విజయవాడలో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, పోతిన మహేష్ తదితరులు
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు బయటకొస్తాయి
కూటమి ప్రభుత్వం వచ్చాక ఆలయాల్లో ఇది మూడో దుర్ఘటన
కాశీబుగ్గ ఆలయ మృతులకు సంతాపంగా వైఎస్సార్‌సీపీ క్యాండిల్ ర్యాలీలు
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వరసామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు చనిపోవడం దురదృష్టకరం. మృతిచెందిన వారికి వైఎస్సార్‌సీపీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. అదే సమయంలో ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. అప్పుడే వాస్తవాలు బయటకొస్తాయి’ అని వైఎస్సార్‌సీపీ పేర్కొంది.
కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో మరణించినవారికి సంతాపం తెలియజేస్తూ ఆదివారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించింది. ‘ఏదైనా దుర్ఘటన జరిగిన తర్వాత సానుభూతి తెలియజేయడం, లేదంటే ఖండించడం చంద్రబాబు ప్రభుత్వానికి పరిపాటిగా మారింది.
కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో ఇది మూడో దుర్ఘటన. తిరుపతి, సింహాచలం, ఇప్పుడు కాశీబుగ్గతో కలిసి మూడు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలి.’ అని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు.
దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?
‘తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు, సింహాచలం ఘటనలో ఏడుగురు భక్తులు చనిపోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? అదే విషయాన్ని మేం ప్రశ్నిస్తే.. రాజకీయం చేస్తున్నామంటూ మా మీద బురదజల్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాశీబుగ్గ దేవాలయం ఏప్రిల్‌లో ప్రారంభమైంది. అప్పటి నుంచి భక్తులు దర్శనానికి వస్తున్నారు. ప్రతి శనివారం 1,500 నుంచి 2,000 మంది భక్తులు వస్తున్నారు.
కార్తీక ఏకాదశి కాబట్టి నిన్న(శనివారం) భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేయాల్సిన అవసరం ఉంది. కానీ, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆలయ నిర్వాహకులు ముందస్తు సమాచారం ఇవ్వలేదని బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. ఆలయ నిర్వాహకుడు మాత్రం ముందురోజే పోలీసులకు సమాచారం ఇచ్చామని చెబుతున్నారు. అయినా ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా స్పందించలేదు.
ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం నడుస్తుందా? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టం చేయాలి. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కాశీబుగ్గ ఘటనకు ముఖ్యమంతి, మంత్రులు, అధికారులు... ఎవరు బాధ్యత వహిస్తారు’ అని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.


