టెక్నాలజీ ప్రపంచంలో ఏజెంటిక్ యుగం మొదలైందని, గూగుల్‌లో జరుగుతున్న భారీ మార్పులే దీనికి నిదర్శనమని ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. గూగుల్ క్లౌడ్ నెక్స్ట్ 26 వార్షిక సదస్సు సందర్భంగా ఆయన రాసిన ‘ది కీవర్డ్’ బ్లాగ్ పోస్ట్‌లో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం గూగుల్‌లో రాసే కొత్త కోడ్‌లో 75 శాతం ఏఐ ద్వారానే రూపొందుతోందని స్పష్టం చేశారు.
ఏజెంటిక్ యుగంలోకి..
గత ఏడాది ఇదే సమయానికి ఏఐ ద్వారా తయారయ్యే కోడ్ 50 శాతం ఉండగా ఇప్పుడు అది 75 శాతానికి చేరుకోవడం గమనార్హం. కేవలం కోడ్ రాయడమే కాకుండా మన ఇంజినీర్లు దాన్ని సమీక్షించి ఆమోదిస్తున్నారని పిచాయ్ పేర్కొన్నారు. ‘మేము ఇప్పుడు రియలిస్టిక్ ఏజెంటిక్ వర్క్ ఫ్లోలకు మారుతున్నాం. మా ఇంజినీర్లు ఇప్పుడు పూర్తి స్వయంప్రతిపత్తి డిజిటల్ టాస్క్ ఫోర్స్‌లను నిర్వహిస్తున్నారు. ఊహించని పనులను సుసాధ్యం చేస్తున్నారు’ అని చెప్పారు.
వేల సంఖ్యలో ఏజెంట్ల నిర్వహణ
గతంలో ‘మనం ఒక ఏఐ ఏజెంట్‌ను నిర్మించగలమా?’ అనే చర్చ ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితి ‘వేల సంఖ్యలో ఉన్న ఏజెంట్లను ఎలా నిర్వహించాలి?’ అనే స్థాయికి చేరుకుందని పిచాయ్ తెలిపారు. దీనికోసం గూగుల్ జెమిని ఎంటర్‌ప్రైజ్ ఏజెంట్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిందని చెప్పారు.
ఆరు రెట్లు వేగంగా పనులు
గూగుల్ తన సొంత ఎకోసిస్టమ్‌లో ఏఐని వినియోగించడం వల్ల వచ్చిన మార్పులను ఆయన ఉదాహరణలతో వివరించారు.
గతంలో ఇంజినీర్లు మాత్రమే చేసిన పని కంటే ఇప్పుడు ఏజెంట్లు, ఇంజినీర్లు కలిసి చేయడం వల్ల కోడ్ మైగ్రేషన్ ప్రక్రియ 6 రెట్లు వేగంగా పూర్తయింది.
మాక్‌ఓఎస్ (macOS)లోని జెమిని యాప్‌ను గూగుల్ సొంత ‘ఏజెంట్-ఫస్ట్’ ప్లాట్‌ఫామ్ ‘యాంటీ గ్రావిటీ’ని ఉపయోగించి తయారు చేసినట్లు చెప్పారు. ఇందులో అటానమస్ ఏఐ ఏజెంట్లు మానవ జోక్యం లేకుండానే బ్రౌజర్‌లో అప్లికేషన్లను ప్లాన్ చేయడం, కోడ్ రాయడం, పరీక్షించడం వంటి పనులు పూర్తి చేస్తున్నాయి.
క్లౌడ్ కంప్యూటింగ్, సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్‌లో గూగుల్ ప్రవేశపెట్టిన ఈ నూతన ఆవిష్కరణలు టెక్ ప్రపంచంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతాయని నిపుణులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!


