
హైదరాబాద్: యూకే కేంద్రంగా ఉన్న ఒరాకిల్ (Oracle) భాగస్వామ్య సంస్థ ఈయాప్‌సిస్ (eAppSys), హైదరాబాద్‌లో తన గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను విస్తరించింది. ప్రస్తుతం ఉన్న 200 మంది ఉద్యోగుల సంఖ్యను వచ్చే రెండు సంవత్సరాల్లో 500కి పెంచే లక్ష్యాన్ని సంస్థ ప్రకటించింది. ఈ కొత్త కేంద్రాన్ని తెలంగాణ ఐటీ మంత్రి డి.శ్రీధర్ బాబు ప్రారంభించారు.
ఈ విస్తరణలో భాగంగా 400 సీట్ల సామర్థ్యంతో కూడిన ఆధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒరాకిల్ క్లౌడ్, ఈఆర్‌పీ, ఏఐ, ఎంటర్‌ప్రైజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ సేవల కోసం ఇది ఆసియా-పసిఫిక్ (APAC), యూరప్-మిడిల్ ఈస్ట్- ఆఫ్రికా (EMEA), నార్త్ అమెరికా ప్రాంతాలకు వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తుంది.
ఏఐ/ఎంఎల్ ఇంజనీర్లు, ఈఆర్‌పీ కన్సల్టెంట్లు, సొల్యూషన్ ఆర్కిటెక్టులు వంటి నైపుణ్యాల ఉద్యోగాలు సృష్టించనున్నట్లు ఈయాప్‌సిస్ సంస్థ తెలిపింది. స్థానిక ప్రతిభను అభివృద్ధి చేసేందుకు అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లలో పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొంది.
“ఈ కేంద్రం మా గ్లోబల్ వృద్ధి ప్రయాణంలో కీలక మైలురాయి” అని ఈయాప్‌సిస్ ఛైర్మన్ ప్రవీణ్ రెడ్డి బద్దం అన్నారు. “ప్రపంచ దృష్టితో ఆలోచించి, స్థానికంగా అమలు చేసే బృందాన్ని నిర్మిస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు. ఈ ఈయాప్‌సిస్ కంపెనీ వివిధ సంస్థలకు ఒరాకిల్ సాఫ్ట్‌వేర్‌తో సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ సేవలు అందిస్తుంది.