breaking news
kasibugga temple
-
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట... తొమ్మిది మంది భక్తులు మృతి... 20 మందికి పైగా గాయాలు
-
అలసత్వాన్ని కప్పిపుచ్చి ‘ప్రైవేట్ దేవాలయమా’!
సాక్షి, అమరావతి: కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వర దేవాలయంలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణిస్తే అది ఓ ప్రైవేట్ గుడి అంటూ టీడీపీ కూటమి సర్కారు తన వైఫల్యాన్ని, అసమర్థతను కప్పిపుచ్చుకునే యత్నం చేయడంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వినాయక ఉత్సవాల సమయంలో వీధిలో చిన్న విగ్రహం ఏర్పాటు చేసుకున్నా పోలీసులు పర్యవేక్షించి అనుమతి ఇస్తారని, అలాంటిది కాశీబుగ్గలో వేల మంది భక్తులు పాల్గొంటున్న కార్యక్రమంతో ప్రభుత్వానికి సంబంధం లేదని మంత్రులు చెప్పడం ఏమిటి? ప్రైవేట్ ఆలయమని బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం ఏమిటని మండిపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ వ్యత్యాసం ఉండదు..దేవదాయశాఖ చట్టం ప్రకారం ప్రభుత్వ గుడి, ప్రైవేట్ గుడి అనే వ్యత్యాసం ఉండదని, ఆయా ఆలయాల పర్యవేక్షణ శాఖ పరిధిలోనే ఉంటుందని పేర్కొంటున్నారు. దేవదాయ శాఖ పరిధిలో 26,968 ఆలయాలు ఉండగా దాదాపు 20 వేల ఆలయాలకు ఈవోలే లేరని చెబుతున్నారు. దేవదాయ శాఖ పరిధిలో పనిచేసే ఏ ఉద్యోగికీ ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లించదు. ఆలయాల్లో పనిచేసే ఉద్యోగులకు అక్కడి ఆదాయం నుంచే చెల్లింపులు చేస్తారు. భక్తులు ఇచ్చే కానుకల నుంచే జీతాలు చెల్లిస్తున్నప్పుడు ప్రైవేట్, ప్రభుత్వం అనే ప్రస్తావన ఉండదని స్పష్టం చేస్తున్నారు. భద్రత బాధ్యత ప్రభుత్వానిదేదేవదాయ శాఖ పరిధిలో నమోదు కాని ఆలయాలలో ఉత్సవాలు జరిగినప్పుడు కూడా ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలి్సన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొంటున్నారు. అందుకే ఎంత పెద్ద ఉత్సవం జరిగినా పోలీసులు, రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులతో ఉమ్మడిగా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని నిబంధన ఉందని ప్రస్తావిస్తున్నారు. గత ప్రభుత్వం అన్ని ఆలయాలతో పాటు దేవదాయ శాఖ పరిధిలో నమోదు కాని ఆలయాలలో సైతం సీసీ కెమేరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టిందని గుర్తు చేస్తున్నారు. -
దేవుడా.. మరో ఘోరం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సాక్షి నెట్వర్క్: మొన్న తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు.. నిన్న సింహాచలంలో గోడ కూలి ఏడుగురు.. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కార్తీక ఏకాదశి సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏమాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఘటనకు ప్రధాన కారణం అని స్పష్టమవుతోంది. ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా పేరుగాంచిన ఈ ఆలయానికి కార్తీక ఏకాదశి రోజున వేలాదిగా భక్తులు వస్తారని తెలిసి కూడా బందోబస్తు ఇవ్వలేదు. ఆలయంలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మెట్లెక్కి పై అంతస్తుకు వెళ్తే అక్కడ వేంకటేశ్వరస్వామి దర్శనమిస్తారు. ఈ క్రమంలో దర్శనానికి వెళ్లే వారు.. దర్శనం చేసుకుని బయటకు వచ్చే వాళ్లతో ప్రవేశ మార్గం (రాకపోకలకు ఒకే మెట్ల మార్గం) కిక్కిరిసింది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు లేకపోవడంతో ఉదయం 11.45 గంటల సమయంలో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. దీంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు. తీవ్ర గందరగోళం ఏర్పడింది. కేకలు.. ఆర్తనాదాలు.. ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి.. ప్రాణ భయంతో మిగితా వారు కింద పడిన వారిని తొక్కుకుంటూ బయటకు వెళ్లడానికి దూసుకొచ్చారు. ఈ క్రమంలో భక్తుల ఒత్తిడి కారణంగా కుడి వైపు రెయిలింగ్ ఒరిగిపోయింది. దీంతో క్షణాల్లో ఘోరం జరిగిపోయింది. దీంతో కింద పడిపోయిన వారిలో ఊపిరి ఆడక తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ 20 మందిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మరికొంత మంది మెట్లపై నుంచి కిందకు దూకి గాయపడ్డారు. కింద పడిపోయిన తర్వాత వృద్ధులు, పిల్లలు లేచేందుకు ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదని.. ‘అమ్మా.. అయ్యా.. ఊపిరి అందడం లేదు.. మీకు దండం పెడతా.. చచ్చిపోతున్నా.. ఎవరైనా కాపాడాలంటూ..’ ప్రాధేయపడి అడుగుతున్నా ఎవరూ వినిపించుకునే పరిస్థితే లేకపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగిన ప్రదేశం క్షమార్హం కాని ప్రభుత్వ నిర్లక్ష్యంఈ ఆలయానికి కొంత కాలంగా ప్రతి శనివారం వేలాది మంది భక్తులు వస్తారనే విషయం అందరికీ తెలుసు. పైగా శనివారం కార్తీక ఏకాదశి. ఈ దృష్ట్యా భక్తులు మరింతగా తరలి వస్తారని ఎవరూ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగా పర్వదినాల్లో, కార్తీక మాసంలో ఆలయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకునేలా దిశా నిర్దేశం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఈ విషయంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పడానికి ఈ ఘోర ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. కాశీబుగ్గ ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చినా పోలీసుల పర్యవేక్షణ కొరవడింది. పైన ఉన్న ఆలయంలో మామూలుగా 2000 మంది భక్తులు ఉండటానికి అవకాశం ఉంటుంది. అయితే ఘటన జరిగే సమయానికి అంతకు రెండు మూడు రెట్లలో భక్తులు ఉన్నారు. వారంతా ఒక్కసారిగా కిందకు రావడానికి ప్రయత్నించడంతో మెట్లపై తోపులాట చోటు చేసుకుంది. వారు కిందకు రాకుండా నియంత్రించి ఉంటే ఇంతగా ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదని, ఇలా జరగడానికి కారణం ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని భక్తులు మండిపడుతున్నారు. మార్చురీ వద్ద పోలీసులతో వాగ్వాదం చేస్తున్న మృతుల బంధువులు తొలుత స్పందించిన వైఎస్సార్సీపీ నేతలువిషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, వైఎస్సార్సీపీ కార్యకర్తలంతా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మాజీ మంత్రి సీదిరి పలువురికి సీపీఆర్ చేశారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించడానికి చర్యలు తీసుకున్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష సంఘటనా స్థలానికి చేరుకోగా, కొంత సమయం తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు వచ్చారు. అనంతరం మృతదేహాలను తరలించే చర్యలు చేపట్టారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి తదితరులు సంఘటనా స్థలానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ కేవీ మహేశ్వర్‌రెడ్డి పోలీస్ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసులు ఆలయం, ఆస్పత్రితో పాటు పరిసర ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్నారు. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనలు, క్షతగాత్రుల కేకలతో ఆస్పత్రి దద్దరిల్లింది. డీఐజీ గోపినాథ్ జెట్టి ఆస్పత్రి వద్దకు చేరుకుని పోలీసులకు దిశా నిర్దేశం చేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ నర్తు రామారావు, వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ తదితరులు ఆస్పత్రిలో మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. శనివారం రాత్రి మంత్రి లోకేశ్ వచ్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించి మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు మృతులు, క్షతగాత్రుల బంధువులు మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శిరీషను నిలదీశారు. ఆలయ సమాచారమే ప్రభుత్వం వద్ద లేదట!ఏకాదశి కావడంతో 20 వేల నుంచి 25 వేల మంది ఒక్కసారిగా వచ్చారని అంచనా. