సాక్షి, తాడేపల్లి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో YSRCP బృందం పర్యటించింది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో సంఘటన స్థలాన్ని పార్టీ బృందం పరిశీలించింది.


ముందుగా.. తొక్కిసలాట బాధితులను పార్టీ నేతలు పరామర్శించారు. బాధితులకు అందిస్తున్న వైద్యంపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆరా తీశారు. వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందంలో శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యన్నారాయణ, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త కురసాల కన్నబాబు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సహా పలు నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు, నాయకులు ఉన్నారు.

కాశీబుగ్గలో తొక్కిసలాట దురదృష్టం: బొత్స సత్యనారాయణ
కాశీబుగ్గలో తొక్కిసలాట దురదృష్టం. మా పార్టీ తరఫున బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఈ ప్రభుత్వం వచ్చాక 17 నెలల్లో తొక్కిసలాట జరగడం ఇది మూడోసారి. ప్రతీ శనివారం కాశీబుగ్గ ఆలయానికి వేలాదిగా భక్తులు వస్తారు. అంచనా వెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. చంద్రబాబు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఘటనకు ముందురోజే సమాచారం ఇచ్చానని ఆలయ ధర్మకర్త చెప్పారు. కాశీబుగ్గలో స్థానిక పోలీసులు ఏం చేస్తున్నారు.

కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిగి.. ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడాలి. తిరుపతి, సింహాచలం ఘటనల్లో ఎవరి మీద చర్యలు తీసుకున్నారు. పోలీసులు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా..?. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..? లేదా..?. సనాతన ధర్మం అని పెద్ద పెద్ద మాటలు చెప్తారు. బయటకు చెప్పే మాటలు వేరు.. చేష్టలు వేరు.. దేవుడికి కూడా కోపం ఉంది అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. సమగ్ర విచారణ జరపాలి. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలి. ప్రభుత్వ పెద్దలు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలి. సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలి. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి. నిమిత్తమాతృలం అంటే కుదరదు. ప్రజలకు సమాధానం చెప్పాలి. నష్ట పరిహారం రూ. 25 లక్షలు డిమాండ్ చేస్తున్నాం’’ అని బొత్స పేర్కొన్నారు.


