బంగారం అంత పెరగదులే! | Gold Price Forecast JP Morgan Slashes Rise In Gold Prices, Sees Limited Upside In 2026, More Details Inside | Sakshi
Sakshi News home page

బంగారం అంత పెరగదులే!

Jul 5 2026 9:00 AM | Updated on Jul 5 2026 12:44 PM

Gold Price Forecast JP Morgan Slashes rise in gold prices

ప్రపంచ బంగారం మార్కెట్‌పై ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ ‘జేపీ మోర్గాన్’ తన స్వల్పకాలిక అంచనాలను తగ్గించింది. కీలక రంగాల నుంచి బంగారం కొనుగోళ్లు గతంలో ఊహించినంత బలంగా ఉండకపోవడంతో ఈ ఏడాది ధరల పెరుగుదల పరిమితంగానే ఉండొచ్చని పేర్కొంది. తాజా నివేదిక ప్రకారం.. మూడో త్రైమాసికంలో (Q3) బంగారం సగటు ధర ఔన్స్‌కు 4,300 డాలర్లు (10 గ్రాములకు సుమారు రూ.1.32 లక్షలు), నాలుగో త్రైమాసికంలో (Q4) 4,500 డాలర్లు (10 గ్రాములకు సుమారు రూ.1.38 లక్షలు)చేరే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఇది గత నెలలో ప్రకటించిన ఏడాది చివరినాటికి 6,000 డాలర్ల (10 గ్రాములకు సుమారు రూ.1.84 లక్షలు) లక్ష్యంతో పోలిస్తే గణనీయమైన తగ్గింపే. బ్యాంకు ప్రకారం.. అమెరికా ఆర్థిక గణాంకాలు వేసవి కాలంలో అంచనాల కంటే బలంగా వస్తే, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ముందుగానే పెంచే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితిలో వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారం ఆకర్షణ తగ్గి, పెట్టుబడిదారులు అధిక రాబడులు ఇచ్చే ఇతర ఆస్తులవైపు మొగ్గు చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో బంగారం ధరలపై దిగువ ఒత్తిడి ఏర్పడవచ్చని తెలిపింది.

అయితే దీర్ఘకాలికంగా మాత్రం జేపీ మోర్గాన్ తన సానుకూల దృక్పథాన్ని కొనసాగించింది. ప్రపంచ కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు, భౌతిక డిమాండ్ మళ్లీ బలపడడం వంటి అంశాలతో 2027లో బంగారం మరోసారి బలమైన ర్యాలీ చేసే అవకాశముందని పేర్కొంది.

ఇదిలా ఉండగా, జూలై 3 ట్రేడింగ్‌లో స్పాట్ గోల్డ్ ధర 1.3 శాతం పెరిగి ఔన్స్‌కు 4,174.21 డాలర్ల వద్ద ట్రేడైంది. ఇది జూన్ 23 తర్వాత అత్యధిక స్థాయి కాగా, వారాంతానికి బంగారం ధరలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి.

ఇతర విలువైన లోహాలపై కూడా బ్యాంకు అంచనాలు వెల్లడించింది. వెండి ధరలు ఔన్స్‌కు 60–65 డాలర్ల  మధ్య సగటున ఉండొచ్చని, దక్షిణాఫ్రికాలో సరఫరా పరిమితుల కారణంగా ప్లాటినం ధరలు 2026 చివరికి 1,800 డాలర్లు, 2027 చివరికి 1,950 డాలర్లు చేరవచ్చని తెలిపింది. మరోవైపు, పల్లాడియం ధరలు 2026 చివరికి ఔన్స్‌కు 1,350 డాలర్లు, 2027లో సగటున 1,300 డాలర్ల వద్ద ఉండొచ్చని అంచనా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement