గ్యాస్‌ చార్జీలు వసూలు చేస్తే.. ప్రభుత్వం వార్నింగ్‌ | CCPA Directs Hotels And Restaurants To Stop Charging Extra For Gas On Customers, More Details Inside | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ చార్జీలు వసూలు చేస్తే.. ప్రభుత్వం వార్నింగ్‌

Mar 26 2026 10:25 AM | Updated on Mar 26 2026 10:43 AM

Stop Charging Extra for Gas Govt Warns Hotels and Restaurants

న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారులపై ఎల్‌పీజీ ఛార్జీలు, గ్యాస్‌ సర్‌చార్జ్, ఫ్యూయల్‌ కాస్ట్‌ రికవరీ పేరుతో ఎలాంటి అదనపు చార్జీలు విధించవద్దని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ విభాగం (సీసీపీఏ) ఆదేశించింది. ఈ తరహా అనుచిత వాణిజ్య విధానాలను అనుసరిస్తే వినియోగదారుల పరిరక్షణ చట్టం, 2019 కింద కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. హోటళ్లు, రెస్టారెంట్ల మెనూల్లో పేర్కొన్న చార్జీలకు అదనంగా పన్నుల వరకే విధించగలరని స్పష్టం చేసింది.

అన్ని రకాల తయారీ వ్యయాలు (ముడి సరుకులు, ఎల్‌పీజీ, విద్యుత్‌ సహా) మెనూ చార్జీల్లో భాగంగానే ఉండాలని, విడిగా ఎలాంటి చార్జీలు వసూలు చేయరాదని పేర్కొంది. తాము ఈ పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఉల్లంఘనలను గుర్తిస్తే వినియోగారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. దేవవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్‌ పేరుతో అదనపు చార్జీలు తీసుకుంటున్నట్టు తన దృష్టికి రావడంతో సీసీపీఏ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ తరహా చార్జీలు చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది.  

చార్జీల బాదుడుపై ఫిర్యాదు 
అదనపు చార్జీలు వసూలుపై వినియోగదారులు ముందుగా హోటల్‌ను సంప్రదించి వాటిని తొలగించాలని కోరొచ్చని సీసీపీఏ సూచించింది. ఫలితం లేకపోతే 1915కు కాల్‌ చేసి లేదా ఎన్‌సీహెచ్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. అలాగే ఈ–జాగృతి పోర్టల్‌ ద్వారా వినియోగదారుల కమిషన్‌ ముందు ఫిర్యాదు దాఖలు చేయొచ్చని లేదా జిల్లా కలెక్టర్, సీసీపీఏకి నేరుగా ఫిర్యాదు చేయవచ్చని సూచించింది.

Advertisement
 
Advertisement
Advertisement