Facebook New IT Rules: ఫేస్‌బుక్ పోస్టులపై భారీ వేటు

Facebook Takes Down Over 30 Million Posts In Compliance With New IT Rules - Sakshi

3 కోట్ల  పోస్ట్‌లకు చెక్‌

కొత్త ఐటీ నిబంధనల ప్రకారం చర్యలు

తొలి  నెలవారీ నివేదిక విడుదల

సాక్షి,న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ తన ఖాతాదారులకు భారీ షాక్‌ ఇచ్చింది. కొత్త ఐటీ నిబంధనల ప్రకారం 30 మిలియన్లకు పైగా ఉన్న వివిధ రకాల కంటెంట్‌పై వేటు వేసింది. దేశీయంగా ఇటీవల అమల్లోకి వచ్చిన  కొత్త ఐటీ రూల్స్‌కు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్టు  తన తొలి నెలవారీ కంప్లయిన్స్‌ నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. తమ తదుపరి నివేదికను జూలై 15న ప్రచురిస్తామని, అందులో వినియోగదారుల ఫిర్యాదులు, తీసుకున్న చర్యల వివరాలుంటాయని పేర్కొంది. 

ఐటీ నిబంధనల ప్రకారం దేశంలో మే 15 - జూన్ 15 మధ్యకాలంలో 10 రకాల  ఉల్లంఘన కేటగిరీల కింద 3 కోట్లకు పైగా యూజర్ల పోస్టులను తొలగించినట్టు వెల్లడించింది. ఇదే కాలంలో తొమ్మిది వర్గాలలోని రెండు మిలియన్ల యూజర్ల కంటెంట్‌పై ఫేస్‌బుక్‌ యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ చర్యలు తీసుకుంది. ఇందులో స్పామ్ (25 మిలియన్లు), హింసాత్మక, గ్రాఫిక్ కంటెంట్ (2.5మిలియన్లు), వయోజన నగ్నత్వం, లైంగిక చర్యలకు సంబంధించిన 1.8 మిలియన్లు కంటెంట్ ఉంది. ఉగ్రవాద ప్రచారానికి సంబంధించి 106,000 పోస్ట్‌లు,  విద్వేషపూరిత ప్రసంగాలపై 311,000,  వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ 118,000  పోస్ట్‌లున్నట్టు తెలిపింది. 

కొత్త కొత్త ఐటి నిబంధన మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ప్రకారం,  ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు (5 మిలియన్లకు పైగావినియోగదారులతో) ప్రతి నెలా కంప్లయిన్స్‌ నివేదికలను ప్రచురించాల్సి ఉంటుంది. ఆయా వేదికలపై ఫిర్యాదుల వివరాలను, దానిపై తీసుకున్న చర్యలను వెల్లడించాలి. స్వేచ్చాయుత భావవ్యక్తీకరణతోపాటు, ఆన్‌లైన్‌ భద్రత,రక్షణకు ప్రాధాన్యత ఇస్తామని ఫేస్‌బుక్‌ ప్రతినిధి వెల్లడించారు. ఫిర్యాదులు, కృత్రిమ మేధస్సు, తమ సమీక్షా బృందం నివేదికల ఆధారంగా తమ విధానాలకు వ్యతిరేకంగా ఉండే కంటెంట్‌ను గుర్తిస్తామని తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top