‘కనీసం రూ.100 చెల్లించలేకపోతున్నాం’.. మాకు వారితోనే పోటీ: ఎడిల్‌విస్‌ సీఈఓ | Sakshi
Sakshi News home page

‘కనీసం రూ.100 చెల్లించలేకపోతున్నాం’.. మాకు వారితోనే పోటీ: ఎడిల్‌విస్‌ సీఈఓ

Published Sat, Dec 9 2023 3:43 PM

Edelweiss Competing With Zomato Swiggy - Sakshi

మనం చేస్తున్న చిన్న మొత్తాల పొదుపే భవిష్యత్తులో ఆర్థిక అవసరాలను తీర్చే సాధనంగా మారుతుంది. పొదుపు చేయకపోతే జీవితంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందనే విషయం అందరికీ తెలుసు. కానీ క్రమశిక్షణతో దాన్ని నిజంగా అనుసరిస్తూ ప్రతినెల కొంత మదుపుచేసే వారు చాలా తక్కువగా ఉంటారు. కొన్నేళ్ల​ కిందట ఎంతోమంది రోజువారీ సంపాదిస్తున్న కొద్దిమొత్తంలోనే ఖర్చు చేసి తోచినంత పొదుపు చేసేవారు. కానీ ప్రస్తుతం జీవన ప్రమాణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్భాటాలకుపోయి ఉన్నదంతా ఖర్చుచేసి నెలాఖరుకు చేతిలో డబ్బులేక తిరిగి అప్పు చేయాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. 

‘ఒకప్పటి తరం బతకడానికి చాలా కష్టపడే వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆదాయాలు పెరిగాయి. ఇప్పటి తరానికి ఆదాయానికి కొదవ లేదు. కానీ వారిలో పొదుపు చేయాలన్న భావన కనిపించడం లేదు’అని ఎడిల్‌విస్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ సీఈఓ, ఎండీ రాధికా గుప్తా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు స్విగ్గీ, జొమాటో, నెట్‌ఫ్లిక్స్‌తోనే పోటీ అంటున్నారు. ఒక మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థకు అధినేత ఎందుకు అలా అన్నారో తెలుసుకుందాం.

బాంబే షేవింగ్‌ కంపెనీ వ్యవస్థాపకుడు శంతను దేశ్‌పాండే ‘ది బార్బర్‌షాప్‌ విత్‌ శంతను’ పేరుతో ఒక పాడ్‌కాస్ట్‌ను నిర్వహిస్తున్నారు. ఇటీవల అందులో రాధికా గుప్తా మాట్లాడారు. యువతకు డబ్బు పొదుపు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇండస్ట్రీ స్విగ్గీ, జొమాటో, నెట్‌ఫ్లిక్స్‌ వంటి కంపెనీలతో పోటీ పడుతోందంటూ వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చదవండి: ఈ రోజు బంగారం ధరలు ఎంతంటే?

‘నెలకు రూ.50వేలు-రూ.60 వేలు సంపాదిస్తున్నవారు అందులో నెలనెలా ఎంతో కొంత పొదుపు చేయండి. చాలా మంది సరిపడా సంపాదించలేకపోతున్నారు. సంపాదిస్తున్న దానిలో కనీసం రూ.100 క్రమానుగత పెట్టుబడిలో ఇన్వెస్ట్‌ చేయలేకపోతున్నామని చాలామంది చెప్తారు. కానీ వారు నెట్‌ఫ్లిక్స్‌ కోసం నెలకు రూ.100 కడుతుంటారు. దేశంలో ఓటీటీ ప్లాట్‌ఫాంలతోపాటు స్విగ్గీ, జొమాటోకు 40 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. కానీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇండస్ట్రీలో కేవలం 4 కోట్ల మంది మాత్రమే పెట్టుబడి పెడుతున్నారు. ఆ 40 కోట్ల మంది నిత్యం చేస్తున్న ఖర్చులో కొంత మదుపు చేస్తే భవిష్యత్తులో వారి తర్వాతి తరాలకు ఎంతో మేలు జరుగుతుంది. అందుకే స్విగ్గీ, జొమాటోతోనే మా పోటీ’ అని రాధికా గుప్తా అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement