ప్రభుత్వ నిర్లక్ష్యమే మా వాళ్ల ప్రాణాలు బలిగొంది | Relatives of Kashibugga stampede victims angry over coalition government approach | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిర్లక్ష్యమే మా వాళ్ల ప్రాణాలు బలిగొంది

Nov 2 2025 5:08 AM | Updated on Nov 2 2025 5:08 AM

Relatives of Kashibugga stampede victims angry over coalition government approach

ఆస్పత్రి మార్చురీ వద్ద రోదిస్తున్న మృతులు, క్షతగాత్రుల బంధువులు

ఘటన తర్వాతా తీరిగ్గా పోలీసుల రాక 

కూటమి సర్కారు తీరుపై మృతులు, క్షతగాత్రుల బంధువుల ఆగ్రహం  

ప్రభుత్వమే మా వాళ్ల ప్రాణాలు బలిగొందని కాశీబుగ్గ తొక్కిసలాట బాధితుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని ధ్వజమెత్తారు. ఘటన జరిగిన తర్వాత పోలీసులు తీరిగ్గా వచ్చారని, భద్రతా చర్యలు అసలే లేవని విమర్శించారు. కూటమి సర్కారు తీరుపై ఆక్రోశించారు.

నా భార్య మరణానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం
స్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కనీస భద్రతా చర్యలు చేపట్టలేదు. నా భార్య మరణానికి ప్రభుత్వ వైఫ­ల్యమే కారణం. ఆలయం వద్ద ఒక్క పోలీసూ లేరు. సరైన బందోబస్తు నిర్వహించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. ఇది ముమ్మాటికీ అధికార యంత్రాంగం లోపమే. ఇంత నిర్లక్ష్యంగా పోలీసులు వ్యవహరించారు. అలాగే ఆలయ ధర్మకర్తలు కూడా సరైన ఏర్పాట్లు చేయలేదు. మా కుటుంబానికి తీరని దుఖం మిగిలింది.  నేను ఒంటరినయ్యాను. – మృతురాలు అమ్ములు భర్త రాజారావు, సూర్యకుండ కాలనీ, పలాస

సర్కారు నిర్లక్ష్యం వల్లే అమ్మ బలైంది
దైవ దర్శనానికి వెళ్లిన మా అమ్మ ప్రాణం పోయింది. ఆరోగ్యంగా వెళ్లిన అమ్మ విగత జీవిగా బయటకొచ్చింది. ప్రమాదానికి ప్రభు­త్వా­నిదే బాధ్యత. వేలాది మంది భక్తులు వస్తు­న్నారని తెలిసి కనీస భద్రతా చర్యలు చేపట్ట­లేదు. సర్కారు నిర్లక్ష్యం కొట్టిచ్చినట్టు కని­పిస్తోంది. ఇప్పుడు ఎంత నష్ట పరిహారం ఇస్తే ఏం ప్రయోజనం. మా అమ్మ తిరిగి వస్తుందా.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.
– రాజేశ్వరి కుమారుడు వైకుంఠరావు, బెల్లుపటియా, మందస మండలం

రక్షణ ఏర్పాట్లు లేవు
గుడి దగ్గర ఎలాంటి రక్షణ ఏర్పా­ట్లు లేవు. అంతమంది జనాలు వచ్చే గుడికి పోలీసులు కాపలా ఉండాలి. కానీ అక్కడ పోలీసులు లేరు. అన్నీ అయి­పోయాక పోలీ­సులు కాశీబుగ్గంతా నిండిపోయా­రు.   – రాపాక గవరయ్య, పిట్టల సరియా, మృతురాలు రాపాక విజయ బావ

సర్కారు పర్యవేక్షణేదీ? 
కార్తీక ఏకాదశి మంచిరోజని దేవుడి దర్శనం కోసం కాశీబుగ్గలోని చిన్న తిరుపతి వెళ్లాం. ఒక్కసారిగా తోపులాట జరగడంతో పడిపోయాం. మా వదిన మురిపింటి నీలమ్మపై జనాలు ఒక్కసారిగా పడిపోవడంతో ఆమె కింద పడిపోయి నా కళ్ల ముందే చనిపోయింది. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు.  – దుక్క తవిటమ్మ, దుక్కవానిపేట, వజ్రపుకొత్తూరు మండలం   

ఘోరానికి కారణం ప్రభుత్వమే  
నిఖిల్‌ను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఒంటరి చేసి వదిలివెళ్లిపోయాడు. మా కంటిదీ­పం ఆరిపోయినట్లయ్యింది. ప్రభు­త్వం నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించడం వల్లే ఈ దారుణం జరిగింది.    – లొట్ల పార్వతి, నిఖిల్‌ పెద్దమ్మ 
  
సరైన చర్యల్లేవు
తిరుపతి వెళ్లలేక దగ్గరలో ఉన్న కాశీ­బుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లాను. ప్రభుత్వం సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగింది. పోలీసులు కూడా లేకపోవడం వల్ల మహాఘోరం జరిగింది. తొక్కిసలాట ఘటనలో మా పిన్ని మృతి చెందింది. – కొర్రాయి అప్పయ్య, మృతురాలు యశోద అక్క కుమారుడు, శివరాంపురం

ఇంత నిర్లక్ష్యమా? కళ్లముందే ముగ్గురు మృతి
దర్శనం చేసుకొని బయటకు వచ్చే తలుపులు తీయడంతో ఒక్కసారిగా లోపలకి వెళ్లేవారు, బయటకు వచ్చేవారు తోసుకోవడంతో కింద పడిపోయాం. మా మీద మరి కొంత మంది పడిపోయారు. నా కిందనే పడిన ముగ్గురు ఆడవాళ్లు చనిపోయారు. కొద్ది సేపు అయి ఉంటే నేను కూడా చనిపోయే దాన్ని.  – కూర్మాపు హిమ, ప్రత్యక్ష సాక్షి, నందిగాం

ఇలాంటి కష్టం పగవాళ్లకూ రాకూడదు 
నేను నా భార్య దర్శనానికి వెళ్లాం. తోపులాటలో నా భార్య కిందపడిపోయింది. మరో ఐదుగురు ఒకరిపై ఒకరు పడ్డారు. ఆ క్షణం ఏం చేయాలో పాలుపోలేదు.  ఎలా­గో నా భార్యను కాపాడుకోగలిగాను. ఇ­లాంటి కష్టం పగవాళ్లకు కూడా రాకూడదు. – దుంప రుషికేశ్వరరావు, సీతారాంపురం, వజ్రపుకొత్తూరు మండలం 

ఒక్క పోలీసూ లేరు 
మాది వజ్రపుకొత్తూరు మండలం శివరాంపురం గ్రామం. మా బంధువులతోపాటు మరో 10 మంది దర్శనం కోసం వచ్చాం. దర్శనానికి వెళ్తుండగా మెట్ల వద్ద తోపులాట జరిగింది. 30 నిమిషాలకుపైగా ఆలయంలో ఇరుక్కుపోయాం. అనేక మంది మహిళలు కింద పడిపోయారు.  తొక్కిసలాట సమయంలో ఒక్క పోలీసూ లేరు. – దుబ్బ బోడెయ్య, షణ్ముఖరావు  

అంబులెన్సులూ సమయానికి రాలేదు  
మాది నందిగాం మండలం శివరాంపురం గ్రామం. ఏకాదశి రో­జు టెక్కలిలోని విష్ణుమూర్తి గుడికి వెళ్లాల్సి ఉంది. ఆధార్‌ కా­ర్డు ఉంటే ఉచితంగా బస్సులో ప్రయాణం చేయవచ్చునంటూ పలాస–కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి మా ఊరి వా­రితో కలిసి నా భార్య వెళ్లింది. దర్శనం చేసుకొని బయటకు వస్తుండగా తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడింది. జెమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. అంబులెన్సులూ సమయానికి రాలేదు.   – బోరసింగు కామేష్, నందిగాం  

ముప్పావు గంట ఊపిరాడలేదు.. సర్కారుదే పాపం
తొక్కిసలాటలో రెయిలింగ్‌ నుంచి మెట్ల పక్కన జారిపోయి కిందపడిపోయాను. నా మీద పది నుంచి పదిహేను మంది పడిపోయారు. ముప్పావు గంట వరకు పడిపోయిన నన్ను ఎవరూ బయటకు తీయలేదు. ఊపిరాడక పోవడంతో ప్రాణాలపై ఆశలు వదులుకున్నాను. తొక్కిసలాటలో నా కాళ్లు బెణికిపోయి, నడవలేని పరిస్థితి నెలకొంది. సరైన భద్రత చర్యలు తీసుకోని సర్కారుదే ఈ పాపం. – రోణంకి రమాదేవి, క్షతగాత్రురాలు, తేలినీలాపురం, టెక్కలి మండలం  

సహాయ చర్యల గురించి పట్టించుకోలేదు
ఉదయం 10 గంటలకు ఆలయానికి వెళ్లిన మేము 11.30 గంటలకు దర్శనం పూర్తిచేసుకుని తిరిగి వస్తుండగా ఒక్కసారిగా తలుపులు తెరవడంతో, బయట నుంచి వచి్చన భక్తులు లోపలికి వెల్లువలా పరుగులు తీశారు. దీంతో ఒకవైపు స్టీలు రెయిలింగ్‌  ఊడిపోయింది. దీంతో జనం మధ్య తొక్కిసలాట జరిగింది. నాకు  తీవ్ర గాయాలయ్యాయి.  సహాయక చర్యల గురించి సర్కారు పట్టించుకోలేదు.  – గున్న చిట్టెమ్మ, గణేష్‌ కాలనీ, నందిగాం గ్రామం 

తలుపు తీయడంతో తోపులాట  
దేవుడిని దర్శించుకుని బయటకు వచ్చే తోవలో ఉన్న గేటు వేసేశారు. తలుపు తీయకపోవడం వల్ల జనాలు పెరిగిపోయారు. తర్వాత ఒక్కసారిగా తలుపు తీయడంతో తోపులాట జరిగింది. కింద పడిపోయిన వారు చనిపోయారు.  – కొర్రాయి శీలమ్మ, శివరాంపురం, సంఘటన ప్రత్యక్ష సాక్షి  

ఆస్పత్రికి తీసుకెళ్లే నాథుడే లేడు
మా దర్శనం అయిపోయింది. బయటకు వస్తుండగా క్యూ ఆగిపోయింది. 10 నిమిషాలు అయ్యాక తోపులాట జరిగింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు మహిళలు కింద పడిపోయారు. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేవారెవరూ కానరాలేదు.  – చెలియ మోహిణి సరియాపల్లి, మందస మండలం 

ఘటన జరిగిన తర్వాతైనా స్పందించలేదు
మేము దర్శనానికి వెళ్లేటప్పుడు అంతా సజావుగా ఉంది. 10 గంటల సమయంలో రద్దీ బాగా పెరిగింది. ఆలయం లోపల ఉన్నాం. దర్శనం చేసుకొని బయటకు వస్తుండగా తొక్కిసలాట జరి­గింది. నాతో పాటు వచ్చిన పైల సీతమ్మ, నర్సమ్మలకు గాయాలయ్యాయి. ఘటన జరిగిన తర్వాతైనా సర్కారు స్పందించలేదు.   – పైల జయమ్మ, ధర్మవరం, ఇచ్ఛాపురం మండలం

భద్రత సర్కారు బాధ్యత కాదా?
మేము దర్శనం చేసుకొని వస్తున్నాం. గేటు వేసి ఉంది. ముందుకు వెళ్లేందుకు అవకాశం లేక మెట్లపై నిలబడ్డాం. వెనుక నుంచి అరుపులు వినిపించాయి. దీంతో ముందున్న తలుపులు తెరిచారు. ఒక్క సారి అందరం ముందుకు వెళ్లాం. అప్పుడే తొక్కిసలాట జరిగింది. ఎలాగో తప్పించుకొని బయటపడ్డాం.  ఇది సర్కారు పాపమే. భద్రత సర్కారు బాధ్యత కాదా?– పిట్ట జగన్నాయకులు, ధర్మవరం  

ప్రభుత్వం వల్ల రెండుకాళ్లూ పోయాయ్‌ 
కార్తీక ఏకాదశి నాడు భక్తిభావంతో వేంకటేశ్వరస్వామి గుడికి వ­చ్చా­ను. ఇక్కడ సరైన బందోబస్తు లేకపోవడంతో తొక్కిసలాటలో రెండు కాళ్లూ పోగొట్టుకొన్నాను. మా కుటుంబానికి తీవ్ర నష్టం ఏర్పడింది. ప్రభుత్వమే ఆదుకోవాలి.  – చెలియా కాంతమ్మ, సరియాపల్లి, మందస మండలం  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement