జీఎంఆర్‌ చేతికి ఇండోనేషియా ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్టు

GMR Airports wins bid for Medan Airport development - Sakshi

25 ఏళ్ల పాటు మెడాన్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్వహణ, అభివృద్ధి కాంట్రాక్టు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాలో భాగమైన జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ (జీఏఎల్‌) తాజాగా ఇండోనేషియాలో ఒక విమానాశ్రయ ప్రాజెక్టును దక్కించుకుంది. మెడాన్‌లోని క్వాలానాము ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధి, నిర్వహణకు కోసం అత్యధికంగా బిడ్‌ చేసిన సంస్థగా నిల్చింది. మెడాన్‌ ఎయిర్‌పోర్ట్‌ బిడ్డింగ్‌ అథారిటీ అయిన అంకాశ పురా 2 (ఏపీ2) ఈ విషయాన్ని ప్రకటించినట్లు జీఎంఆర్‌ వెల్లడించింది. వ్యూహాత్మక భాగస్వామి ఎంపికకు సంబంధించి గెలుపొందిన బిడ్డర్‌గా తమ సంస్థ పేరును ఖరారు చేసినట్లు పేర్కొంది.

ఈ ప్రాజెక్టులో జీఎంఆర్‌కు 49 శాతం, ఏపీ2కు 51 శాతం వాటాలు ఉంటాయి. కాంట్రాక్టు ప్రకారం 25 ఏళ్ల పాటు విమానాశ్రయ నిర్వహణ, అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంటుంది. బిడ్డింగ్‌ లాంఛనాలు పూర్తి చేశాక, వచ్చే కొద్ది రోజుల్లో లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌ జారీ అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆఖర్లోగా ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్టు దక్కించుకోవడంపై జీఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్‌ (ఇంధనం, అంతర్జాతీయ విమానాశ్రయాల విభాగం) శ్రీనివాస్‌ బొమ్మిడాల హర్షం వ్యక్తం చేశారు. మెడాన్‌ ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయ హబ్‌గా తీర్చిదిద్దుతామని, ఇండొనేషియాలోని ఇన్‌ఫ్రా అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తామని ఆయన పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top