ట్యాక్స్‌ ఆడిట్‌ అంటే ఏంటీ? ఎందుకు చేయించాలి? ఎవరికి అవసరం

Full Details About Tax Audit - Sakshi

ఆడిట్‌ అంటే చాలా మందికి తెలిసిన అంశమే. మన దేశంలో ఎన్నో రకాల ఆడిట్‌లు అమల్లో ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టంలో కూడా ఒక ఆడిట్‌ అంశం పొందుపర్చారు. సెక్షన్‌ 44అఆ ప్రకారం నిర్దేశిత టర్నోవర్‌/అమ్మకాలు/ వసూళ్లు దాటిన అస్సెస్సీలు వారి అకౌంట్స్‌ను ఆడిట్‌ చేయించాలి. అలా చేయించడాన్నే ట్యాక్స్‌ ఆడిట్‌ అంటారు. 

ఉద్దేశ్యం ఏమిటంటే .. 
అస్సెస్సీ సరైన అకౌంటు బుక్స్‌ నిర్వహించాలి. మిగతా ఎన్నో రికార్డులు  రాయాలి. వీటి వల్ల సరైన ఆదాయం తెలుసుకోగలగాలి. అస్సెస్సీకి ఎన్నో మినహాయింపులు, తగ్గింపు, ప్రయోజనాలు ఉంటాయి. వీటి వల్ల ఆదాయపు పన్ను తగ్గుతుంది. ఈ విషయంలో ఎటువంటి అవకతవకలు, తప్పొప్పులు జరగకుండా చూడాలి. అమ్మకాలు, కొనుగోళ్లు, ఆస్తులు, అప్పులు, మూలధనం లేదా పెట్టుబడికి సంబంధించిన సోర్స్‌లు.. ఇలా ఎన్నో అంశాలు పుస్తకాల్లో రాస్తారు. అవి సరైనవేనా .. కాదా అన్నది చెక్‌ చేయాలి. ఆ ఆడిట్‌ వల్ల డిపార్ట్‌మెంటుకు ఎంతో సమయం, వనరులు వృధా కాకుండా ఉంటాయి. 

ఎవరి అకౌంట్స్‌ ఆడిట్‌ చేయాలి.. 
వ్యాపారం/వాణిజ్యం/ఇతరత్రా బిజినెస్‌లు చేస్తున్నవారికి ఈ ఆడిట్‌ వర్తిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిమితుల ప్రకారం బిజినెస్‌ చేసే వారికి వర్తించే పరిమితి రూ. 1 కోటిగా ఉంది. వృత్తికి సంబంధించిన వారికి రూ. రూ. 50 లక్షలుగా ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ పరిమితి దాటితే ట్యాక్స్‌ ఆడిట్‌ వర్తిస్తుంది. ఈ పరిమితి ప్రాతిపదికను నిర్ణయించడానికి వసూళ్లు/ఆదాయం/అమ్మకాలు/టర్నోవర్‌ మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. 

ఆడిట్‌ ఎవరు చేయాలి.. 
ప్రాక్టీసు చేస్తున్న సీఏతో ఈ ఆడిట్‌ చేయించాలి. సదరు సీఏ .. ఆ వ్యక్తి దగ్గర/సంస్థలో ఉద్యోగంలో చేస్తున్న వారు కాకూడదు. ఎటువంటి ఆర్థిక లావాదేవీలు ఉండకూడదు. సీఏ స్వతంత్ర వ్యక్తి అయి ఉండాలి. 

సంస్థలు ఏయే బుక్స్‌ రాయాలి.. 
చట్టంలో నిర్వచించిన ప్రకారం డేబుక్స్, నగదు చిట్టా, లెడ్జర్లు, అకౌంట్స్‌ బుక్స్, ఇతర పుస్తకాలు.. రాతపూర్వకంగా గానీ లేదా కంప్యూటర్‌ ద్వారా, ఫ్లాపీ, డిస్క్, ఎలక్ట్రానిక్‌ రూపంలో నిర్వహించవచ్చు. వృత్తిలో ఉన్న వారు .. అంటే లీగల్, మెడికల్, ఇంజినీరింగ్, ఆర్కిటెక్ట్, అకౌంటింగ్, టెక్నికల్‌ కన్సల్టెన్సీ, ఇంటీరియర్‌ డెకరేషన్‌ మొదలైన వర్గాల వారు.. ఐటీ అధికారులు అసెస్‌మెంట్‌ చేయడానికి సహాయపడే విధంగా ఉండేలా రికార్డులు, అకౌంటు బుక్స్‌ నిర్వహించాలి. ఇక వ్యాపారస్తులు (వృత్తి నిపుణులు కాని వారు) కొన్ని పరిమితులకు లోబడి అకౌంట్స్‌ నిర్వహించాలి. ఆ పరిమితులను గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఏతావాతా అమ్మకాలు, టర్నోవరు, వసూళ్లకు సంబంధించిన రికార్డులు రాయాలి. చట్టంలో ఎంతో భాష్యం జోడించారు కానీ.. దీని సారాంశం ఏమిటంటే అమ్మకాలకు సంబంధించిన బిల్లులు, ఇన్వాయిస్‌లు, రిజిస్టర్లు .. కొనుగోళ్లకు సంబంధించిన ఆస్తులకు, అప్పులకు సంబంధించినవి .. అన్నీ .. సమస్తమూ నిర్వహించాలి. బ్యాంకు అకౌంట్లు, వసూళ్లు/రాబడి/వాపసులు, ఖర్చులు, బిల్లులు, ఓచర్లు, కాగితాలు.. ఇలా ఎన్నో నిర్వహించాలి. 


- కె.సీహెచ్‌.ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి, కె.వి.ఎన్‌ లావణ్య (ట్యాక్సేషన్‌ నిపుణులు)
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top