
హైదరాబాద్..! ప్రపంచ దేశాల్లో కేవలం ఒక ప్రముఖ నగరం మాత్రమే కాదు.. కాలాతీతంగా మారుతున్న జీవనశైలి, అంతర్జాతీయ ఆర్థిక, ఆధునిక, విజ్ఞాన, వ్యాపార అంశాల్లో ఎప్పటికప్పుడు తన ప్రశస్తిని చాటుతున్న గ్లోబల్ సిటీ. నగరంలోని పలు అంతర్జాతీయ సంస్థల ప్రధాన కార్యాలయాలు, ఆయా సంస్థలు చెల్లిస్తున్న అద్దెలే ఇందుకు తార్కాణం.. పలు గ్లోబల్ సంస్థలు నగర కేంద్రంగా లక్షల చదరపు అడుగుల వీస్తీర్ణంలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తుండటమే కాదు.. ఆ స్థలాలకు ప్రతి నెలా కోట్ల రూపాయల్లో అద్దె చెల్లిస్తున్నాయి. ఆయా గ్లోబల్ సంస్థల వింతలు, విశేషాలు.. – సాక్షి, సిటీబ్యూరో
మైక్రోసాఫ్ట్ (ఆర్ అండ్ డీ): ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఫీనిక్స్ సెంచురస్ భవనంలో 2.64 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జూలై 2025 నుంచి కార్యాలయాన్ని లీజుకు తీసుకుంది. ఇందులో భాగంగా ప్రతి నెల రూ. 5.4 కోట్ల అద్దె చెల్లిస్తోంది. ఐదేళ్ల లీజ్ ఒప్పందంలో భాగంగా ఈ ఆఫీస్ స్పేస్ కోసం నగరంలో అత్యధిక అద్దె చెల్లిస్తున్న సంస్థ మైక్రోసాఫ్ట్ మాత్రమే.
క్వాల్కమ్: ఈ సంస్థ కార్యాలయం హై‑టెక్ సిటీలోని ది స్కై వ్యూ భవనంలో 4.14 లక్షల చదరపు అడుగులకు దాదాపు 3.15 కోట్ల భారీ అద్దెను చెల్లిస్తుంది. ఇది అత్యంత అధిక అద్దె తీసుకునే లీజుల్లో ఒకటి. ఈ సంస్థ కుదుర్చుకున్న ఐదేళ్ల లీజ్లో మొదటి ఏడాది తరువాత ఈ అద్దె 7 శాతం పెరుగనుంది. అంతేకాకుండా మూడేళ్ల తరువాత మరో 15 శాతం పెరిగేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
టీసీఎస్: శేరిలింగంపల్లి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో రాజ్‌పుష్ప భవనంలో అంతర్జాతీయ సేవలందిస్తున్న టీసీఎస్.. సుమారు 10.18 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణానికి రూ.4.3 కోట్ల నెలవారి అద్దె కడుతోంది. 15 ఏళ్లకుగాను కుదుర్చుకున్న ఈ లీజ్ నగరంలో అత్యధిక అద్దె కడుతున్న సంస్థల్లో మరొక ప్రధాన సంస్థగా నిలిచింది.
ఫేస్‌బుక్ (మెటా): ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఫేస్‌బుక్ (మెటా) హైదరాబాద్ నగరంలో 3.7 లక్షల చదరపు అడుగుల స్థలం కోసం దాదాపు 2.8 కోట్ల నెలవారీ అద్దెతో లీజును నవీకరించింది. రానున్న ఏడాది 2026 జనవరిలో ఈ అద్దె 15 శాతం పెరగనుంది.

ఎస్ అండ్ పీ క్యాపిటల్ ఐక్యూ ఇండియా: ఈ సంస్థ నగరంలో 2.41 లక్షల చదరపు అడుగులకు ప్రతి నెలా రూ.1.77 కోట్లు చెల్లిస్తోంది. 2024 నుంచి ఐదేళ్లకు కుదుర్చుకున్న ఈ లీజ్ రెండేళ్ల తరువాత 15 శాతం పెరుగనుంది.
ఎల్‌టీఐ మైండ్ ట్రీ: హైటెక్ సిటీలోని స్కై వ్యూ 10లో ఎల్‌టీఐ మైండ్ ట్రీ సంస్థ సుమారు 1.09 లక్షల చదరపు అడుగులకు 89.18 లక్షలు అద్దెగా చెల్లిస్తూ.. ఐటీ దిగ్గజాల సరసన నిలిచింది.
ఐబీఎం ఇండియా: గచ్చిబౌలిలోని దివ్య శ్రీ ఓరియన్‌లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐబీఎం ఇండియా తమ లీజులో భాగంగా 1.06 లక్షల చదరపు అడుగుల స్థలానికి ప్రతి నెలా రూ.70.23 లక్షలు చెల్లిస్తోంది. 2024లో మొదలైన ఈ లీజ్ ప్రతి ఐదేళ్లకు 4 శాతం పెరగనుంది.
50 శాతం టెక్ లీజింగ్..
సిటీలో 2025లో నూతనంగా గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ సరఫరా గణనీయంగా తగ్గడంతో వేకెన్సీ ధర విపరీతంగా పెరిగింది. దీనివల్ల అద్దె చెల్లింపులు ఎక్కువగా ఉన్నాయని ఓ గ్లోబల్ సంస్థ ప్రతినిధి తెలిపారు. దీనికి తోడు ఇక్కడ లభించే సేవల సమగ్రత, దీనికి స్థానిక ప్రభుత్వ మద్దతు.. అంతకు మించి తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులకు అందిస్తున్న ప్రోత్సాహం.. అత్యాధునిక ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.. ఇవన్నీ కలిపి హైదరాబాద్‌ను యూనివర్సల్ హబ్‌గా మార్చేసింది.

మోడ్రన్ లైఫ్‌స్టైల్..
ఈ అంశాలే కాకుండా విలాసవంతమైన అధునాతన జీవనవిధానం, ఈ గ్లోబల్ కంపెనీలకు అనువైన డిజైన్‌తో కూడిన భవనాలు, సురక్షిత పార్కింగ్, ఆధునిక భవన లీఫ్ట్ సౌకర్యాలు, రెగ్యులర్ పవర్ బ్యాకప్ వంటివి తోడ్పాటును అందిస్తున్నాయి. కేవలం ఆఫీసు అధికారిక కార్యకలాపాల్లో భాగంగా పనిచేయడమే కాకుండా సమీపంలోని మోడ్రన్ లైఫ్‌స్టైల్ అలవాట్లు, కాంటినెంటల్ ఫుడ్, ఫిట్‌నెస్ సేవలు ఆ కంపెనీల ఉద్యోగులకు గ్లోబల్ లెవెల్ లైఫ్‌స్టైల్ అందిస్తున్నాయి. ఫ్యామిలీ–ఫ్రెండ్లీ వాతావరణం, ఉద్యోగులకు కుటుంబంతో ఉండేందుకు సరైన నివాస, విద్య, వినోదం వంటివి స్థానికంగానే అందుబాటులో ఉండటం కలిసొచ్చే అంశం.
ఇన్నోవేటివ్ సెంటర్..
నగరంలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థలు ఇంత భారీ స్థాయిలో అద్దెలు చెల్లించడానికి ప్రధాన కారణం.. భాగ్యనగరం భారతీయ ఐటీ, గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్ (జీసీసీ) హబ్‌గా, ప్రతిష్టాత్మక ఇన్నోవేటివ్ కేంద్రంగా ఎదగడమేనని నిపుణులు చెబుతున్న మాట. అంతేకాకుండా హైదరాబాద్ సిటీ అధునాతన జీవన శైలికి అనుగుణమైన లైఫ్‌స్టైల్ పర్యావరణాన్ని రోజు రోజుకు అభివృద్ధి చేసుకుంటుంది. ముఖ్యంగా హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి వంటి ప్రాంతాలు సమృద్ధిగా కెఫేలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ఇంటర్నెట్, క్యాంపస్ మోడ్రన్ వాతావరణంతో అద్భుత జీవన విధానాన్ని అందజేస్తున్నాయి.