కమోడిటీ కొత్త ఫ్యూచర్స్‌కు సెబీ చెక్‌

Govt bans futures trading in 7 commodities - Sakshi

ముడిపామాయిల్, తదితర 7 వ్యవసాయోత్పత్తుల డెరివేటివ్స్‌పై నిషేధం

న్యూఢిల్లీ: వ్యవసాయోత్పత్తుల డెరివేటివ్‌ కొత్త కాంట్రాక్టులపై క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా కన్నెర్ర చేసింది. వెంటనే అమల్లోకి వచ్చే విధంగా ముడిపామాయిల్, పెసరపప్పు, గోధుమలు తదితర 7 వ్యవసాయ సంబంధ కమోడిటీలలో కొత్తగా ప్రవేశపెట్టే ఫ్యూచర్స్‌(కాంట్రాక్టులు)ను నిషేధించింది. తద్వారా పెరుగుతున్న ధరల(ద్రవ్యోల్బణం)కు చెక్‌ పెట్టేందుకు చర్యలు తీసుకుంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న కాంట్రాక్టులలో పొజిషన్లను ముగించుకునేందుకు(స్క్వేరింగ్‌ అప్‌) అనుమతిస్తూనే.. కొత్త పొజిషన్లకు చెక్‌ పెట్టింది.

తాజా ఆదేశాలు ఏడాది కాలంపాటు అమలులో ఉంటాయని సెబీ స్పష్టం చేసింది. బాస్మతియేతర ధాన్యం, గోధుమలు, సోయాబీన్, తత్‌సంబంధ ఉత్పత్తులు, ముడిపామాయిల్, పెసరపప్పు వంటి ఉత్పత్తులలో తదుపరి ఆదేశాలు జారీ చేసేటంతవవరకూ కొత్త కాంట్రాక్టులను ప్రవేశపెట్టకుండా నిలువరించింది. ఈ జాబితాలో సెనగలు, ఆవాలు, సంబంధిత ఉత్పత్తుల డెరివేటివ్స్‌ను సైతం జాబితాలో చేర్చింది. కాగా. ఈ కమోడిటీలలో డెరివేటివ్‌ కాంట్రాక్టులను ఈ ఏడాది మొదట్లోనే నిషేధించినట్లు విశ్లేషకులు తెలియజేశారు.

ద్రవ్యోల్బణంపై పడుతున్న ఆహార సరుకుల ప్రభావాన్ని అరికట్టే బాటలోనే సెబీ 7 వ్యవసాయ కమోడిటీల డెరివేటివ్స్‌ను ఏడాదిపాటు సెబీ నిషేధించినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపక్‌ జసానీ అభిప్రాయపడ్డారు. కాగా.. వీటిలో కొత్త పొజిషన్లు తీసుకునేందుకు అనుమతించబోమని నేషనల్‌ కమోడిటీ అండ్‌ డెరివేటివ్‌ ఎక్సే్ఛంజీ(ఎన్‌సీడీఈఎక్స్‌) తాజాగా తెలియజేసింది. ఉన్న పొజిషన్లను ముగించేందుకు మాత్రమే అనుమతించనున్నట్లు పేర్కొంది. అనుమతించిన కొన్ని కమోడిటీలలోనే ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టులకు వీలుంటుందని వివరించింది. సెబీ నిషేధించిన కమోడిటీలలో తదుపరి ఆదేశాలు జారీ అయ్యేటంతవరకూ కొత్తగా ఫ్యూచర్స్, ఆప్షన్స్‌ కాంట్రాక్టులను ప్రవేశపెట్టబోమని వెల్లడించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top