రెస్టారెంట్లలో బిల్లులతో పాటు అడ్డగోలుగా సర్వీస్ ఛార్జ్ పేరిట వినియోగదారులపై అదనపు భారం మోపుతున్న హోటళ్లపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. బిల్లులో కస్టమర్ల అనుమతి లేకుండా సర్వీస్ ఛార్జ్ కలపడం, దానిని తొలగించమని కోరినా నిరాకరించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న 41 ప్రముఖ రెస్టారెంట్లపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) సుమోటోగా చర్యలు ప్రారంభించింది.
వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ విషయంపై స్పందిస్తూ.. ‘రెస్టారెంట్లు వినియోగదారులను సర్వీస్ ఛార్జ్ చెల్లించమని బలవంతం చేయడానికి వీల్లేదు. ఇది పూర్తిగా కస్టమర్ ఆప్షన్’ అని స్పష్టం చేశారు. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (ఎన్‌సీహెచ్)కు అందిన వేలాది ఫిర్యాదుల ఆధారంగా సీసీపీఏ ఈ చర్యలు చేపట్టింది.
కోర్టు తీర్పుతో మారిన సమీకరణాలు
వాస్తవానికి, జులై 2022లోనే సీసీపీఏ రెస్టారెంట్లలో నిర్బంధ సర్వీస్ ఛార్జ్ విధించడాన్ని అనుచిత వ్యాపార ధోరణిగా అభివర్ణిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే, రెస్టారెంట్ అసోసియేషన్లు దీన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. గత ఏడాది (మార్చి 2025) ఢిల్లీ హైకోర్టు సీసీపీఏ మార్గదర్శకాలను సమర్థిస్తూ తీర్పునివ్వడంతో చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.
వినియోగదారులు తెలుసుకోవాల్సినవి..
ఆహార పదార్థాలు, వాటిపై పడే పన్నులు మాత్రమే కస్టమర్లు చెల్లించాల్సి ఉంటుంది. రెస్టారెంట్ అందించే సేవ నచ్చితే టిప్ లేదా సర్వీస్ ఛార్జ్ ఇవ్వడం వినియోగదారుడి ఇష్టం. బిల్లులో సర్వీస్ ఛార్జ్ ఉంటే దానిని తీసివేయమని అడిగే హక్కు కస్టమర్‌కు ఉంది. హోటల్ యాజమాన్యం నిరాకరిస్తే అది చట్టరీత్యా నేరం. సర్వీస్ ఛార్జ్ అనేది అధికారిక పన్ను కానందున దానిపై జీఎస్టీ విధించడం నిబంధనలకు విరుద్ధం.
ఫిర్యాదు చేయడం ఎలా?
ఒకవేళ ఏ రెస్టారెంట్ అయినా సర్వీస్ ఛార్జ్ బలవంతంగా వసూలు చేస్తే వినియోగదారులు జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1915 ద్వారా లేదా ఎన్‌సీహెచ్ యాప్/పోర్టల్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. మార్గదర్శకాల అమలు స్థాయి నుంచి ప్రత్యక్ష చర్యల దిశగా కేంద్రం వేసిన ఈ అడుగు వినియోగదారుల హక్కుల పరిరక్షణలో కీలక మైలురాయిగా నిలవనుంది.
ఇదీ చదవండి: మళ్లీ టాప్ గేర్‌లోకి పసిడి.. నేటి ధరలు ఇలా..


