గూగుల్‌ నుంచి ‘స్నోకోన్‌’, దాని వెనుక చరిత్ర ఏంటో తెలుసా ? | Sakshi
Sakshi News home page

గూగుల్‌ నుంచి ‘స్నోకోన్‌’, దాని వెనుక చరిత్ర ఏంటో తెలుసా ?

Published Wed, Oct 6 2021 1:30 PM

Googles Android 12 Has A Dessert Codename Snow Cone - Sakshi

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో గూగుల్‌కి ఎదురే లేదు. యాపిల్‌ నుంచి తీవ్ర పోటీ నెలకొన్నా గూగుల్‌కి చెందిన ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ స్థానం చెక్కు చెదరడం లేదు. ఆండ్రాయిడ్‌కి పోటీగా హువావే, శామ్‌సంగ్‌, వన్‌ప్లస్‌లు కొత్త ఓఎస్‌లు అభివృద్ధి చేసినా ఆండ్రాయిడ్‌ ముందు నిలవలేకపోయాయి. కాగా గూగుల్‌ సరికొత్త ఓఎస్‌ ఆండ్రాయిడ్‌ 12 రిలీజ్‌ చేసేందుకు రెడీ అయ్యింది. 

స్నో కోన్‌
రెండేళ్ల గ్యాప్‌ తర్వాత గూగుల్‌ మరోసారి పాత సంప్రదాయం కొనసాగించేందుకు రెడీ అయ్యింది. మరోసారి తమ అప్‌డేట్‌లకు ఐస్‌క్రీమ్‌ల పేరు పెట్టే సంప్రదాయం కొనసాగించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా త​‍్వరలో రిలీజ్‌ కాబోతున్న గూగుల్‌ అప్‌డేట్‌కి స్నోకోన్‌గా పేరు పెట్టింది.

ముందుగా పిక్సెల్‌
ఎప్పటిలాగే పిక్సెల్‌ ఫోన్‌లకే ముందుగా స్నోకోన్‌ అప్‌డేట్‌ని అందివ్వనుంది గూగుల్‌. ఆ తర్వాత ఒప్పో, వన్‌ప్లస్‌ సంస్థలకు అందివ్వనుంద. ఇక మోటరోలా సైతం ఈ అప్‌డేట్‌ని ముందుగా అందుకునే కంపెనీల జాబితాలో ఉంది. స్నోకోన్‌లో ప్రైవసీ సెట్టింగ్స్‌, థీమ్స్‌లో కొత్త ఫీచర్లు జోడించినట్టు సమాచారం.2008లో మొదలు
ఫీచర్‌ ఫోన్లు రాజ్యమేలుతున్న కాలంలో స్మార్ట్‌ఫోన్లుగా యాపిల్‌ రంగ ప్రవేశం ఓ సంచలనంగా మారింది. ఆ వెంటనే బ్లాక్‌బెర్రీ మెస్సేజింగ్‌ యాప్‌తో మార్కెట్‌లో చొచ్చుకుపోయింది. భవిష్యత్తు ఈ రెండు ఫోన్లదే అనుకునే తరుణంలో 2008 సెప్టెంబరులో ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో గూగుల్‌ తెర మీదకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదురన్నదే లేకుండా గూగుల్‌ ఆండ్రాయిడ్‌ విజయ ప్రస్థానం కొనసాగుతోంది. 

ఐస్‌క్రీమ్‌ల పేరు
గూగుల్‌ 2008 సెప్టెంబరు 23న రిలీజ్‌ చేసిన ఆపరేటింగ్‌ సిస్టమ్‌కి 1.0 పేరుతో కోడ్‌ నేమ్‌ ఇచ్చింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ప్రతీ ఏడు ఆపరేటింగ్‌ సిస్టమ్‌కి కొత్త మెరుగులు దిద్దుతూ కొత్త కోడ్‌ నేమ్‌తో వస్తోంది. రెండో సారి వచ్చిన ఆప్‌డేటెడ్‌ ఓఎస్‌కి 1.1 కోడ్‌ నేమ్‌ ఇచ్చింది. ఆ తర్వాత 2009లో వచ్చిన మూడో అప్‌డేట్‌ నుంచి ఓఎస్‌లకు పలు రకాల ఐస్‌క్రీమ్‌ల పేరుతో కోడ్‌ నేమ్‌ ఇవ్వడం మొదలు పెట్టింది గూగుల్‌. 

కప్‌కేక్‌తో మొదలు
2009 ఏప్రిల్‌లో విడుదలైన ఆపరేటింగ్‌ సిస్టమ్‌కి కప్‌కేక్‌గా కోడ్‌ నేమ్‌ ఇచ్చింది గూగుల్‌. ఆ తర్వాత వరుసగా డోనట్‌, ఎక్లయిర్స్‌, ఫ్రోయో, జింజర్‌బ్రెడ్‌, హనీకోంబ్‌, ఐస్‌క్రీం శాండ్‌విచ్‌, కిట్‌కాట్‌, లాలీపాప్‌, మార్ష్‌మాలో, నౌగట్‌, ఓరియో, పై వరకు వరుసగా తొమ్మిది అప్‌డేట్‌లకి ఐస్‌క్రీమ్‌ల పేరు పెట్టింది.

టెన్‌తో బ్రేక్‌
గూగుల్‌ అప్‌డేట్స్‌కి ఐస్‌క్రీమ్‌ల పేరు పెట్టడంతో ఆండ్రాయిడ్‌ యూజర్లలో ఎంతో క్రేజ్‌ వచ్చింది. దీంతో గూగుల్‌ తదుపరి అప్‌డేట్‌కి ఏం పేరు పెడుతుందనే అంశంపై ఆసక్తి పెరిగింది. 9వ అప్‌డేట్‌ అయిన పై తర్వాత వచ్చే అప్‌డేట్‌కి కోడ్‌నేమ్‌ క్యూగా ఇచ్చింది గూగుల్‌. కానీ అప్‌డేట్‌ విడుదలైన తర్వాత క్యూ స్థానంలో 10 వచ్చి చేరింది. ఆ తర్వాత అప్‌డేట్‌కి సైతం ఐస్‌క్రీం పేరు ఇవ్వకుండా ఆండ్రాయిడ్‌ 11గానే గూగుల్‌ పేర్కొంది. 

చదవండి : 2ఎస్‌వీ.. ఇక యూజర్‌ పర్మిషన్‌ లేకుండానే! హ్యాకర్లకు చుక్కలే!

Advertisement
 
Advertisement
 
Advertisement