ఏడాదిలోనే 90 శాతం విలువ తగ్గిన కంపెనీ.. | Sakshi
Sakshi News home page

ఏడాదిలోనే 90 శాతం విలువ తగ్గిన కంపెనీ..

Published Wed, Jan 24 2024 1:17 PM

Edtech Company Drops 90 Percent Value In A year - Sakshi

ఒక్క ఏడాది వ్యవధిలోనే ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ 90 శాతం తన విలువను కోల్పోయింది. బైజూస్‌ బ్రాండ్‌పై కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎడ్‌టెక్‌ సంస్థ థింక్‌ అండ్‌ లెర్న్‌ తన విలువను భారీగా నష్టపోయింది. ఈమేరకు ‘టెక్‌క్రంచ్‌’ వెబ్‌సైట్‌ కథనం ప్రచురించింది.

ఈ సంస్థ విలువ రూ.1,82,600 కోట్ల నుంచి రూ.16,600 కోట్లకు పడిపోయినట్లు అందులో పేర్కొంది.  ఫిబ్రవరిలో షేర్లను జారీ చేసి ప్రస్తుత పెట్టుబడిదార్ల నుంచి 100 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.830 కోట్ల)ను సమీకరించాలని బైజూస్‌ భావిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. 

గతంలో 2022 చివర్లో జరిగిన నిధుల సమీకరణ సమయంలో కంపెనీ విలువను 22 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1,82,600 కోట్లు)గా లెక్కగట్టగా.. తాజాగా 2 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.16,600 కోట్లు)గానే లెక్కించి ఇన్వెస్టర్లకు షాక్‌ఇచ్చింది. అంటే సంస్థ విలువ 90 శాతానికి పైగా తగ్గింది. కొన్ని నెలలుగా నగదు లభ్యత సమస్యల్లో ఉన్న ఈ కంపెనీ, కొత్తగా సమీకరించే నిధులతో అప్పు ఇచ్చినవారికి చెల్లింపులు చేయనుందని తెలిసింది.

బైజూస్‌ అనుబంధ సంస్థలు వైట్‌ హాట్‌ జూనియర్‌, ఒస్మోల్లో నష్టాల కారణంగా 2021-22లో సంస్థ నిర్వహణ వ్యయం రూ.6,679 కోట్లకు పెరిగినట్లు సమాచారం. ఈ రెండు సంస్థల నష్టాలే 45 శాతం (రూ.3,800 కోట్లు) ఉన్నాయి. 2020-21లో సంస్థ నష్టం రూ.4,143 కోట్లతో పోలిస్తే 2021-22 నష్టం మరింత పెరిగినట్లయింది. ఆదాయాలు కూడా రూ.2428.39 కోట్ల నుంచి రూ.5,298.43 కోట్లకు పెరిగాయి. బైజూస్‌ ఇతర అనుబంధ సంస్థలైన ఆకాశ్‌, గ్రేట్‌ లెర్నింగ్‌ ఆదాయాలు పెరిగాయి. ఆకాశ్‌ ఆదాయం 40% పెరిగి రూ.1491 కోట్లకు, గ్రేట్‌లెర్నింగ్‌ ఆదాయం 80% వృద్ధితో రూ.628 కోట్లకు చేరింది.

ఇదీ చదవండి: ఆగ్రహంతో రగిలిపోతున్న గూగుల్‌ ఉద్యోగులు.. కంపెనీకి చుక్కలు!

బైజూస్‌ తన వాల్యుయేషన్‌ను తగ్గించడానికి సుముఖత చూపడంపై స్టార్టప్‌ కంపెనీలు భిన్నంగా స్పందిస్తున్నట్లు తెలిసింది. 2021-22లో 2.5 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసిన ఈ స్టార్టప్ ప్రపంచవ్యాప్తంగా అర డజనుకు పైగా సంస్థలను కొనుగోలు చేసింది. ఒకానొక సందర్భంలో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు సంస్థకు 50 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ వాల్యుయేషన్‌ను ఇచ్చినట్లు టెక్ క్రంచ్ గతంలో నివేదించింది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement