
సాక్షి, సిటీబ్యూరో: పండగలు వస్తున్నాయంటే చాలు.. రియల్టీ రంగానికి ఉత్సాహమే. ఎందుకంటే ప్రజలు ఇల్లు, ఫ్లాట్లు తీసుకోవడం శుభసూచకంగా భావిస్తారు. కరోనా తర్వాతి నుంచి ఖరీదైన గృహాలకు మళ్లీ ఆదరణ అధికమవుతోంది. వీటిని తీసుకోవడానికి కొనుగోలుదారులు ముందుకొస్తున్నారు. ఢిల్లీ, గుర్గావ్, నొయిడా, బెంగళూరు వంటి ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లోనూ కొనేవారి శాతం పెరుగుతోంది. మెరుగైన ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న ఉద్యోగావకాశాలు కొనుగోలుదారుల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయి. నిర్మాణం పూర్తి కానున్న ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది.
నగరంలోనూ అదే పోకడ..
గతంలో ఊపు తగ్గిన లగ్జరీ విల్లాలకు ఇటీవల కాలంలో నగరంలో ఆదరణ పెరుగుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కారిడార్‌కు చేరువలో ఉండి సదుపాయాల విషయంలో రాజీపడని ప్రాజెక్టుల్లో విల్లాలను తీసుకోవడానికి ప్రవాసభారతీయులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఐటీ నిపుణులు ఆసక్తి చూపిస్తున్నారు. నార్సింగి, అప్పా జంక్షన్, తెల్లాపూర్, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోని విల్లాలకు గిరాకీ పెరిగింది.
స్థానిక రాజకీయాంశాల వల్ల ఎదురయ్యే సమస్యలు తాత్కాలికమే.. తర్వాత పరిస్థితులు సద్దుమణుగుతాయి. నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు దాని అనుసంధానమైన రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్, మెట్రో రైలు విస్తరణతో పాటు కొత్త నియామకాల్ని చేపడుతోన్న ఐటీ/ఐటీఈఎస్ సంస్థలు, మెరుగవుతోన్న వైద్య, విద్య, బయోటెక్ రంగాలు వెరసీ.. భవిష్యత్తులో ప్రపంచాన్ని ఆకట్టుకునే స్థాయికి హైదరాబాద్ చేరుకుంటుంది.