రూ.53వేలు దాటిన బంగారం

Gold prices today rise for 10th day in a row, silver rates drop - Sakshi

10రోజూ అదే జోరు

ఈ 10రోజుల్లో రూ.5,500లు జంప్‌

అంతర్జాతీయంగానూ అదే వైఖరి

ర్యాలీకి మద్దతిస్తున్న ఫెడ్‌ వడ్డీరేట్ల యథాతథ వైఖరి

దేశీయంగా బంగారం ధర పరుగు ఆపడం లేదు. వరుసగా 10రోజూ పెరిగింది. ఈ క్రమంలో మల్టీ కమోడిటి ఎక్చ్సేంజ్‌లో 10గ్రాముల బంగారం ధర రూ.53వేల స్థాయిని అధిగమించింది. ఈ 10రోజుల్లో బంగారం ధర ఏకంగా రూ.5,500 లాభపడింది. అంతర్జాతీయంగా బంగారం ధర పెరగడంతో గురువారం ఉదయం సెషన్‌లో రూ.242లు లాభపడి రూ. 53429 వద్ద గరిష్టాన్ని తాకింది. ఈ ధర పసిడికి ఎంసీఎక్స్‌లో జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఆయా దేశాల ప్రభుత్వాలు ఉద్దీపన చర్యలను ప్రకటించవచ్చనే అంచనాలతో బంగారంపై పలువురు బులియన్‌ విశ్లేషకులు ఇప్పటికీ బుల్లిష్‌ వైఖరినే కలిగి ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధర దేశీయంగా 35శాతం పెరిగింది.

26ఏళ్ల కనిష్టానికి బంగారం డిమాండ్‌: 
ఈ ఏడాదిలో భారత్‌లో బంగారం డిమాండ్‌ 26ఏళ్ల కనిష్టానికి పడిపోవచ్చని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనా వేసింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకోవడంతో భారత్‌లోకి దిగుమతులు తగ్గిపోయే అవకాశం ఉందని, తద్వారా డిమాండ్‌ క్షీణించే అకాశం ఉందని డబ్ల్యూజీసీ తన నివేదికలో తెలిపింది. అయితే భారత్‌ వాణిజ్య లోటు డబ్ల్యూజీసీ చెప్పుకొచ్చింది.

కరోనా ప్రేరిపిత లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ జూన్‌ క్వార్టర్‌లో బంగారం డిమాండ్‌ పదేళ్ల కనిష్టస్థాయిని చవిచూసింది. ఈ తొలిక్వార్టర్‌లో బంగారం డిమాండ్‌ 70శాతం క్షీణించి 63.7 టన్నులు నమోదైనట్లు డబ్ల్యూజీసీ తెలిపింది. అలాగే ఈ ఏడాది తొలిభాగంలో వార్షిక ప్రాతిపదిక భారత్‌లో బంగారం వినియోగం 56శాతం క్షీణించినట్లు తన నివేదికలో తెలిపింది.

అంతర్జాతీయంగా అదే వైఖరి: 
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం అదే జోరును కొనసాగిస్తోంది. వరుసగా 9రోజూ లాభపడింది. ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర నిన్నరాత్రి అమెరికాలో ముగింపు(1,953.40డాలర్లు)తో పోలిస్తే 10డాలర్ల లాభంతో 1963డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ బలహీనత, కీలక వడ్డీరేట్లపై యథాతథపాలసీకే ఫెడ్‌రిజర్వ్‌ కట్టుబడి ఉన్నట్లు ప్రకటించడం, అమెరికా-చైనాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు, పెరుగుతున్న కోవిడ్‌-19 కేసులు బంగారం ర్యాలీకి మద్దతునిస్తున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top