ఫాంగ్‌ స్టాక్స్‌ జోష్‌- యూఎస్‌ మార్కెట్లు ప్లస్‌

FAANG stocks push -US Markets up - Sakshi

యథాతథ పాలసీకే ఫెడరల్‌ రిజర్వ్‌ మొగ్గు

0-0.25 శాతం స్థాయిలో యూఎస్‌ వడ్డీ రేట్లు

నేడు ఫాంగ్‌ కంపెనీల క్యూ2 ఫలితాల వెల్లడి

2-1 శాతం మధ్య ఎగసిన టెక్నాలజీ స్టాక్స్‌

12.5 శాతం దూసుకెళ్లిన ఏఎండీ షేరు

అత్యధిక శాతం మంది విశ్లేషకులు అంచనా వేసిన విధంగానే అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడింది. దీంతో ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 0-0.25 శాతం స్థాయిలో కొనసాగనున్నాయి. రెండు రోజులపాటు నిర్వహించిన ఫెడ్‌ పరపతి సమావేశాలు బుధవారం ముగిశాయి. లాక్‌డవున్‌ల తదుపరి ఆర్థిక రికవరీ కనిపిస్తున్నప్పటికీ కోవిడ్‌-19కు ముందు పరిస్థితులతో పోలిస్తే బాగా వెనకబడి ఉన్నట్లు ఫెడ్‌ పేర్కొంది. ఇటీవల తిరిగి కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో నిరుద్యోగిత పెరగడం వంటి పలు సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలియజేసింది. అయితే ఆర్థిక వ్యవస్థకు దన్నుగా అన్నిరకాలుగా చేయూతను అందించనున్నట్లు ఫెడ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ తాజాగా తెలియజేశారు. దీంతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు రెండేళ్ల కనిష్టానికి చేరింది. 2018 జూన్‌ తదుపరి 93.17ను తాకింది.

లాభాల్లో
ఫెడ్‌ పాలసీ నిర్ణయాల నేపథ్యంలో బుధవారం యూఎస్‌ మార్కెట్లు లాభపడ్డాయి. డోజోన్స్‌ 160 పాయింట్లు(0.6 శాతం) బలపడి 26,540కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 40 పాయింట్ల(1.25 శాతం) పుంజుకుని 3,258 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ మరింత అధికంగా 141 పాయింట్లు(1.4 శాతం) జంప్‌చేసి 10,543 వద్ద నిలిచింది. ప్రధానంగా నేడు క్యూ2(ఏప్రిల్‌-జూన్‌) ఫలితాలు ప్రకటించనున్న యాపిల్‌, అల్ఫాబెట్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌ 2-1 శాతం మధ్య ఎగశాయి. ఈ బాటలో టెస్లా సైతం 1.5 శాతం లాభపడింది. 

స్టార్‌బక్స్‌ ప్లస్‌
2020 పూర్తి ఏడాదికి ఆశావహ అంచనాలు ప్రకటించడంతో తాజాగా అడ్వాన్స్‌డ్‌ మైక్రో డివైసెస్‌(ఏఎండీ) కౌంటర్‌కు డిమాండ్‌ ఏర్పడింది. వెరసి చిప్‌ తయారీ దిగ్గజం ఏఎండీ షేరు 12.5 శాతం దూసుకెళ్లింది. కొద్ది రోజులుగా బిజినెస్‌ పుంజుకుంటున్నట్లు ప్రకటించడంతో కాఫీ చైన్‌ దిగ్గజం స్టార్‌బక్స్‌ కార్ప్‌ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసింది. అయితే రెండు ఇంజిన్ల జెట్‌ విమానాల ఉత్పత్తిని తగ్గించినట్లు వెల్లడించడంతో బ్లూచిప్‌ కంపెనీ బోయింగ్‌ ఇంక్‌ షేరు 3 శాతం క్షీణించింది.

ఆసియా అటూఇటూ
ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో సింగపూర్‌ 1.8 శాతం నష్టపోగా.. తైవాన్‌, హాంకాంగ్‌ 1.2 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ఇతర మార్కెట్లలో కొరియా, ఇండొనేసియా 0.2 శాతం చొప్పున బలపడగా.. థాయ్‌లాండ్‌ 0.4 శాతం నీరసించింది. జపాన్‌ స్వల్ప నష్టంతోనూ చైనా నామమాత్ర లాభంతోనూ కదులుతున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top