SBI: లాభాలు తెచ్చి పెట్టే ఈ 'ఈక్విటీ ఫండ్‌' గురించి మీకు తెలుసా?

Fund Review On Sbi Focused Equity Fund Growth - Sakshi

ఈక్విటీల్లో మెరుగైన రాబడులు ఆశించే వారు ఫోకస్డ్‌ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ పథకాలు భారీ సంఖ్యలో స్టాక్స్‌ను తమ పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉండవు. ఎంపిక చేసిన కొన్ని స్టాక్స్‌పైనే ఫోకస్‌ (ప్రత్యేక దృష్టి) పెడతాయి. ఈ విభాగంలో ఎస్‌బీఐ ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌ నమ్మకమైన పనితీరు ప్రదర్శిస్తోంది. అన్ని రకాల మార్కెట్లలోనూ లాభాలు ఇవ్వగల స్టాక్స్‌ను గుర్తించి ఇన్వెస్ట్‌ చేయడం ఈ పథకం ప్రత్యేకత. కనుక ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లకు ఇదొక మంచి పెట్టుబడి ఆప్షన్‌ అవుతుంది. ఈ పథకానికి 2009 నుంచి ఆర్‌ శ్రీనివాసన్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇదొక అనకూలత. గతంలో ఎస్‌బీఐ ఎమర్జింగ్‌ ఫండ్‌తో నడిచిన ఈ పథకం పేరు ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌గా మారింది. 

పెట్టుబడుల విధానం 
ఫోకస్డ్‌ ఈక్విటీ పథకాల్లో సుదీర్ఘకాల ట్రాక్‌ రికార్డు ఈ పథకం సొంతం. పోర్ట్‌ఫోలియోలో 25 స్టాక్స్‌ వరకు నిర్వహిస్తుంటుంది. మిగిలిన ఈక్విటీ పథకాల మాదిరిగా కాకుండా... ఫోకస్డ్‌ ఈక్విటీ విభాగంలోని పథకాలు తక్కువ స్టాక్స్‌ను పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉంటాయి. ప్రస్తుతం పోర్ట్‌ఫోలియోలో 25 స్టాక్స్‌ ఉన్నాయి. టాప్‌ 10 స్టాక్స్‌లోనే 50 శాతం మేర పెట్టుబడులు ఉన్నాయి.

ఇందులోనూ ముత్తూట్‌ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్‌ బ్యాంకు, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, పీఅండ్‌జీ హైజీన్, దివిస్‌ ల్యాబ్స్‌లో అత్యధికంగా ఇన్వెస్ట్‌ చేసి ఉంది. పెట్టుబడుల్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ రంగ కంపెనీలను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 30 శాతం పెట్టుబడులను కేటాయించింది. ఆ తర్వాత హెల్త్‌కేర్‌ రంగ కంపెనీల్లో 12 శాతం, సేవల రంగ కంపెనీల్లో 10 శాతానికి పైగా పెట్టుబడులను కలిగి ఉంది. లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌ క్యాప్‌ కంపెనీల కలయికగా పోర్ట్‌ఫోలియో ఉంది. లార్జ్‌క్యాప్‌లో 57 శాతం, మిడ్‌క్యాప్‌లో 43 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. పెట్టుబడుల్లో కొంత మేర విదేశీ స్టాక్స్‌లోనూ ఇన్వెస్ట్‌ చేయడం ఈ పథకం ప్రత్యేకతగా చెప్పుకోవాలి. గూగుల్‌ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్‌ ఐఎన్‌సీ క్లాస్‌ఏ షేర్లలో 5 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లోనూ 3 శాతం ఇన్వెస్ట్‌ చేసింది. ఈ తరహా స్టాక్స్‌ ఎంపిక వల్లే ఈ పథకానికి దీర్ఘకాలంలో మంచి రాబడుల చరిత్ర ఉంది.    

రాబడులు  
దీర్ఘకాలంలో ఈ పథకం పనితీరు మెరుగ్గా ఉంది. గడిచి ఏడాది కాలంలో ఒక శాతం నష్టాలను ఇచ్చింది. కానీ, మూడేళ్ల కాలంలో వార్షిక రాబడి 12.50 శాతంగా ఉంది. ఐదేళ్లలోనూ 12.85 శాతం, ఏడేళ్లలో 12.65 శాతం, పదేళ్లలో 16 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచి్చంది. కానీ, బీఎస్‌ఈ 500టీఆర్‌ఐ రాబడి ఐదేళ్లలో 11.5 శాతం, ఏడేళ్లలో 11.30 శాతం, పదేళ్లలో 13.80 శాతంగానే ఉంది. ఫ్లెక్సీక్యాప్‌ సగటు రాబడి చూసినా మూడేళ్లలో 11 శాతం, ఐదేళ్లలో 9.76 శాతం, ఏడేళ్లలో 9.86 శాతం, పదేళ్లలో 13.60 శాతం చొప్పున ఉంది. ఇండెక్స్, ఫ్లెక్సీక్యాప్‌ విభాగం కంటే ఈ పథకంలో రాబడి ఎక్కువగా ఉంది. 2004 నుంచి ఈ పథకం పనిచేస్తోంది. నాటి నుంచి చూస్తే వార్షిక రాబడి రేటు 18 శాతానికి పైనే ఉండడం గమనించాలి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top