12 ఎకరాల్లో తిరుపతిని పోలిన ఆలయ నిర్మాణం..
రూ.5కోట్లతో తీర్చిదిద్దిన హరిముకుందాపండా
అనతికాలంలోనే ప్రాచుర్యం
అయినా ఆ గుడి తెలియదని మంత్రి ఆనం, టీడీపీ నేతల వితండవాదం
పలాస: కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయానికి అసంతృప్తితో బీజం పడింది. ఈ గ్రామానికి చెందిన హరిముకుందాపండా చాలా ఏళ్ల కిందట తిరుమల దర్శనానికి వెళ్లారు. దర్శనం సరిగా కాకపోవడంతో తీవ్రంగా కలత చెందాడు. తనకు మిగిలిన అసంతృప్తి ఇంకెవరికీ కలగకూడదని భావించాడు. వీరిది ఒడిశా రాజకుటుంబం. హరిముకుందా తపనను గుర్తించిన ఆయన తల్లి హరివిష్ణుప్రియపండా సొంతంగా మనమే ఆలయం కట్టుకుంటే సరిపోతుందని ప్రోత్సహించింది. తల్లి మాటతో హరిముకుందా ఆలయ నిర్మాణానికి ఉపక్రమించారు.
తిరుమల వేంకటేశ్వరస్వామిని పోలిన ఏకశిలా విగ్రహాన్ని తిరుమలలోనే తయారు చేయించి తీసుకొచ్చి ప్రతిష్టించారు. ఆలయాన్ని సుందరంగా నిర్మించారు. ఈ ఏడాది ప్రథమార్థంలోనే ప్రారంభించారు. ప్రతి శనివారం ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తులు భారీగా తరలివస్తుండడంతో అనతికాలంలోనే ఈ ఆలయం విశేష ప్రాచుర్యం పొందింది. సోషల్ మీడియాలోనూ ఆలయ వీడియోలు వైరల్ అయి ట్రెండింగ్ అయ్యాయి. ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా ఖ్యాతికెక్కింది. ప్రతీ శనివారం వేలల్లో భక్తులు వస్తుంటారని పర్వ దినాల్లో 10 వేల నుంచి 15వేల మంది వరకు వస్తుంటారని అంచనా. ఈ శనివారం ఏకాదశి కావడంతో 25వేల మందివరకు వచ్చి ఉంటారని తెలుస్తోంది. ఈ విషయాలన్నీ తెలిసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు.
మంత్రి ఆనం, మంత్రుల వితండ వాదన
ఇంతటి ప్రాచుర్యం పొందిన ఆలయం గురించి తమకు తెలియదని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించడం అందరినీ విస్తుగొలుపుతోంది. ఇతర మంత్రులు, టీడీపీ నేతలూ ఇది ప్రైవేటు ఆలయం అని, అక్కడ తొక్కిసలాట జరిగితే ప్రభుత్వానికి ఏం సంబంధమని వితండ వాదన చేయడంపై అందరూ ముక్కునవేలేసుకుంటున్నారు. ఈ ఆలయం తమ దృష్టిలో లేదని, ప్రభుత్వం వద్ద ఎక్కడా సమాచారం లేదని అబద్ధాలు వల్లె వేస్తున్నారు. బందోబస్తు కావాలని నిర్వాహకుడు అడగలేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.