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోంది. రహదారిపై 10–20 మంది నిరసన తెలపడానికి వస్తే.. వెంటనే ఆంక్షల పేరిట పెద్ద సంఖ్యలో పోలీసులు వాలి పోవడం చూస్తుంటాం. అలాంటిది ఏకాదశి రోజున వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వేలాది మంది భక్తులు తరలి వచ్చారని తెలిసినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోక పోవడం దారుణం అని భక్తులు మండిపడుతున్నారు. ఘటన జరిగిన తర్వాత వందల సంఖ్యలో పోలీసులను పెట్టి లాభమేమిటని ప్రజలు నిలదీస్తున్నారు. 20 మెట్లు ఎక్కే క్రమంలో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. క్షతగాత్రులను తరలించేందుకైనా.. మృతదేహాలను పక్కకు తీసేందుకైనా ప్రభుత్వ యంత్రాంగమెవరూ చాలా సేపటి వరకు అక్కడ అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఘటన తర్వాత భక్తుల సంఖ్యపై వేర్వేరు ప్రకటనలు చేశారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దాదాపు 20 వేల మందికిపైగా భక్తులు వచ్చారని చెబుతున్నారు. అసలు ఆలయ సమాచారమే ప్రభుత్వం వద్ద లేదని చెప్పుకొచ్చారు. ఇలా గందరగోళ ప్రకటనలు చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కాగా, మృతుల బంధువులు, క్షతగాత్రులకు ఏదైనా సాయం కావాలంటే 08942–240557 నంబర్‌కు సంప్రదించాలని అధికారులు తెలిపారు. పోలీసు దిగ్బంధంలో సీహెచ్‌సీ ఈ దుర్ఘటనలో మరణించినవారి మృతదేహాలను ఉంచిన కాశీబుగ్గ కమ్యూనిటీ హాస్పిటల్(సీహెచ్‌సీ) వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మృతుల బంధువులు అక్కడ ఆందోళన చేయకుండా చేశారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆందోళన చేస్తుండగా పోలీసులు బలవంతంగా తరలించారు.మృతుల వివరాలు1. ఏదూరి చిన్నమ్మి (50), రామేశ్వరం, టెక్కలి మండలం2. రాపాక విజయ (48), పిట్టలసరియా, టెక్కలి మండలం3. మురుపింటి నీలమ్మ (60), దుక్కవానిపేట, వజ్రపుకొత్తూరు మండలం4. దువ్వు రాజేశ్వరి (60), బెల్లుపటియా, మందస మండలం5. లొట్ల నిఖిల్ (13), బెంకిలి, సోంపేట మండలం6. డొక్కర అమ్ములమ్మ (54) పలాస–కాశీబుగ్గ7. చిన్ని యశోదమ్మ (56), శివరాంపురం, నందిగాం మండలం8. బోర బృంద (62), మందస9. రూప (52) గుడ్డిభద్ర, మందస మండలంతల్లికి కడుపుశోకంసోంపేట: కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనలో బెంకిలి గ్రామానికి చెందిన లొట్ల నిఖిల్(12) మృతిచెందడంతో అతని తల్లి అనుకు తీరని కడుపుశోకం మిగిలింది. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. నిఖిల్‌కు చిన్నతనం నుంచే వేంకటేశ్వరస్వామి అంటే అమితమైన భక్తి. జింకిబద్ర ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. దీపావళి నుంచి బెంకిలి, జింకిభద్ర గ్రామాల్లో గోవిందుని నగర సంకీర్తనల్లో పాల్గొంటున్నాడు. ఆరేళ్లుగా కార్తీక సంకీర్తనల్లో పాలుపంచుకుంటున్నాడు. శనివారం వేకువజామున గ్రామంలోని శివాలయానికి వెళ్లి స్వామి దర్శనం అనంతరం భక్తులతో కలిసి సంకీర్తన చేశాడు. ఉదయం 9 గంటలకు అమ్మ అనుతోపాటు, అక్క, మరికొందరితో కలిసి కాశీబుగ్గ వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్లాడు. 11 గంటల ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో అక్కడికక్కడే చనిపోయాడు. కొడుకు కళ్లెదుటే మరణించడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. పలాస ప్రభుత్వాస్పత్రి వద్ద అపస్మారకస్థితికి వెళ్లింది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. నిఖిల్ తండ్రి పాపారావు సోంపేట లోకనాథేశ్వర కలాసీ సంఘంలో కలాసీగా పనిచేస్తున్నారు.మృతులంతా సామాన్యులే⇒ సోంపేట మండలం బెంకిలి గ్రామానికి చెందిన బాలుడు నిఖిల్ తండ్రి పాపారావు కలాసీగా పని చేస్తున్నాడు. ⇒ టెక్కలి మండలం పిట్టలసరియా గ్రామానికి చెందిన రాపాక విజయ వ్యవసాయ కూలీ. ఈమె భర్త చిన్నారావు వ్యవసాయ కూలీగా పని చేస్తున్నారు.