వారానికి 4 రోజులే పని, త్వ‌ర‌లోనే అమ‌ల్లోకి కొత్త లేబ‌ర్ చ‌ట్టాలు!

Four Day Work Week Under The New Labour Laws - Sakshi

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన 4 కార్మిక చట్టాలు జులై1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇంత వరకు అమలు జరగలేదు. ఒక వేళ అమలైతే ఉద్యోగుల వేతనం, పీఎఫ్‌ వాటా, పని సమయం, వీక్లీ ఆఫ్‌లు వంటి అంశాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.  

కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాలను పార్లమెంటు ద్వారా ఆమోదించినప్పటికీ, అనేక రాష్ట్రాలు ఇంకా కొత్త కోడ్‌లను ఆమోదించలేదు. రాజ్యాంగం పరిధిలో కార్మిక అంశం ఉన్నందున అమలులో జాప్యం జరిగింది. రాష్ట్రాలు వాటిని ఆమోదించిన తర్వాతే ఈ కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి రానున్నట్లు సమాచారం.

కేంద్ర కార్మిక శాఖ సమాచారం ప్రకారం..ఇప్పటి వరకు 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేతనాల కోడ్- 2019 కింద ముసాయిదా నిబంధనల్ని ప్రచురించాయి. త్వరలో అమలులోకి రానున్న కొత్త లేబర్ కోడ్ ఉద్యోగుల పని గంటలు, టేక్‌ హోం శాలరీ, సెలవులపై ప్రభావం చూపనుంది. ఉద్యోగి చివరి వర్కింగ్‌ డేస్‌ వరకు చెల్లించాల్సిన వేతనాలు రెండు రోజుల లోపే పూర్తి చేయాలని వేతన కోడ్ నిర్దేశిస్తుంది. అదే విధంగా సంస్థలు ఉద్యోగుల పని గంటల్ని పెంచుకోవచ్చు. అలాంటి సందర్భాలలో ఉద్యోగులకు అదనపు సెలవులు ఇవ్వాల్సి ఉంటుంది.  

♦ కొత్త వేతన నియమావళి ప్రకారం బేసిక్‌ శాలరీ కనీసం 50 శాతం ఉండాలని నిర్దేశించడంతో ఉద్యోగులు తీసుకునే  టేక్‌ హోం శాలరీపై ప్రభావం పడనుంది. 

♦ ఉద్యోగి, సంస్థల సహకారంతో ఎక్కువ మొత్తం పీఎఫ్‌లో జత కానుంది. 

♦ 2019లో పార్లమెంట్ ఆమోదించిన ఈ లేబర్ కోడ్ 29 కేంద్ర కార్మిక చట్టాలను భర్తీ చేస్తుంది. 

♦ వేతనం, సామాజిక భద్రత, కార్మిక సంబంధాలు, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులపై నాలుగు కొత్త కోడ్‌లు జూలై 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా.. జాప్యం జరగడంతో త్వరలోనే అమలు జరగనున్నాయి.  

ఉద్యోగులపై ప్రభావం  
రాజీనామా, ఉద్యోగం నుండి తొలగించిన తర్వాత ఉద్యోగి చివరి పనిదినం వరకు చెల్లించిన బకాయిల్ని రెండు రోజులలోపు పూర్తి చేయాలని కొత్త చట్టం ఆదేశిస్తుంది. ప్రస్తుతం, కంపెనీలు సెటిల్‌మెంట్‌కు 45 రోజుల నుండి 60 రోజుల గడువు విధిస్తున్న విషయం తెలిసిందే. 

పెరగనున్న పని గంటలు
కొత్త కార్మిక చట్టంలో సంస్థలు ఉద్యోగుల పని గంటల్ని 9 గంటల నుండి 12 గంటలకు పెంచేందుకు అనుమతిస్తుంది. పనిగంటలు పెరిగితే కొత్త లేబర్‌ చట్టాల ప్రకారం.. ఉద్యోగులు ప్రస్తుతం వారానికి 5 రోజులు మాత్రమే పనిచేస్తుండగా..కొత్త పనివేళలతో వారంలో నాలుగు రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగులకు వారానికి 3 రోజుల హాలిడేస్‌ కావాలి అనుకుంటే ప్రతి వారం 48 గంటల పాటు పనిచేయాల్సి ఉంటుంది. వారంలో 48 పని గంటలు దాటితే సదురు ఉద్యోగికి..సంస్థలు అదనంగా ఓవర్‌ టైం చెల్లించాల్సి ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top