క్రిప్టోకరెన్సీ: శెభాష్‌ ఎల్‌ సాల్వడర్‌.. చిన్న దేశమే కానీ, గొప్పగా ఆలోచించింది

El Salvador Started Mining Bitcoin Using Volcanoes Energy - Sakshi

El Salvador Mines First Bitcoin With Volcanic Energy: క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ విషయంలో మధ్యఅమెరికా దేశం ఎల్‌ సాల్వడర్‌ మరో కీలకమైన అడుగు వేసింది. అగ్నిపర్వతాల నుంచి ఉత్పత్తి అయ్యే పవర్‌ను వినియోగించుకుని బిట్‌కాయిన్‌ తయారు చేయడం ద్వారా సంచలనానికి తెరలేపింది. వోల్కనో ఎనర్జీ ద్వారా ఇప్పటికే 0.00599179 బిట్‌కాయిన్‌(269 డాలర్ల)ను ఉత్పత్తి చేసింది కూడా.  ఈ మేరకు ఎల్‌ సాల్వడర్‌ అధ్యక్షుడు నయిబ్‌ బుకెలె(40) అధికారికంగా ట్విటర్‌ ద్వారా ప్రకటించారు.  

క్రిప్టోకరెన్సీ మార్కెటింగ్‌లో ప్రస్తుతం పోటీతత్వం నడుస్తోంది. ఈ తరుణంలో కేవలం 3 లక్షల లోపు జనాభా ఉన్న  ఎల్‌ సాల్వడర్‌..  అగ్ని పర్వతాల ఎనర్జీ జియో థెర్మల్‌తో బిట్‌కాయిన్‌ తయారు చేసిన ఘనత దక్కించుకుంది. తద్వారా పునరుత్పాదక శక్తి(మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చు) ద్వారా అభివృద్ధికి కీలకమైన అడుగు వేసింది.  అందుకే ఈ నిర్ణయం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.

జియోథర్మల్‌ ఎలాగంటే.. 
జియోథర్మల్‌ ఎనర్జీ అనేది స్వచ్ఛమైంది. అగ్నిపర్వతాల వేడిమి(అంతర్గతంగా) ఉపయోగించుకుని ఈ ఎనర్జీని తయారు చేస్తారు. ఇది ఇంతకు ముందు ఏదైతే వనరులను ఉపయోగించుకుంటుందో.. తిరిగి దానినే వాడుకుంటుంది. తద్వారా విడుదలయ్యే వేడిమి పోను పోనూ తగ్గుతుంది.  పైగా థర్మల్‌ ఎనర్జీని డిజిటల్‌ ఎనర్జీగా(బిట్‌కాయిన్‌) మార్చడం వల్ల ఎక్కడికైనా ఎగుమతి చేయొచ్చు. శక్తి కోల్పోకుండా దానిని స్టోర్‌ చేయొచ్చు.  ఈ మేరకు జియోథర్మల్‌లో బిట్‌కాయిన్ల ఉత్పత్తికి సంబంధించిన వీడియోను సైతం నయిబ్‌ బుకెలె శుక్రవారం ట్విటర్‌ ద్వారా చూపించారు.

బోలెడంత ఆదా.. 
సాధారణంగా క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్‌ల ఉత్పత్తి వాతావరణంలోకి అధిక వేడిమికి ఉత్పత్తి చేస్తుంది. ఈ వేడిమి ఎంతో ప్రమాదకారకం. పైగా కంటికి కనిపించని ఈ కరెన్సీని డిజిటల్‌గా తయారు చేయడం కోసం బోలెడంత సాధారణ కరెంట్‌నూ(కంప్యూటర్‌ల కోసం) ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఎల్‌ సాల్వడర్‌ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కరెంట్‌ సేవ్‌ కావడమే కాదు.. జియోథర్మల్‌ వల్ల వేడిమి స్థాయి కూడా వాతావరణంలోకి తక్కువగా విడుదల అవుతుంది. అందుకే ప్రపంచ దేశాల నుంచి హర్షాతికేరాలు వ్యక్తం అవుతున్నాయి. ఎల్‌ సాల్వడర్‌ చేసిన ఈ  ప్రయత్నం మరికొన్ని దేశాలకు ప్రోత్సాహం ఇస్తుందని ట్విటర్‌ సీఈవో జాక్‌ డోర్సే పొగడ్తలు గుప్పించారు.


ఎల్‌ సాల్వడర్‌ అధ్యక్షుడు నయిబ్‌ బుకెలె

కేంబ్రిడ్జి బిట్‌కాయిన్‌ ఎలక్ట్రిసిటీ కన్‌జంప్షన్‌ ఇండెక్స్‌ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా బిట్‌కాయిన్‌ల ఉత్పత్తి కోసం 105 టెరావాట్‌ గంటల పవర్‌ను ఒక ఏడాదికి ఉపయోగిస్తున్నారు. ఫిలిప్పైన్స్‌ దేశం ఒక ఏడాదిలో మొత్తం ఉపయోగించే కరెంట్‌ కంటే ఇది ఎక్కువని ఒక అంచనా. 
 


బిట్‌కాయిన్స్‌ ఉత్పత్తి చేస్తున్న జియోథర్మల్‌ ప్లాంట్‌ ఇదే

వ్యతిరేకత నడుమే.. 
బిట్‌కాయిన్‌ క్రిప్టోకరెన్సీకు ఎల్‌ సాల్వడర్‌ దేశం చాలాకాలం క్రితమే చట్టబద్ధత కల్పించింది. అంతేకాదు బిట్‌కాయిన్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఎల్‌సాల్వాడర్‌ సర్కార్‌ తమ పౌరులకు ఇదివరకే 30 డాలర్ల విలువ గల బిట్‌కాయిన్లను అందించింది. అయితే ఇది ఆ దేశ పౌరులకు నచ్చడం లేదు.  బిట్‌కాయిన్‌కు మద్దతు ఇచ్చే వ్యవస్ధలు లోపభూయిష్టంగా ఉన్నాయని పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనల ప్రభావంతో సెప్టెంబర్‌ మొదటి వారంలో బిట్‌కాయిన్‌ విలువ భారీగా పతనం అయ్యింది కూడా. అయినప్పటికీ ఎల్‌ సాల్వడర్‌ ప్రభుత్వం తగ్గడం లేదు. ఇప్పటికే చివో(కూల్‌) పేరుతో వర్చువల్‌ వ్యాలెట్‌ను సైతం మెయింటెన్‌ చేస్తోంది ఎల్‌ సాల్వడర్‌.

చదవండి: అదృష్టమంటే ఇదే! తొమ్మిదేళ్లలో రూ. 6 లక్షల నుంచి రూ. 216 కోట్లు...!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top