న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో వంటగ్యాస్ సరఫరాపై నీలినీడలు కమ్ముకోవడంతో, దేశీయంగా ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్‌ల వినియోగాన్ని ప్రోత్సహించడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇండక్షన్ స్టవ్‌ల తయారీ పెంపుతో పాటు ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో.. ఓడల రవాణాకు ఆటంకం ఏర్పడి గ్యాస్ సరఫరా తగ్గడం తెలిసిందే. దీంతో ప్రజలు తాత్కాలికంగా ఇండక్షన్ స్టవ్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు.
కీలక మార్పులు..
ఇండక్షన్ స్టవ్‌ల తయారీలో వినియోగించే కీలక విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ భావిస్తోంది. అలాగే, ప్రస్తుతం ఉన్న 18% జీఎస్టీని 5%కి తగ్గించాలని సిఫారసు చేసింది.
మార్చి 25 నుంచి ఏప్రిల్ 21 మధ్య 467 సీఎన్‌జీ, బయో గ్యాస్ స్టేషన్ల ఏర్పాటుకు దరఖాస్తులు రాగా, వెంటనే పరిష్కరించారు. ఇందులో 157 స్టేషన్లకు తుది లైసెన్సులు సైతం మంజూరయ్యాయి.
ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లు రాత్రి వేళల్లో కూడా పనిచేసేలా ఏప్రిల్ 2న కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి. దీనివల్ల ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరగనుంది.


