అప్పట్లో కోవిడ్ బారినపడటంతో పాటు దాని లక్షణాలు చాలాకాలంపాటు కొనసాగిన లాంగ్ కోవిడ్‌తోనూ బాధపడ్డ మహిళల్లో రుతుస్రావకాలం మరింత సుదీర్ఘంగా ఉంటోందంటూ ఓ అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధన అంశాలను సైన్స్ / మెడికల్ జర్నల్ అయిన ‘నేచర్’లో ప్రచురితమయ్యాయి. కోవిడ్ అంటే ఏమిటో అందరికీ తెలిసిందే. ఇక లాంగ్ కోవిడ్ కూడా చాలామందికి గుర్తుండే ఉంటుంది. దాని గురించి పెద్దగా తెలియనివాళ్ల కోసం ‘లాంగ్ కోవిడ్’ అంటే ఏమిటో చూద్దాం.
లాంగ్ కోవిడ్ అంటే...
అప్పట్లో కోవిడ్ పాజిటివ్ సమయంలో బాధితుల్లో కొన్ని లక్షణాలు కనిపించేవి. ఉదాహరణకు జ్వరం వచ్చి తగ్గాక విపరీతమైన నీరసం, నిస్సత్తువలతో పాటు రుచి, వాసనలు తెలియకపోవడం వంటి లక్షణాలు కనిపించేవి. ఇక కొంతకాలం తర్వాత కరోనా వైరస్ తాలూకు చురుకుదనం దేహంలో బాగా తగ్గి΄ోయాక కోవిడ్–19 పరీక్షలు చేయిస్తే... వాటిల్లో నెగెటివ్ వచ్చిన తర్వాత కూడా కొందరిలో కోవిడ్ తాలూకు లక్షణాలు కొనసాగుతూ ఉండేవి. అలా కొనసాగుతున్న లక్షణాలను డాక్టర్లు ‘లాంగ్ కోవిడ్’గా చెప్పేవారు.
కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కొందరిలో చాలా కాలం వరకు కొన్ని రకాల సమస్యలు బాధితులను వేధిస్తూ ఉండేవి. ఒక ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గాక ఆ తర్వాత కూడా కొన్ని సమస్యలు కనిపిస్తూనే ఉంటాయనీ, అవన్నీ చాలా సాధారణమంటూ మొదట్లో వైద్యులు కొట్టి΄ారేసినా, తర్వాత్తర్వాత మాత్రం ఇవి ఒక కొత్త రకమైన జబ్బుని సూచిస్తున్నట్లు కనిపించాయంటూ డాక్టర్లలో చాలామంది పేర్కొన్నారు. అలా నెగెటివ్ ఫలితాలు వచ్చాక కూడా అనేక జబ్బుల తాలూకు లక్షణాలు కనిపించడాన్ని ‘లాంగ్ కోవిడ్’గా వ్యవహరించారు.
లాంగ్‌కోవిడ్‌కు ఉన్న మరికొన్ని పేర్లు...
అమెరికన్ హెల్త్ సంస్థ అయిన ఎన్‌ఐహెచ్ వారు దీనికి ‘పీఏఎస్‌సీ’ అని పేరు పెట్టారు. అంటే ‘పీఏఎస్‌సీ’ అనే సంక్షిప్త నామానికి విస్తరణే పోస్ట్ అక్యూట్ సీక్వెల్ ఆఫ్ కోవిడ్ 19’. ఈ లక్షణాలతో బాధపడే వారిని ‘లాంగ్ హాలర్స్’ అని కూడా కొందరు పిలిచారు. మరి కొంతమంది దీన్ని ‘ఆన్ గోయింగ్ సింప్టమాటిక్ కోవిడ్ 19’ అనీ లేదా ‘క్రానిక్ కోవిడ్–19 సిండ్రోమ్’ అని కూడా పేర్కొన్నారు.
పేషెంట్లే కనిపెట్టిన జబ్బు...
సాధారణంగా ప్రపంచంలో అత్యధికమైన జబ్బులను డాక్టర్లు కనిపెడతారు. అయితే ఈ లాంగ్ కోవిడ్ మాత్రం పేషెంట్లు కనిపెట్టి వాళ్లు డాక్టర్లను అప్రమత్తం చేశారు. మొదట్లో చాలా మంది డాక్టర్లు ఈ విషయం చెప్పిన పేషెంట్ల వాదనను కొట్టిపడేశారు.
వాస్తవానికి లాంగ్ కోవిడ్ అనే పేరుని ‘ఎలీసా పెరెగో’ అనే ఇటలీకి చెందిన బాధిత పేషెంట్ మొట్టమొదటిసారిగా వాడారు. లాంగ్ కోవిడ్ అనేది ఒక ప్రత్యేకమైన జబ్బు అనీ, దాన్ని అర్థం చేసుకోవడానికీ, చికిత్స చేయటానికి ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమవుతోందని ప్రపంచవ్యాప్తంగా చాలామంది డాక్టర్లు గుర్తించారు.
డాక్టర్ మాధురి మొవ్వ, సీనియర్ ఆబ్‌స్టిట్రీషియన్, గైనకాలజిస్ట్ – లాపరోస్కోపిక్ సర్జన్
(చదవండి: గుండె రంధ్రాలా..? గుబులొద్దు!)


