
దేశీయంగా హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేపట్టిన ఫేమ్ 3 పథకాన్ని 2024 బడ్జెట్‌లో ప్రవేశపెట్టే అవకాశం లేదని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పష్టం చేశారు. అయితే దీన్ని అమలు చేయడానికి ముమ్మరంగా సన్నాహాలు సాగుతున్నట్లు చెప్పారు. త్వరలోనే ఈ పథకం మూడో దశను అమలు చేస్తామని తెలిపారు.
ఒక పరిశ్రమ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..‘ఈ బడ్జెట్‌లో ఫేమ్ 3 పథకాన్ని చేర్చే అవకాశం లేదు. దీని అమలుకు సంబంధించి సన్నాహక పనులు జరుగుతున్నాయి. ఈ పథకంతో సంబంధం ఉన్న మొత్తం ఏడు మంత్రిత్వ శాఖలు ప్రోగ్రామ్‌ను ఎలా రూపొందించాలో సిఫార్సు చేశాయి. మరికొన్ని నెలల్లో ఈ పథకాన్ని అమలు చేస్తాం’ అన్నారు.
ఇదీ చదవండి: ఆటోమోటివ్ రంగంలో 4,000 మందికి శిక్షణ!
కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 2 పథకాన్ని అధికారికంగా 2019 నుంచి మార్చి 31, 2024 వరకు అమలు చేసింది. ఫేమ్ 2 కింద మొత్తం రూ.11,500 కోట్ల సబ్సిడీని అందించింది. దాంతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు, వినియోగదారులకు ప్రయోజనం కలిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫేమ్ పథకం కోసం ప్రత్యేకంగా రూ.2,671.33 కోట్లు కేటాయించారు. ఈసారి బడ్జెట్‌లో ఫేమ్ 3కి సంబంధించిన ప్రకటన వెలువడుతుందని ఆశించిన మార్కెట్ వర్గాలకు కేంద్రమంత్రి వ్యాఖ్యలతో కొంత నిరాశే మిగిలినట్లు తెలిసింది. ఏదేమైనా బడ్జెట్ ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ మొబిలిటీలో వేగంగా మార్పులు చేయడానికి ప్రభుత్వం ఏప్రిల్ 1, 2015లో ఫేమ్ పథకాన్ని ప్రారంభించింది.