జనరల్‌ మోటార్స్‌ సాఫ్ట్‌వేర్ ప్రక్షాళన | General Motors Restructures IT Workforce With 600 Layoffs to AI Future | Sakshi
Sakshi News home page

జనరల్‌ మోటార్స్‌ సాఫ్ట్‌వేర్ ప్రక్షాళన

May 13 2026 1:48 PM | Updated on May 13 2026 1:53 PM

General Motors Restructures IT Workforce With 600 Layoffs to AI Future

ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ తన ఐటీ విభాగంలో భారీ మార్పులు చేపట్టింది. భవిష్యత్తు అంతా కృత్రిమ మేధ(ఏఐ) చుట్టూనే తిరగనుందని భావిస్తున్న కంపెనీ అందుకు అనుగుణంగా తన శ్రామిక శక్తిని పునర్నిర్మించే పనిలో పడింది. ఈ క్రమంలో తన ఐటీ విభాగం నుంచి సుమారు 600 మందికి పైగా ఉద్యోగులకు లేఆఫ్స్‌ విధించింది.

నైపుణ్యాల మార్పిడి వ్యూహం

ఈ తొలగింపులు కేవలం ఖర్చు తగ్గించుకోవడానికో లేదా ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికో చేసినవి కావని, ఇది ఒక స్పష్టమైన నైపుణ్యాల మార్పిడి వ్యూహమని విశ్లేషకులు భావిస్తున్నారు. కంపెనీ ఐటీ విభాగంలోని మొత్తం సిబ్బందిలో ఇది 10 శాతం కంటే ఎక్కువ. సాంప్రదాయ ఐటీ పాత్రల కంటే, ఏఐ-కేంద్రీకృత సాంకేతికతలలో ప్రవేశం ఉన్న నిపుణుల కోసం కంపెనీ వెతుకుతోంది. ‘భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో జీఎం భారీ మార్పులు చేస్తోంది’ అని సంస్థ ప్రతినిధి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

ఏఐ వైపు వేగంగా..

ఒకవైపు ఉద్యోగులను తొలగిస్తున్నప్పటికీ జీఎం కొత్త నియామకాలను ఆపలేదు. అయితే, ఇప్పుడు కంపెనీ ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయి. కంపెనీ ప్రస్తుతం కీలక రంగాల్లో నిపుణుల కోసం వేట సాగిస్తోంది. అందులో.. ఏఐ-నేటివ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్లు, డేటా ఇంజినీరింగ్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిపుణులు, మెషిన్ లెర్నింగ్ మోడల్స్‌ తయారీ నిపుణులపై ఫోకస్‌ పెట్టింది.

కొత్త దిశగా అడుగులు

గత 18 నెలలుగా జీఎం తన టెక్నాలజీ విభాగంలో ప్రక్షాళన చేస్తూనే ఉంది. 2024 ఆగస్టులో కూడా సుమారు 1,000 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను తొలగించింది. 2025లో స్టెర్లింగ్ ఆండర్సన్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా చేరిన తర్వాత ఈ పరివర్తన మరింత వేగవంతమైంది. సాఫ్ట్‌వేర్, టెక్నాలజీ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చే ప్రక్రియను ఆయన ముమ్మరం చేశారు. ఇటీవలే యాపిల్ మాజీ ఉద్యోగి బెహ్రాద్ తోఘిని ఏఐ లీడ్‌గా, మాజీ క్రూయిజ్ ఎగ్జిక్యూటివ్ రషీద్ హక్‌ను అటానమస్ వెహికల్స్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించుకోవడం ద్వారా తన ఉద్దేశాన్ని కంపెనీ చాటిచెప్పింది.

ఇదీ చదవండి: బంగారం షాక్‌.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు

Advertisement
 
Advertisement
Advertisement