భక్తులు చనిపోతే.. అది ప్రైవేట్ గుడి అంటూ సర్కారు తప్పించుకునే యత్నం
దేవదాయశాఖ చట్టంలో ప్రైవేట్, ప్రభుత్వ గుడి అనేదే లేదంటున్న నిపుణులు
దేవదాయ శాఖలో నమోదైనవి 27 వేల ఆలయాలు.. పర్యవేక్షణలో ఉన్నది ఏడు వేలే
భక్తులు ఇచ్చే కానుకల డబ్బులతోనే దేవదాయ శాఖ ఉద్యోగులకు జీతాలు
ఎక్కడ ఉత్సవం జరిగినా పర్యవేక్షించాల్సింది పోలీసు, రెవెన్యూ, దేవదాయ శాఖలే
సాక్షి, అమరావతి: కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వర దేవాలయంలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణిస్తే అది ఓ ప్రైవేట్ గుడి అంటూ టీడీపీ కూటమి సర్కారు తన వైఫల్యాన్ని, అసమర్థతను కప్పిపుచ్చుకునే యత్నం చేయడంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వినాయక ఉత్సవాల సమయంలో వీధిలో చిన్న విగ్రహం ఏర్పాటు చేసుకున్నా పోలీసులు పర్యవేక్షించి అనుమతి ఇస్తారని, అలాంటిది కాశీబుగ్గలో వేల మంది భక్తులు పాల్గొంటున్న కార్యక్రమంతో ప్రభుత్వానికి సంబంధం లేదని మంత్రులు చెప్పడం ఏమిటి? ప్రైవేట్ ఆలయమని బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం ఏమిటని మండిపడుతున్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ వ్యత్యాసం ఉండదు..
దేవదాయశాఖ చట్టం ప్రకారం ప్రభుత్వ గుడి, ప్రైవేట్ గుడి అనే వ్యత్యాసం ఉండదని, ఆయా ఆలయాల పర్యవేక్షణ శాఖ పరిధిలోనే ఉంటుందని పేర్కొంటున్నారు. దేవదాయ శాఖ పరిధిలో 26,968 ఆలయాలు ఉండగా దాదాపు 20 వేల ఆలయాలకు ఈవోలే లేరని చెబుతున్నారు. దేవదాయ శాఖ పరిధిలో పనిచేసే ఏ ఉద్యోగికీ ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లించదు. ఆలయాల్లో పనిచేసే ఉద్యోగులకు అక్కడి ఆదాయం నుంచే చెల్లింపులు చేస్తారు. భక్తులు ఇచ్చే కానుకల నుంచే జీతాలు చెల్లిస్తున్నప్పుడు ప్రైవేట్, ప్రభుత్వం అనే ప్రస్తావన ఉండదని స్పష్టం చేస్తున్నారు.
భద్రత బాధ్యత ప్రభుత్వానిదే
దేవదాయ శాఖ పరిధిలో నమోదు కాని ఆలయాలలో ఉత్సవాలు జరిగినప్పుడు కూడా ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలి్సన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొంటున్నారు. అందుకే ఎంత పెద్ద ఉత్సవం జరిగినా పోలీసులు, రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులతో ఉమ్మడిగా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని నిబంధన ఉందని ప్రస్తావిస్తున్నారు. గత ప్రభుత్వం అన్ని ఆలయాలతో పాటు దేవదాయ శాఖ పరిధిలో నమోదు కాని ఆలయాలలో సైతం సీసీ కెమేరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టిందని గుర్తు చేస్తున్నారు.


