breaking news
Extra charge
-
'సువిధ' దోపిడీ
- ప్రత్యేక రైళ్ల పేరుతో అదనపు చార్జీలు - వివిధ మార్గాల్లో 53 సువిధ రైళ్లు ప్రకటించిన ద.మ.రైల్వే సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది బడ్జెట్లో కొత్త రైళ్లకు స్వస్తి చెప్పిన రైల్వే శాఖ ‘బాదుడు’ రైళ్లను పట్టాలెక్కించనుంది. వేసవి సెలవుల దృష్ట్యా రద్దీ ఉండే మార్గాల్లో 53 ‘సువిధ’ రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. దీంతో ప్రయాణికులపై సాధారణ చార్జీలపైన రెట్టింపు భారం పడనుంది. ఒకవైపు చార్జీలు పెంచకుండా మరోవైపు కొత్త రైళ్లను ప్రకటించకుండానే.. ఉన్న రైళ్లనే నడిపి అదనపు ఆదాయాన్ని ఆర్జించే లక్ష్యంతో సువిధ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. సువిధ రైళ్లను విశాఖ-సికింద్రాబాద్, తిరుపతి-సికింద్రాబాద్ మార్గాల్లో ఏప్రిల్, మే, జూన్ నెల ల్లో ఈ రైళ్లను నడుపనున్నారు. ఈ రైళ్లలో సాధారణ చార్జీలు ఉండవు. ఏసీ, నాన్ ఏసీ బోగీల్లో తత్కాల్‌తోనే చార్జీలు మొదలవుతాయి. ఉదాహరణకు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణంకు విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్‌క్లాస్ చార్జీ రూ.365 ఉంటుంది. కానీ సువిధ రైళ్లలో ఇది తత్కాల్ చార్జీలతో అంటే రూ.470తో మొదలవుతుంది. మొదటి 25 బెర్తుల వరకు ఈ చార్జీలుంటాయి. ఆ తరువాత 26వ బెర్తు నుంచి నుంచి 50వ బెర్తు వరకు రెట్టింపవుతాయి. 51వ బెర్తు నుంచి 72వ బెర్తు వరకు రెట్టింపు కన్నా ఎక్కువే ఉంటుంది. ఈ మార్గాల్లో సువిధ రైళ్లు... విశాఖ-సికింద్రాబాద్, విశాఖ-తిరుపతి మార్గాల్లో మొత్తం 53 సువిధ రైళ్లను ఈ వేసవిలో నడుపనున్నారు. ఈ మేరకు విశాఖపట్టణం-సికింద్రాబాద్ (08501/08502) సువిధ సూపర్ ట్రైన్ ఏప్రిల్ 5,12,19,26 మే 3,10,17,24,31 తేదీల్లో, జూన్ 7,14,21,28 తేదీల్లో(ప్రతి మంగళవారం) రాత్రి 11 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 6,13,20,27, మే 4,11,18,25,జూన్ 1,8,15,22,29 (ప్రతి బుధవారం) తేదీల్లో సాయంత్రం 4.30 కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30 కు విశాఖకు చేరుకుంటాయి. విశాఖ-తిరుపతి సువిధ వీక్లీ ట్రైన్ (08573/08574) ఏప్రిల్ 4,11,18,25 మే 2,9,16,23,30 తేదీల్లో, జూన్ 6,13,20,27 తేదీల్లో (ప్రతి సోమవారం) రాత్రి 10.55 కు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.15కు తిరుపతికి చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 5,12,19,26,మే 3,10,17,24,31, జూన్ 7,14,21,28 (ప్రతి మంగళవారం) తేదీల్లో రాత్రి 10.55 కు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.15కు విశాఖ చేరుకుంటాయి. -
నో ఎక్స్ట్రా చార్జ్
ప్రొద్దుటూరు: ఆర్టీసీ ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయవద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటికే తమ టికెట్లు రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులకు కూడా డబ్బు తిరిగి చెల్లిస్తున్నారు. సోమవారం సాయంత్రం నుంచి ఈ వ్యవహారం జిల్లాలోని అన్ని డిపోల్లో జరుగుతోంది. సాధారణంగా ఆర్టీసీ అధికారులు ఉన్న సర్వీసులకు మినహా కొత్తగా ఒక్క సర్వీసును ఏర్పాటు చేసినా ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేసే విధానాన్ని అనవాయితీగా పెట్టుకున్నారు. టికెట్లను బట్టి స్పెషల్ సర్వీసులు ఏర్పాటు చేస్తుంటారు. నిబంధనలకు విరుద్ధంగా దూర ప్రాంతాలకు సైతం సూపర్ లగ్జరీ స్థానంలో డీలక్స్ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌కు ప్రొద్దుటూరు నుంచి రూ.300 టికెట్ ఉంటే స్పెషల్ సర్వీసు పేరుతో రూ.450 వసూలు చేస్తున్నారు. సీజన్, అన్ సీజన్ లేకపోయినా కొత్త సర్వీసు ఏర్పాటు చేస్తే ఈ విధంగా చార్జీలను వసూలు చేస్తుంటారు. అయితే ఇక నుంచి ప్రత్యేక సందర్భాలు (పండుగలు, ఉత్సవాలు) మినహా సాధారణ రోజుల్లో అదనపు చార్జీలు వసూలు చేయొద్దని ఆర్టీసీ అధికారులకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే డబ్బు చెల్లించిన ప్రయాణికులకు వెంటనే తిరిగి చెల్లించాల్సిందిగా కోరారు. దీంతో సోమవారం రాత్రి నుంచే అన్ని డిపోల్లో స్పెషల్ సర్వీసులకు సంబంధించిన అదనపు డబ్బును ప్రయాణికులకు తిరిగి చెల్లించడం మొదలైంది. ఆర్టీసీ అధికారులను ఈ విషయంపై న్యూస్‌లైన్ వివరణ కోరగా ఇది కొత్త నిబంధన ఏమీ కాదని తొలి నుంచి ఉన్నదేనన్నారు. పండుగ వేళల్లో మినహా సాధారణ రోజుల్లో అదనపు చార్జీలు వసూలు చేయొద్దన్నారు. ఒక్క ప్రొద్దుటూరులోనే ఇప్పటికే 10 స్పెషల్ సర్వీసులకు సంబంధించిన సీట్లు రిజర్వ్ కావడం గమనార్హం. ఇలా జిల్లాలోని అన్ని డిపోల్లో స్పెషల్ సర్వీసులు ఏర్పాటు కాగా వారందరికి ఆర్టీసీ యాజమాన్యం డబ్బు తిరిగి చెల్లిస్తోంది.