
బీబీబీ మైనస్‌గా కొనసాగింపు
స్థిరమైన అవుట్‌లుక్
ఫిచ్ రేటింగ్స్ ప్రకటన
న్యూఢిల్లీ: భారత సార్వభౌమ రుణ రేటింగ్‌ను బీబీబీ మైనస్, స్థిరమైన అవుట్‌లుక్ వద్దే కొనసాగిస్తున్నట్టు ఫిచ్ రేటింగ్స్ ప్రకటించింది. బలమైన ఆర్థిక వృద్ధికితోడు పటిష్టమైన విదేశీ మారకం నిల్వలు, విదేశీ రుణ భారం నియంత్రణలో ఉండడాన్ని పరిగణనలోకి తీసుకుంది. భారత జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) 6.5 శాతంగా ఉండొచ్చన్న తమ అంచనాలను ప్రతిపాదిత 50 శాతం అమెరికా టారిఫ్‌లు ప్రభావితం చేయొచ్చని తెలిపింది.
గత రెండేళ్లలో వృద్ధి వేగం నిదానించినప్పటికీ పోటీ దేశాలతో పోల్చి చూసినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నట్టు పేర్కొంది. భారత సావరీన్ రేటింగ్‌ను ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ ఇటీవలే ‘బీబీబీ’కి అప్‌గ్రేడ్ చేయగా.. ఫిచ్ రేటింగ్స్ మాత్రం యథాతధ రేటింగ్‌ను కొనసాగించడం గమనార్హం. ఫిచ్ పేర్కొన్న బీబీబీ మైనస్ అన్నది పెట్టుబడుల్లో అతి తక్కువ గ్రేడ్ రేటింగ్.
మరో రేటింగ్ సంస్థ మారి్నంగ్ డీబీఆర్‌ఎస్ సైతం భారత రేటింగ్‌ను బీబీబీకి అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు ఈ ఏడాది మేలో ప్రకటించింది. రేటింగ్‌ను యథాతథంగా కొనసాగించినప్పటికీ, జీడీపీ వృద్ధి రేటు అంచనా 6.5 శాతంలో ఫిచ్ మార్పు చేయలేదు. బలమైన ప్రభుత్వ మూలధన వ్యయాలు, ప్రైవేటు పెట్టుబడులు పుంజుకోవడం, పనిచేయగలిగిన అధిక జనాభా వంటి సానుకూలతలతో మధ్య కాలంలోనూ భారత జీడీపీ 6.4 శాతం వృద్ధిని కొనసాగిస్తుందని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది.
జీఎస్‌టీ తగ్గించడం పాజిటివ్: ప్రతిపాదిత జీఎస్‌టీ రేట్ల క్రమబద్ధీకరణతో వినియోగం పెరుగుతుందని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. వృద్ధి రిస్‌్కలను ఇది కొంత వరకు తగ్గిస్తుందని పేర్కొంది. ముఖ్యంగా భూమి, కార్మిక చట్టాలకు సంబంధించి కీలక సంస్కరణలకు ఆమోదం ఈ దశలో రాజకీయంగా కష్టమేనని అభిప్రాయపడింది. పలు దేశాలతో ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నప్పటికీ వాణిజ్య అవరోధాలు గణనీయంగానే ఉ న్నట్టు తెలిపింది. బీబీబీ రేటింగ్ గల పోటీ దేశాల కంటే భారత్‌కు అధిక ద్రవ్యలోటు, రుణ భారం ఉండడం రేటింగ్ పరంగా బలహీనతగా పేర్కొంది. తలసరి ఆదాయం తక్కువగా ఉండడం కూడా రేటింగ్‌ను పరిమితం చేస్తున్నట్టు ఫిచ్ రేటింగ్స్ వివరించింది.