ప్రముఖ టెక్ దిగ్గజం ఆల్ఫాబెట్ సంస్థకు చెందిన గూగుల్ ఏఐ రంగంలో మరో చారిత్రక మైలురాయిని చేరుకుంది. డెవలపర్లు, గ్లోబల్ వ్యాపార సంస్థలు, అత్యాధునిక పరిశోధనల కోసం సరికొత్త ఫ్రాంటియర్ ఏఐ మోడల్ ‘జెమిని 4 ఆర్గాన్’ (Gemini 4 Argon)ను గూగుల్ అధికారికంగా విడుదల చేసింది. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, సంక్లిష్టమైన ఎంటర్ప్రైజ్ వర్క్‌ఫ్లోలు, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి క్లిష్టమైన రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి దీన్ని రూపొందించారు.
అటానమస్ ఏజెంట్లు, కోడింగ్‌లో రికార్డులు
సాధారణ ప్రశ్నోత్తరాల దశ దాటి స్వయంప్రతిపత్తిగా దీర్ఘకాలిక, బహుళ పనులను పూర్తి చేసేలా ‘ఆర్గాన్’ను తీర్చిదిద్దారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ కోడింగ్ రంగంలో ఇది మెరుగ్గా పని చేస్తుందని కంపెనీ తెలిపింది. గూగుల్ ఏఐ డెవలప్మెంట్ టూల్స్, ‘యాంటీగ్రావిటీ’ ప్లాట్‌ఫారమ్‌లో దీన్ని ఇంటిగ్రేట్ చేశారు. దీని సహాయంతో తమ ఇంజినీరింగ్ బృందాలు ఏజెంట్ ఆధారిత కోడ్ సబ్మిషన్లను 35 శాతానికి పైగా పెంచుకున్నట్లు గూగుల్ ప్రకటించింది.
రోబోటిక్స్, సైన్సెస్ రంగాల్లో ముందడుగు
కేవలం కోడింగ్ మాత్రమే కాకుండా భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకునే సామర్థ్యంలో ఆర్గాన్ అగ్రగామిగా నిలిచింది. ‘ఎంబోడిడ్ రీజనింగ్’ (ఈఆర్క్యూఏ) బెంచ్‌మార్క్‌లో ఇది 87% స్కోర్ సాధించి హ్యుమనాయిడ్ రోబోటిక్స్, ట్రాజెటరీ ప్లానింగ్ రంగాలకు ఊతమిస్తోంది. అలాగే క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్, న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ డిజైన్, నూతన ఎంజైముల తయారీ వంటి శాస్త్రీయ పరిశోధనల్లోనూ ఇది కీలక పాత్ర పోషిస్తోంది.
ధరలు ఇలా..
గ్లోబల్ మార్కెట్లో డెవలపర్లు, ఎంటర్ప్రైజ్ కస్టమర్ల కోసం జెమిని ఏపీఐ, గూగుల్ క్లౌడ్ ద్వారా ఇది అందుబాటులోకి వచ్చింది. వ్యాపార వృద్ధిని ప్రోత్సహించేందుకు నవంబర్ 30, 2026 వరకు దీనికి ప్రత్యేక ఆఫర్ ధరలను ప్రకటించారు. మిలియన్ ఇన్పుట్ టోకెన్‌కు 2 డాలర్లు, అవుట్‌పుట్ టోకెన్‌కు 10 డాలర్లు ప్రారంభ ధరగా నిర్ణయించగా క్యాష్డ్ ఇన్పుట్ టోకెన్లపై ఏకంగా 95% డిస్కౌంట్ ఇస్తున్నారు.
ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్.. ఇదే మంచి ఛాన్స్!


