ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ కంటే డెట్‌ ఫండ్స్‌ మెరుగైనవా? | Fundamental Difference Between Fixed Deposits And Det Funds | Sakshi
Sakshi News home page

ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ కంటే డెట్‌ ఫండ్స్‌ మెరుగైనవా?

Sep 6 2021 7:49 AM | Updated on Sep 6 2021 9:33 AM

Fundamental Difference Between Fixed Deposits And Det Funds - Sakshi

ఇండెక్స్‌ ఫండ్స్‌లో రాబడులు ఎంత? బ్యాంకు ఎఫ్‌డీల కంటే మీడియం లాంగ్, మీడియం డ్యురేషన్‌ ఫండ్స్‌ మెరుగైనవా?    – కీర్తి నందన
Fixed Deposits and Debt funds : భద్రత పాళ్లు అధికంగా ఉండే బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను (ఎఫ్‌డీలు) డెట్‌ ఫండ్‌తో పోల్చి చూడడం సరికాదు. ఎఫ్‌డీలపై రాబడులు దాదాపుగా గ్యారంటీడ్‌ (హామీతో కూడిన)గా ఉంటాయి. బ్యాంకులు సంక్షోభంలో పడితే డిపాజిటర్ల డబ్బులు (గరిష్టంగా రూ.5లక్షల వరకు) 90 రోజుల్లోపు చెల్లించేలా డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌ను ప్రభుత్వం సవరించింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోలిస్తే డెట్‌ ఫండ్స్‌పై రాబడుల విషయంలో ఎటువంటి హామీ లభించదు. రాబడుల విషయంలో ఏ మ్యూచువల్‌ ఫండ్‌కూడా హామీ ఇవ్వదు. కాకపోతే పెట్టుబడులను నష్టపోకుండా స్థిరమైన రాబడులకు అయితే అవకాశం ఉంటుంది. కానీ మీడియం లేదా లాంగ్‌ డ్యురేషన్‌ (కాల వ్యవధి) ఫండ్స్‌కు ఇది వర్తించదు.

కొన్ని ఫండ్స్‌లో పెట్టుబడుల విలువ పడిపోదు. ఉదాహరణకు ఓవర్‌నైట్‌ ఫండ్స్‌లో రాబడులు సేవింగ్‌ ఖాతా కంటే ఎక్కువ ఉండవు. అల్ట్రా షార్ట్‌ టర్మ్, షార్ట్‌ టర్మ్‌ ఫండ్స్‌ అన్నవి ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మాదిరే, కొన్ని సందర్భాల్లో కొంచెం అధిక రాబడులను ఇచ్చే విధంగా పనిచేస్తాయి. స్వల్ప కాలానికి ఎఫ్‌డీలతో ఈ ఫండ్స్‌ను పోల్చి చూడొద్దు. ఎందుకంటే కొన్ని డెట్‌ ఫండ్స్‌ స్వల్పకాలంలో విలువను కోల్పోవచ్చు. 2–4 ఏళ్ల కాలానికి అయితే ఎఫ్‌డీల కంటే అధిక రాబడులు అందుకోవచ్చు.

ఇక పన్ను చెల్లింపు రెండో అంశం అవుతుంది. ఎఫ్‌డీలు, డెట్‌ ఫండ్స్‌ రాబడులపై పన్ను వేర్వేరుగా ఉంటుంది. డిపాజిట్లపై వచ్చే ఆదాయానికి ఏటా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అది వెనక్కి తీసుకున్నా లేదా క్యుములేటివ్‌ అయినా ఇదే వర్తిస్తుంది. డెట్‌ ఫండ్స్‌లో రాబడులపై పన్ను అన్నది విక్రయించిన తర్వాతే అమల్లోకి వస్తుంది. మూడేళ్లకు పైగా డెట్‌ ఫండ్స్‌లో పెట్టుబడులను కొనసాగించినట్టయితే.. రాబడుల్లోంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించిన తర్వాత పన్ను చెల్లిస్తే చాలు. ఈ ప్రయోజనాల వల్ల దీర్ఘకాలంలో ఎఫ్‌డీల కంటే డెట్‌ ఫండ్స్‌లో కాస్త మెరుగైన రాబడులు అందుకోగలరు.

పదిహేనేళ్ల కాలానికి పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా సెన్సెక్స్‌ లేదా నిఫ్టీ ఫండ్‌ ఏదైనా ఉందా? 16 నుంచి 17 శాతం వార్షిక రాబడులు రావాలి. అది కూడా రోజువారీగా ఆ పథకాన్ని పర్యవేక్షించాల్సిన అవసరం ఉండకూడదు?     – ఆర్‌ఎస్‌ దహియా 
వచ్చే 15 ఏళ్ల కాలానికి నిఫ్టీ లేదా సెన్సెక్స్‌ 16–17 శాతం చొప్పున వార్షిక రాబడులు ఇస్తాయే, లేదో నాకు తెలియదు. ఒకవేళ వడ్డీ రేట్లు 5–7 శాతం స్థాయికి పరిమితమైతే అప్పుడు వార్షిక రాబడులు 12 శాతం ఉన్నా కానీ మెరుగైనవే. సుదీర్ఘకాల చరిత్ర ఉన్న ఇండెక్స్‌ ఫండ్‌ పనితీరును గమనిస్తే.. చాలా ఆకట్టుకునే విధంగా కనిపిస్తుంది. కానీ, గత పనితీరు అన్నది భవిష్యత్తుకు సంకేతం కాదు. రానున్న కాలంలో భిన్నమైన పనితీరును చూపించే అవకాశం కూడా లేకపోలేదు.

నిఫ్టీ, సెన్సెక్స్‌ గురించి మాట్లాడుతుంటే అది లార్జ్‌క్యాప్‌ కంపెనీల గురించే. సాధారణ మార్కెట్‌కు అనుగుణంగానే లార్జ్‌క్యాప్‌ కంపెనీల పనితీరు ఉంటుంది. సెన్సెక్స్‌లోని కొన్ని కంపెనీలు అసాధారణ పనితీరు చూపించొచ్చు. కొన్ని నిరుత్సాహపరచొచ్చు. ఇండెక్స్‌ ఫండ్‌లో మీరు ఇన్వెస్ట్‌ చేసేట్టు అయితే రాబడులు దీర్ఘకాలంలో సహేతుకంగా ఉంటాయి. అంతేకాదు స్థిరాదాయ పథకాల కంటే అధికంగా, ద్రవ్యోల్బణం కంటే ఎక్కువే ఉంటాయి. కనుక ఆ రాబడులు మంచివే.

- ధీరేంద్రకుమార్‌, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

చదవండి: Insurance Policy: ఈ పాలసీలు.. ఎంతో సులభం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement