టెక్కలి: తొక్కిసలాట నేపథ్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఆలయంతో పాటు ధర్మకర్త హరిముకుంద పండా ఇంటివద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆలయ ప్రధాన గేటు నుంచి తోటలో ధర్మకర్త ఇంటివరకు పోలీసులు మోహరించి పండాను బయటకు వెళ్లనీయకుండా ఆంక్షలు విధించారు.
ఆలయ సంప్రదాయం ప్రకారం పండా ప్రతిరోజూ ఆలయంలో దీపం పెట్టే ఆనవాయితీ ఉంది. పోలీసులు అడ్డుకోవడంతో ఆలయంలో ఆదివారం దీపం పెట్టే అవకాశం దక్కలేదు. పోలీసులు అతడి ఇంటిని అష్ట దిగ్బంధం చేయగా.. ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఘటనలో పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కనబడుతుంటే.. ఆలయ ధర్మకర్తపై కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదంటూ ఇప్పటికే వైఎస్సార్‌సీపీ నాయకులు హెచ్చరించిన సంగతి తెలిసిందే.
10 కేసులు పెట్టుకోండి: పండా
‘దేవుడికి గుడి కట్టాను. అందరూ రావాలి. పూజలు చేయాలని కోరుకున్నాను. ఇలా జరిగితే నేనేం చేస్తాను. కేసులు కడితే నా మీద ఒకటి కాదు 10 కేసులు పెట్టుకోండి’ అని ఆలయ ధర్మకర్త హరిముకుంద పండా సమాధానమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో తొక్కిసలాట జరిగి 9 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయాలు పాలవడంపై పండా కన్నీళ్లు పెట్టుకున్నారు. చెడ్డపని చేస్తే అనుమతి కావాలి తప్ప.. మంచి పనికి కాదన్నారు. ‘అమ్మ కోరికతో తాహతుకు మించి డబ్బులు పెట్టి గుడి కట్టాను. అంతా శ్రీనివాసుడే చూసుకుంటాడు. ఇక్కడ పోలీసులు ఎవరూ ఉండొద్దు. వారికి ఇక్కడ ఏం పని అందరూ వెళ్లిపోండి. నేను గుడి తలుపులు తీస్తాను’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.


