
ఇతర దేశాలతో పోటీపడొచ్చు
ఎగుమతిదారుల ఆశాభావం
న్యూఢిల్లీ: బ్రిటన్‌తో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో (ఎఫ్‌టీఏ) కారి్మక శక్తి ఎక్కువగా ఉండే వ్రస్తాలు, లెదర్ తదితర దేశీ పరిశ్రమలకు తోడ్పాటు లభిస్తుందని ఎగుమతిదారులు ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిటీష్ మార్కెట్లో బంగ్లాదేశ్, వియత్నాంలాంటి దేశాలతో మనం కూడా పోటీపడేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.
ఈ ఎఫ్‌టీఏతో చాలా మటుకు భారతీయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు గణనీయంగా తగ్గడమో లేదా పూర్తిగా తొలగించడమో జరుగుతుంది కాబట్టి మనకు ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. నియంత్రణ ప్రక్రియలను క్రమబదీ్ధకరించడంతో బ్రిటన్‌లో జనరిక్ ఔషధాలకు అనుమతులు వేగవంతం కాగలవని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్ ఎస్‌సీ రాల్హన్ తెలిపారు.
చేనేతకారులు, తయారీదారులు, ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు లభిస్తాయని, వాణిజ్య అవరోధాలు తొలగిపోతాయని, ప్రీమియం మార్కెట్ అందుబాటులోకి వస్తుందని అపారెల్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) వైస్ చైర్మన్ ఎ. శక్తివేల్ వివరించారు. అంతర్జాతీయ వ్యవస్థకు భారత్‌ను మరింతగా అనుసంధానం చేసేందుకు, విశ్వసనీయ తయారీ భాగస్వామిగా అంతర్జాతీయంగా భారత్ స్థానాన్ని పటిష్టం చేసేందుకు ఇలాంటి ఒప్పందాలు కీలకమని రేమండ్ గ్రూప్ చైర్మన్ గౌతమ్ సింఘానియా తెలిపారు.