ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఈ-నామినేషన్ చేయకపోతే..?

E-Nomination Process Mandatory For EPF Account Services Accessing - Sakshi

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌ఓ) చందాదారులకు అలర్ట్. ఈపీఎఫ్‌ సంస్థ ఈ-నామినేషన్‌ ప్రక్రియను ఇప్పుడు తప్పనిసరి చేసింది. గతంలో పలుమార్లు గడువు పొడిగించిన పీఎఫ్ సంస్థ.. తాజాగా ఆ వివరాలు నమోదు చేసేవరకు కొన్ని సేవలు పొందకుండా ఆంక్షలు విధించింది. అయితే, ఈ ఈ-నామినేషన్‌ ప్రక్రియను పూర్తిచేయడానికి ఎలాంటి గడువు విధించక పోవడం గమనర్హం. ఈపీఎఫ్‌ నుంచి నిధుల ఉపసంహరణతో పాటు ఖాతాలో ఎన్ని నిధులు నిల్వ ఉన్నాయో చూసుకునే అవకాశాన్ని ఈ నెల జనవరి 1 నుంచి తొలగించింది. ఈ-నామినేషన్‌ పూర్తి చేసిన చందాదారులే ఆన్‌లైన్‌ సేవలు పొందవచ్చని స్పష్టం చేస్తోంది. 

ఈపీఎఫ్‌ఓ డిజిటలైజేషన్‌
ఈపీఎఫ్‌ఓ గత కొంత కాలంగా డిజిటలైజేషన్‌ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అనేక ఆన్‌లైన్‌ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చిన సంస్థ.. భవిష్యత్తులో మరిన్ని సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొనిరావాలని యోచిస్తున్నట్లు పేర్కొంది. గతంలో ఈపీఎఫ్‌ చందాదారుడిగా నమోదైనప్పుడే సభ్యుల నామినీ వివరాలను కాగితం రూపంలో సేకరించింది. ఆ వివరాలు పూర్తిస్థాయిలో డిజిటైలేషన్‌ కాలేదు. దీంతో చందాదారుడు చనిపోయినపుడు వారసులకు ఈపీఎఫ్‌ మొత్తం, పింఛను, ఉద్యోగి డిపాజిట్‌ ఆధారిత బీమా(ఈడీఎల్‌ఐ) అందించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించేందుకు ఈ-నామినేషన్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. చందాదారులు ఈ వివరాలను నమోదు చేసుకోవాలని గత కొంతకాలంగా సూచిస్తూ వస్తోంది. ఇందుకు 2021 డిసెంబరు 31ను గడువని పేర్కొంది. అయినప్పటికీ కోట్ల మంది చందాదారులు వివరాలు నమోదు చేయలేదు. చివరి నిమిషంలో సర్వర్‌పై ఒత్తిడి పెరగడంతో సాధ్యం కాలేదు. దీంతో డిసెంబరు 31 తర్వాతా ఈ-నామినేషన్‌ నమోదుకు సంస్థ అనుమతి ఇచ్చింది.

(చదవండి: కేంద్ర బడ్జెట్‌పై దేశీయ నిర్మాణ రంగం గంపెడాశలు.. కోరుతుందేంటి?)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top