మహీంద్రాతో ఎంబ్రేయర్‌ భాగస్వామ్యం | Sakshi
Sakshi News home page

మహీంద్రాతో ఎంబ్రేయర్‌ భాగస్వామ్యం

Published Sat, Feb 10 2024 4:22 AM

Embraer And Mahindra Announce Collaboration On C-390 Medium Transport Aircraft - Sakshi

ముంబై: భారత వైమానిక దళం కోసం సీ–390 మిలీనియం మల్టీ మిషన్‌ రవాణా విమానాల కొనుగోళ్లకు సంబంధించిన మీడియం ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (ఎంటీఏ) ప్రాజెక్ట్‌ కోసం ఎంబ్రేయర్‌ డిఫెన్స్, సెక్యూరిటీ తాజాగా మహీంద్రా గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలోని బ్రెజి ల్‌ దౌత్య కార్యాలయంలో ఈ మేరకు ఒప్పందంపై ఇరు సంస్థలు శుక్రవారం సంతకాలు చేశాయి.

ఎంటీఏ ప్రాజెక్టులో భాగంగా తయారీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి దేశీయంగా ఉన్న ఏరోస్పేస్‌ పరిశ్రమతో ఎంబ్రేయర్, మహీంద్రా సంప్రదింపులు జరుపనుంది. సీ–390 విమానాల విషయంలో భవిష్యత్తు కేంద్రంగా భారత్‌ను మార్చగల సామర్థ్యాన్ని ఇరు సంస్థలు అన్వేషిస్తాయి. ‘సీ–390 మిలీనియం మార్కెట్లో అత్యంత అధునాతన మిలిటరీ ఎయిర్‌లిఫ్టర్‌. ఈ భాగస్వామ్యం ఐఏఎఫ్‌ కార్యాచరణ నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది.

మేక్‌ ఇన్‌ ఇండియా లక్ష్యాలతో సజావుగా సరిపోయే సమర్థవంత పారిశ్రామికీకరణ పరిష్కారాన్ని కూడా అందిస్తుందని నమ్ముతున్నాము’ అని మహీంద్రా ఏరోస్పేస్, డిఫెన్స్‌ బిజినెస్‌ ప్రెసిడెంట్‌ వినోద్‌ సహాయ్‌ ఈ సందర్భంగా తెలిపారు. కాగా, మీడియం ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (ఎంటీఏ) కొనుగోలు ప్రాజెక్టులో భాగంగా భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) 40 నుంచి 80 విమానాలను కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకోసం భారత్‌కు సాంకేతిక బదిలీతోపాటు తయారీ వ్యవస్థ ఏర్పాటు కానుంది. 18 నుంచి 30 టన్నుల వరకు బరువు మోయగల విమానాలను ఐఏఎఫ్‌ సేకరించనుంది. 

Advertisement
 
Advertisement