ఈ వారం 4 ఐపీవోలు

Four IPOs to hit Dalal Street this week - Sakshi

రూ. 14,628 కోట్ల సమీకరణకు రెడీ

ఇప్పటికే 16 కంపెనీల పబ్లిక్‌ ఇష్యూలు

న్యూఢిల్లీ: ఇటీవల కొనసాగుతున్న ప్రైమరీ మార్కెట్ల హవా నేపథ్యంలో ఈ వారం మరో 4 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలను చేపట్టనున్నాయి. జాబితాలో నిర్మా గ్రూప్‌ కంపెనీ నువోకో విస్టాస్‌ కార్పొరేషన్, ఆటో క్లాసిఫైడ్‌ సంస్థ కార్‌ట్రేడ్‌ టెక్, గృహ రుణాల సంస్థ ఆప్టస్‌ వేల్యూ హౌసింగ్‌ ఫైనాన్స్, స్పెషాలిటీ కెమికల్‌ కంపెనీ కెమ్‌ప్లాస్ట్‌ సన్మార్‌ ఉన్నాయి. నువోకో విస్టాస్, కార్‌ట్రేడ్‌ టెక్‌ నేడు(9న) ప్రారంభంకానుండగా.. ఆప్టస్‌ వేల్యూ, కెమ్‌ప్లాస్ట్‌ సన్మార్‌ మంగళవారం(10న) ఇష్యూకి రానున్నాయి. తద్వారా ఉమ్మడిగా రూ. 14,628 కోట్లు సమీకరించనున్నాయి. నువోకో, కార్‌ట్రేడ్‌ ఇష్యూలు 11న, ఆప్టస్, కెమ్‌ప్లాస్ట్‌ 12న ముగియనున్నాయి. గత వారం సైతం 4 కంపెనీలు ఐపీవోలు చేపట్టిన సంగతి తెలిసిందే. దేవయాని ఇంటర్నేషనల్, క్రిస్నా డయాగ్నోస్టిక్స్, విండ్లాస్‌ బయోటెక్, ఎగ్జారో టైల్స్‌  సంయుక్తంగా రూ. 3,614 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే.

రూ. 30,666 కోట్లు
గత ఆర్థిక సంవత్సరం(2020–21) 30 కంపెనీలు ఐపీవోలకు రావడం ద్వారా రూ. 31,277 కోట్లు సమీకరించాయి. ఈ బాటలో ప్రస్తుత ఏడాది(2021–22)లో ఇప్పటివరకూ 16 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలను చేపట్టాయి. మొత్తం రూ. 30,666 కోట్లు అందుకున్నాయి. వెరసి తొలి ఐదు నెలల్లోనే గతేడాదిని మించి నిధులను సమకూర్చుకోగలిగాయి. ఈ ఏడాది ఇకపై మరో రూ. 70,000 కోట్ల విలువైన ఇష్యూలు మార్కెట్లను తాకనున్నట్లు శాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఈక్విటీస్‌ హెడ్‌ హేమంగ్‌ కాపసీ పేర్కొన్నారు. ఐపీవో నిధులను ప్రధానంగా రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నాయి.

ఇతర వివరాలు
నువోకో విస్టాస్‌ ఐపీవోకు ధరల శ్రేణి రూ. 560–570కాగా.. రూ. 5,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇక కార్‌ట్రేడ్‌ ఇష్యూకి ధరల శ్రేణి రూ. 1,585–1,618గా నిర్ణయించింది. తద్వారా రూ. 2,999 కోట్లవరకూ అందుకోవాలని చూస్తోంది. ఆప్టస్‌ వేల్యూ ఇష్యూకి ధరల శ్రేణి రూ. 346–353కాగా.. రూ. 2,780 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. ఇక రూ. 3,850 కోట్ల ఐపీవోకు కెమ్‌ప్లాస్ట్‌ సన్మార్‌ రూ. 530–541 ధరల శ్రేణిని ప్రకటించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top