అక్టోబర్‌లో ఈపీఎఫ్‌వో పరిధిలోకి 12.94 లక్షల మంది

EPFO adds 12. 94 lakh members in October Month - Sakshi

57 శాతం మంది వయసు 25లోపే

మొదటిసారి చేరిన వారు 7.28 లక్షలు

గణాంకాలను విడుదల చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) కింద అక్టోబర్‌ నెలలో కొత్తగా 12.94 లక్షల మంది నమోదయ్యారు. 2021 అక్టోబర్‌తో పోలిస్తే 21,026 మంది అధికంగా వచ్చి చేరారు. కేంద్ర కార్మిక శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్స్‌ చట్టం, 1952 కింద 2,282 కొత్త సంస్థలు అక్టోబర్‌ నుంచి పని చేయడం మొదలు పెట్టాయి. కొత్త సభ్యుల్లో మొదటిసారి చేరిన వారు 7.28 లక్షల మంది ఉంటే, 5.66 లక్షల మంది సభ్యులు ఒక చోట మానేసి, మరో సంస్థలో చేరిన వారు. పాత సంస్థ నుంచి కొత్త సంస్థకు ఖాతాను బదలాయించుకున్నారు. ఇలాంటి ఖాతాలను కొత్తవిగానే పరిగణిస్తుంటారు.  

యువత ఎక్కువ..
నికర కొత్త సభ్యుల్లో 18–21 వయసులోని వారు 2.19 లక్షల మంది ఉంటే, 22–25 ఏళ్ల వయసు గ్రూపులోని వారు 1.97 లక్షల మంది ఉన్నారు. కొత్త సభ్యుల్లో 57.25 శాతం 18–25 ఏళ్లలోపు వారే. నికరంగా చేరిన మహిళా సభ్యుల సంఖ్య 2.63 లక్షలుగా ఉంది. వీరిలో 1.91 లక్షల మంది మొదటిసారి ఈపీఎఫ్‌వో కిందకు వచ్చిన వారు కావడం గమనార్హం. కేరళ, మధ్యప్రదేశ్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. నికర సభ్యుల చేరికలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా 60 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈ రాష్ట్రాల నుంచి 7.78 లక్షల మంది ఈపీఎఫ్‌వో కిందకు వచ్చారు. క్రితం నెలతో పోలిస్తే అక్టోబర్‌లో న్యూస్‌పేపర్‌ పరిశ్రమ, షుగర్, రైస్‌ మిల్లింగ్‌లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top