
బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే తులం (10 గ్రాములు) పసిడి ధర రూ.లక్ష దాటేసింది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 3,350 డాలర్ల వద్ద ఉంది. అయితే రాబోయే రోజుల్లో పుత్తడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బులియన్ ధరను నడిపించే అనేక అంశాలు రానున్న రోజుల్లో ఉన్నాయని చెబుతున్నారు.
ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ఏం మాట్లాడతారు.. అమెరికా, బ్రిటన్, యూరోజోన్ సహా ప్రధాన ఆర్థిక వ్యవస్థల గ్లోబల్ పీఎంఐ డేటా వంటి అంశాలను ట్రేడర్లు నిశితంగా పరిశీలించనున్నారు. బంగారం రేట్లు ఎలా ఉండబోతున్నాయనేదానికి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల నిర్ణయాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీటిలో ఏ అంశాలు బంగారం ధరకు అనుకూలంగా పనిచేసినా పసిడి రేటు పెరుగుతుంది.
అమెరికా ప్రకటించినా ప్రతీకార సుంకాల అమలు తేదీ ఆగస్టు 1 డెడ్‌లైన్ సమీపిస్తుండటంతో వాణిజ్య చర్చలపై అనిశ్చితి బంగారం సేఫ్ హెవెన్ డిమాండ్‌కు ఊతమిచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు దేశీయ పండుగల డిమాండ్ కూడా బంగారం ధరల పెరుగుదలకు మరింత ఊతమిస్తుందని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈబీజీ - కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మెర్ తెలిపారు.
వెంచురా కమోడిటీ అండ్ సీఆర్ఎం హెడ్ ఎన్ఎస్ రామస్వామి ప్రకారం.. బలహీనమైన యూఎస్ డాలర్, భౌగోళిక రాజకీయ నష్టాలు, బలమైన పెట్టుబడిదారుల డిమాండ్, సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు కొనసాగడం వంటి సరైన ఉత్ప్రేరకాలు కార్యరూపం దాలిస్తే, 2025 ప్రథమార్ధంలో బలమైన 26 శాతం పెరుగుదల తర్వాత ద్వితీయార్ధంలోనూ బంగారం మరో 4-8 శాతం లాభపడవచ్చు.