భారీ ఆర్థిక లావాదేవీల్లో మరింత పారదర్శకత!

Form 26AS info list to include foreign remittances, mutual funds - Sakshi

ఫామ్‌ 26ఏఎస్‌లో ఇక మరిన్ని వివరాలు

న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్‌ (సీబీడీటీ) ఫామ్‌ 26ఏఎస్‌లో పొందుపరచాల్సిన అంశాలను పెంచింది. ఐటీఆర్‌లో తెలుపుతున్న సమాచారంతోపాటు ఇకపై విదేశాల నుంచి అందిన డబ్బు (ఫారిన్‌ రెమిటెన్స్‌) మ్యూచువల్‌ ఫండ్స్‌ కొనుగోళ్లు, వంటి అంశాలనూ ఇకపై ఫామ్‌ 26ఏఎస్‌లో తెలపాల్సి ఉంటుంది. అధిక–విలువ ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత లక్ష్యంగా యాక్ట్‌ 285బీబీ సెక్షన్‌ కింద  సీబీడీటీ ఈ నిర్ణయం తీసుకుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఫామ్‌ 26ఏఎస్‌... ఒక వార్షిక ఏకీకృత పన్ను ప్రకటన. దీనిని పన్ను చెల్లింపుదారులు వారి శాశ్వత ఖాతా సంఖ్య (పీఏఎన్‌) ఉపయోగించి ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌ నుండి యాక్సెస్‌ చేయవచ్చు.  2020–21 బడ్జెట్‌ ఆదాయపు పన్ను చట్టంలో కొత్త సెక్షన్‌ 285బీబీని ప్రవేశపెట్టింది, ఫామ్‌ 26ఏఎస్‌ని ’వార్షిక సమాచార ప్రకటన’గా పునరుద్దరించడం దీని ఉద్దేశం.  టీడీఎస్‌/టీసీఎస్‌ వివరాలతో పాటు, నిర్దిష్ట ఆర్థిక లావాదేవీలు, పన్నుల చెల్లింపు, డిమాండ్‌/ సమగ్ర సమాచారాన్ని ఫామ్‌ కలిగి ఉంటుంది.  

అందుబాటులో ఆడిట్‌ యుటిలిటీ ఫామ్‌
కాగా, ఆదాయపు పన్ను శాఖ 2019–20,  2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తన పోర్టల్‌లో పన్ను ఆడిట్‌ యుటిలిటీ ఫారమ్‌ను అందుబాటులో ఉంచింది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, వ్యాపార విక్రయాలు, టర్నోవర్‌ లేదా స్థూల రసీదులు రూ. 10 కోట్లకు మించి ఉంటే పన్ను చెల్లింపుదారులు వారి ఖాతాలను ఆడిట్‌ చేయవలసి ఉంటుంది, అయితే ప్రొఫెషనల్స్‌ విషయంలో, 2020–21లో (అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2021–22) ఈ పరిమితి రూ. 50 లక్షలకు మించి ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి పన్ను తనిఖీ నివేదికను దాఖలు చేయడానికి చివరి తేదీ 2022 జనవరి 15.  

రూ.లక్ష కోట్ల రిఫండ్స్‌
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అక్టోబర్‌ 25 మధ్య రూ. 1,02,952 కోట్ల ఐటీ రిఫండ్స్‌ జరిగినట్లు సీబీడీటీ ఒక ప్రకటనలో పేర్కొంది. 76,21,956 కోట్ల మందికి రూ.27,965 కోట్ల ఆదాయపు పన్ను రిఫండ్స్, 1,70,424 లావాదేవీలకు సంబంధించి రూ.74,987 కోట్ల కార్పొరేట్‌ పన్ను రిఫండ్స్‌ జరిగినట్లు అధికారిక గణాంకాలు తెలిపాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top