⇒ టెక్కలి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన యేదూరి చిన్నమ్మి భర్త గణపతిరావు మృతి చెందడంతో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.⇒ వజ్రపుకొత్తూరు మండలం దుక్కవానిపేట గ్రామానికి చెందిన మురిపింటి నీలమ్మ గృహిణి. భర్త కన్నయ్య మృతి చెందడంతో కుటుంబానికి పెద్దగా వ్యవహరిస్తోంది. ⇒ మందస మండలం బెల్లుపటియా గ్రామానికి చెందిన దువ్వు రాజేశ్వరి వ్యవసాయ కూలీ. ⇒ నందిగాం మండలం శివరాంపురం గ్రామానికి చెందిన చిన్ని యశోదమ్మ వృద్ధురాలు. కుటుంబం వ్యవసాయ ఆధారితంగా జీవనం సాగిస్తోంది. ఈమె ఇంటి పెద్దగా వ్యవహరిస్తోంది. ⇒ మందస మండలం గుడ్డిభద్ర గ్రామానికి చెందిన రూపది నిరుపేద కుటుంబ. ⇒ మందస గ్రామానికి చెందిన బోర బృందావతి భవన నిర్మాణ కార్మికురాలు.⇒ పలాస గ్రామానికి చెందిన డొక్కరి అమ్ములమ్మ సామాన్య గృహిణి. ఇప్పుడు ఏం చే ద్దామని వచ్చారు?మంత్రి అచ్చెన్న, ఎమ్మెల్యే శిరీషపై బాధితుల మండిపాటు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఇప్పుడు మీరు ఎందుకొచ్చారు? ఏం చేద్దామని వచ్చారు? చీమ చిటుక్కుమంటే తెలుసుకునే మీరు ఇక్కడికి ఇంత మంది భక్తులు వచ్చారని ముందుగా ఎందుకు తెలుసుకోలేకపోయారు? ప్రభుత్వంలో ఉన్నది మీరే కదా.. ఇక్కడ కనీసం ఒక్క పోలీసు అయినా లేరు. పట్టించుకునే వారే లేరు. వేలాది మంది భక్తులు వస్తే ఇలా చేస్తారా? ప్రమాదం జరిగిన తర్వాత కూడా చాలా సేపటి వరకు ప్రభుత్వం తరఫున ఎవరూ రాలేదు.. కనీసం వైద్యులు, అంబులెన్స్ అయినా పంపలేదు. అచ్చెన్నాయుడు, శిరీషలను ప్రశ్నిస్తున్న మృతుల కుటుంబ సభ్యులు మీ తీరు ఏం బాగోలేదు’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబీకులు, గాయపడ్డ వారు, ఇతర భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట అనంతరం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే శిరీష ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడే మృతదేహాల వద్ద రోదిస్తున్న వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లగా మంత్రిని చూసి బాధితుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ఘోరం జరిగిందని గట్టిగా నిలదీశారు. బాధితులు వేసే ప్రశ్నలకు మంత్రి, ఎమ్మెల్యే సమాధానం చెప్పలేని పరిస్థితిలో మౌనంగా ఉండిపోయారు.ఆపద్బాంధవుడు సీదిరి అప్పలరాజుపలువురి ప్రాణాలు కాపాడిన మాజీ మంత్రివజ్రపుకొత్తూరు రూరల్: ఆలయంలో జరిగిన తోపులాట ఘటనలో గాయపడిన వారికి వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అత్యవసర సేవలు అందించారు. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన స్వతహాగా వైద్యుడు కావడంతో తొక్కిసలాటలో ఊపిరి తీసుకోలేకపోతున్న వారిని, స్పృహ తప్పిన వారిని గుర్తించి సీపీఆర్ చేశారు. వృత్తి ధర్మం పాటిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. తోపులాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మహిళలకు సీపీఆర్ చేసి ప్రాణాలను నిలపడంతో పాటు, అంబులెన్స్‌ను రప్పించి.. ఆస్పత్రికి తరలించారు. అప్పలరాజు స్ఫూర్తితో పక్కనున్న వారు సైతం గాయపడ్డ వారికి సేవలందించారు. -
కాశీబుగ్గలో తొక్కిసలాట ఘటనపై ఆలయ నిర్వాహకులు రియాక్షన్
-
కాశీ బుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. ప్రమాదం ఎలా జరిగిందంటే ?
-
కాశీబుగ్గ ఆలయంలో అపశ్రుతి
హైదరాబాద్: నగరంలోని కిషన్ బాగ్ లో ఉన్న కాశీబుగ్గ ఆలయంలో సోమవారం మధ్యాహ్నం అపశృతి చోటు చేసుకుంది. భక్తులపై పడిన కరెంటు తీగలను తప్పించబోయి ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఆలయంలో దర్శనం కోసం క్యూలో నిలుచున్న భక్తులపైకి అకస్మాత్తుగా కరెంటు తీగ తెగిపడింది. దీంతో అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ అప్రమత్తమై తీగను తొలగించబోయారు. ఈ క్రమంలోనే ఆయన షాక్‌కు గురై మృతిచెందాడు. మృతి చెందిన కానిస్టేబుల్ శ్రీనివాస్ బహదూర్‌పురా స్టేషన్లో పని చేస్తున్నారని సమాచారం.


