ఒకప్పుడు మెరుగై జీవితానికి, ఉన్నతమైన జీవన ప్రమాణాలకు ప్రతీకగా నిలిచిన సాఫ్ట్‌వేర్ రంగం (IT Sector) ప్రస్తుతం తీవ్ర ఒత్తిడి, అధిక పనిగంటల ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఆఫీస్‌కు వెళ్లినా, ఇంటి నుంచి పనిచేస్తున్నా ఉద్యోగలుకు పని ఒత్తిడి మాత్రం తప్పడం లేదు. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోమ్(Work From Home) సాకుతో అనేక కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులతో 10 నుంచి 12 గంటల పాటు పని చేయించుకుంటున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇందులో నిజమెంత? చట్టం ఏం చెబుతోంది? ఈ పని విధానం ఉద్యోగుల వ్యక్తిగత, కుటుంబ జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం.
నిబంధనలు ఏమి చెబుతున్నాయి?
భారతదేశంలో కార్పొరేట్ సంస్థల్లోని ఉద్యోగుల పనిగంటలను సాధారణంగా ఫ్యాక్టరీల చట్టం 1948 లేదా రాష్ట్రాల పరిధిలోని షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టాల ద్వారా నియంత్రిస్తారు. ఐటీ కంపెనీలకు కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చినా ప్రామాణిక కార్మిక చట్టాల కింది విధంగా ఉన్నాయి.
సాధారణంగా ఒక ఉద్యోగి రోజుకు 8 నుంచి 9 గంటలు మాత్రమే పనిచేయాలి.
వారంలో 48 గంటలకు మించి పని చేయకూడదు.
ఒకవేళ ఉద్యోగితో 48 గంటలకు మించి పని చేయిస్తే ఆ అదనపు సమయానికి చట్టం ప్రకారం రెట్టింపు వేతనం (Double Rate) చెల్లించాలి.
చట్టాల ప్రకారం అదనపు పనితో కలిపి కూడా రోజుకు 10 నుంచి 12 గంటల పాటు పనిచేయించడానికి అనుమతి లేదు.
నిబంధనలున్నా..
కొన్ని సాఫ్ట్‌వేర్ సంస్థలు ప్రత్యేకించి ప్రాజెక్టుల డెడ్‌లైన్స్ (Deadlines), క్లయింట్ సమావేశాలు, లాభాపేక్ష వంటి కారణాల వల్ల ఉద్యోగులు ల్యాప్‌టాప్‌లకు అతుక్కుపోయేలా చేస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. కొందరు ప్రముఖ కంపెనీల వ్యవస్థాపకులు కూడా ఉద్యోగులు రోజుకు 10-12 గంటలు పని చేయాలనే ప్రకటనలు చేయడం, ఈ సంస్కృతికి అద్దం పడుతుంది. కాబట్టి నియమాలు ఉన్నప్పటికీ ఆచరణలో వాటిని ఉల్లంఘిస్తున్నారనేది వాస్తవం.
వర్క్ ఫ్రం హోమ్ సాకుతో శ్రమ దోపిడీ
కరోనా తర్వాత వర్క్ ఫ్రం హోమ్ విధానం పెరిగింది. చాలామందికి ఈ వెసులుబాటు కల్పించినప్పటికీ కొంతమంది ఉద్యోగులను కంపెనీలు ఇంట్లో బందీలుగా మార్చాయి. ఆఫీస్‌లో అయితే లాగిన్/లాగౌట్ సమయం స్పష్టంగా ఉంటుంది. కానీ వర్క్‌ఫ్రం హోం విధానంలో ఇంట్లోనే ఉన్నారు కదా అనే సాకుతో ఉదయం, సాయంత్రం, రాత్రి తేడా లేకుండా ఇష్టం వచ్చినప్పుడు క్లయింట్ మీటింగ్‌లు లేదా పనులు అప్పగిస్తున్నారు. సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవడం ద్వారా మిగిలిన ఉద్యోగులపై అధిక పని భారాన్ని మోపుతూ లాభాలు ఆర్జించాలనే లక్ష్యంతో కంపెనీలు పనిచేస్తున్నాయి.
శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం
నిరంతరం కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల వెన్నునొప్పి, మెడనొప్పి, కంటి సమస్యలు, స్థూలకాయం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, దీర్ఘకాలిక డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఐటీ ఉద్యోగుల్లో అధికమవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.
కుటుంబ, సామాజిక సంబంధాలు
అధిక పనిగంటలు ఉద్యోగులను వారి కుటుంబ సభ్యులు, బంధువులకు దూరం చేస్తున్నాయి. ఉద్యోగి ఇంట్లోనే ఉన్నప్పటికీ నిరంతరం ల్యాప్‌టాప్‌కు అతుక్కుపోవడం వల్ల భాగస్వామితో సమయం గడపలేకపోతున్నారు. ఇది ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది. కుటుంబ సమస్యలు, పిల్లల బాధ్యతల పట్ల శ్రద్ధ చూపలేకపోవడం వల్ల భాగస్వామిపై మరింత భారం పడి సంబంధాలు చెదిరిపోతున్నాయి.
పిల్లలతో..
తల్లిదండ్రులు ఇంటి వద్ద ఉన్నా ల్యాప్‌టాప్ ముందే ఉండడం వల్ల పిల్లలు తమ తల్లిదండ్రుల ప్రేమకు, పర్యవేక్షణకు దూరమవుతారు. ఇది వారి మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పిల్లల పాఠశాల కార్యక్రమాలు, ఆటలు లేదా చిన్న చిన్న వేడుకల్లో పాల్గొనలేకపోవడం వలన తల్లిదండ్రులు పశ్చాత్తాపానికి గురవుతున్నారు.
ప్రభుత్వాలు, చట్టపరమైన సంస్థల చర్యలు
ఐటీ, ఐటీ-ఎనేబుల్డ్ సర్వీసెస్ (ITES) రంగాల్లో షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టాలు లేదా లేబర్ కోడ్స్ కఠినంగా అమలు అయ్యేలా చూడాలి. కంపెనీల లాగిన్/లాగౌట్ డేటా, ఓవర్ టైమ్ చెల్లింపు రికార్డులను పర్యవేక్షించడానికి కార్మిక శాఖ ద్వారా తరచు ఆకస్మిక తనిఖీలు(Audits) నిర్వహించాలి. నిబంధనలకు విరుద్ధంగా పని చేయించే కంపెనీలపై భారీ జరిమానాలు విధించాలి. లేదా లైసెన్స్‌ల రద్దు వంటి కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా భయాన్ని కలిగించాలి.
ఉద్యోగులు తమ గుర్తింపు బయటపడకుండా అధిక పనిగంటలపై ఫిర్యాదు చేయడానికి వీలుగా సులభమైన, సురక్షితమైన ఆన్‌లైన్ పోర్టల్‌ను ఏర్పాటు చేయాలి. పనివేళలు ముగిసిన తర్వాత ఉద్యోగులు అధికారిక కమ్యూనికేషన్లకు (ఈమెయిల్స్, కాల్స్, మెసేజ్‌లు) స్పందించాల్సిన అవసరం లేదనే చట్టాన్ని తీసుకురావడానికి కృషి చేయాలి.
ఇదీ చదవండి: బీమా క్లెయిమ్‌ను తిరస్కరించకూడదంటే చేయాల్సినవి..


