ఈక్విటీలపై మళ్లీ ఎఫ్‌పీఐల చూపు

FPIs investment in Indian equities rises 8percent to 566 bn dollers in Sept quarter - Sakshi

క్యూ2లో పెరిగిన పెట్టుబడులు

3 వరుస క్వార్టర్ల అమ్మకాలకు బ్రేక్‌

నవంబర్‌లో మరింత దూకుడు

న్యూఢిల్లీ: వరుసగా మూడు త్రైమాసికాలలో క్షీణిస్తూ వచ్చిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడులు జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో 8 శాతం పుంజుకున్నాయి. దీంతో దేశీ ఈక్విటీలలో ఎఫ్‌పీఐల పెట్టుబడుల విలువ 566 బిలియన్‌ డాలర్లను తాకింది. అంతకుముందు త్రైమాసికం(ఏప్రిల్‌–జూన్‌)లో ఇవి 523 బిలియన్‌ డాలర్లుగా నమోదైనట్లు మార్నింగ్‌స్టార్‌ నివేదిక వెల్లడించింది. ప్రపంచస్థాయిలో వేగంగా మారుతున్న స్థూలఆర్థిక పరిస్థితులు, సెంటిమెంట్లు, అవకాశాలు దేశీ ఈక్విటీ మార్కెట్లకు ఆకర్షణను తీసుకువచ్చినట్లు పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం జనవరి–మార్చిలో ఇవి 612 బిలియన్‌ డాలర్లుకాగా.. 2021 అక్టోబర్‌–డిసెంబర్‌లో 654 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే గత ఆర్థిక సంవత్సరం(2021–22) క్యూ2లో ఇవి 667 బిలియన్‌ డాలర్లకు చేరాయి. కాగా.. తాజా సమీక్షా కాలంలో దేశీ ఈక్వి టీ మార్కెట్ల క్యాపిటలైజేషన్‌(విలువ)లో ఎఫ్‌పీఐ పెట్టుబడుల వాటా సైతం క్యూ1లో నమోదైన 16.95 శాతం నుంచి 16.97 శాతానికి బలపడింది.

ఎఫ్‌పీఐల జాబితాలో
ఎఫ్‌పీఐ విభాగంలో ఆఫ్‌షోర్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. వీటితోపాటు ఆఫ్‌షోర్‌ బీమా కంపెనీలు, హెడ్జ్‌ ఫండ్స్, సావరిన్‌ వెల్త్‌ఫండ్స్‌ సైతం ఈ జాబితాలో నిలిచే సంగతి తెలిసిందే. ఈ ఏడాది(2022–23) క్యూ1లోనూ దేశీ ఈక్విటీలలో అమ్మకాల వెనకడుగు వేసిన ఎఫ్‌పీఐలు తిరిగి క్యూ2లో పెట్టుబడుల యూటర్న్‌ తీసుకోవడం గమనార్హం! అయితే పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నివేదిక అభిప్రాయపడింది. యూఎస్‌ కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు, అధిక ద్రవ్యోల్బణం ప్రపంచ ఆర్థిక పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్న విషయం విదితమే. మరోపక్క నెలల తరబడి కొనసాగుతున్న రష్యా– ఉక్రెయిన్‌ యుద్ధం సైతం ఎఫ్‌పీఐ పెట్టుబడులను ప్రభావితం చేస్తున్నట్లు పేర్కొంది. ఇక చమురు ధరలు బలపడటం, రూపాయి క్షీణతతో దేశీయంగా పెరుగుతున్న కరెంట్‌ ఖాతా లోటు వంటి అందోళనల నేపథ్యంలో ఎఫ్‌పీఐలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు వివరించింది.  

ఇటీవల అమ్మకాలు
ప్రస్తుత త్రైమాసికం(క్యూ2)లో తొలుత జులైలో 61.8 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్‌ చేసిన ఎఫ్‌పీఐలు ఆగస్ట్‌లో ఏకంగా 6.44 బిలియన్‌ డాలర్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. అయితే తిరిగి సెప్టెంబర్‌లో అమ్మకాలు చేపట్టి 90.3 కోట్ల డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇందుకు ప్రధానంగా అంతర్జాతీయ అనిశ్చితులు కారణమైనట్లు మార్నింగ్‌ స్టార్‌ నివేదిక పేర్కొంది. ధరల కట్టడికి ఫెడ్‌ వేగవంత రేట్ల పెంపు ప్రపంచ ఆర్థిక వృద్ధిని దెబ్బతీయవచ్చన్న అంచనాలు పెరుగుతున్నట్లు తెలియజేసింది. డాలరుతో మారకంలో రూపాయి భారీ క్షీణత, యూఎస్‌ బాండ్ల ఈల్డ్స్‌ బలపడటం వంటి అంశాలు సైతం ఎఫ్‌పీఐల పెట్టుబడులను ప్రభావితం చేయగలవని వివరించింది. కాగా.. ఈ నెల(నవంబర్‌)లో ఎఫ్‌పీఐలు మళ్లీ భారీ పెట్టుబడులకు తెరతీయడం ప్రస్తావించదగ్గ అంశం. ఈ నెలలో ఇప్పటివరకూ 3.53 బిలియన్‌ డాలర్ల విలువైన ఈక్విటీలను జత చేసుకున్నారు. ఫెడ్‌ వడ్డీ పెంపు చివరి దశకు చేరుకున్న అంచనాలు, యూఎస్‌లో స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడనున్న సంకేతాలను నివేదిక ఇందుకు ప్రస్తావించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top