏళ్లలో తిరిగి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇంటి నిర్మాణ సమయంలోనే రీసైకిల్ మెటీరియల్స్‌ను ఉపయోగించడం గ్రీన్ బిల్డింగ్స్ మరొక ప్రత్యేకత. పర్యావరణానికి హాని చేయని ఉత్పత్తులనే నిర్మాణంలో వాడుతుంటారు. ఇటుకల నుంచి టైల్స్ వరకు గ్రీన్ ఉత్పత్తులు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 720కి పైగా గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్ట్‌లు ఐజీబీసీ వద్ద రిజిస్టర్ అయ్యాయి. దేశవ్యాప్తంగా 11 వేల నిర్మాణాలు ఉన్నాయని ఐజీబీసీ ప్రతినిధులు చెబుతున్నారు.