డిజిటల్‌కు మారడమే ప్రధాన సవాలు!

Digital And Other Transformations Is A Significant Risk Management Challenge, Pwc Survey - Sakshi

న్యూఢిల్లీ: రిస్కుల నిర్వహణకు సంబంధించి .. డిజిటల్‌కు ఎంత వేగవంతంగా మారగలమన్నదే ప్రధాన సవాలుగా ఉంటుందని దేశీయంగా అత్యధిక శాతం మంది బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌లు భావిస్తున్నారు. వ్యాపార పరిస్థితులు శరవేగంగా మారిపోతున్న నేపథ్యంలో రిస్కులను అంచనా చేసేందుకు, పర్యవేక్షించేందుకు బైటి నిపుణుల అభిప్రాయాలు కూడా ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ప్రతి పది మంది ఎగ్జిక్యూటివ్‌లలో ఆరుగురు అభిప్రాయపడుతున్నారు.

అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఎంత వేగవంతంగా డిజిటల్, ఇతరత్రా విధానాలకు మారతామనేదే రిస్కు మేనేజ్‌మెంట్‌కు ప్రధాన సవాలుగా ఉంటుందని ప్రతి పది మందిలో ఎనిమిది మంది ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడినట్లు సర్వే నివేదిక పేర్కొంది. రిస్కుల నిర్వహణకు సంబంధించి టెక్నాలజీ, డిజిటల్‌ సామర్థ్యాలపై మరింతగా ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు 88 శాతం మంది బిజినెస్‌ లీడర్లు
తెలిపారు.  

పీడబ్ల్యూసీ సర్వేలో భారత్‌ నుంచి 109 మంది పాల్గొన్నారు. వీరిలో అత్యధికంగా 72 శాతం మంది పేరొందిన బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఉండగా, మిగతా వారు రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ (13 శాతం), ఆడిట్‌ (10 శాతం) ప్రొఫెషనల్స్‌ ఉన్నారు. సంస్థల స్థాయిని చూస్తే 81 శాతం ఎగ్జిక్యూటివ్‌లు 1 బిలియన్‌ డాలర్ల పైగా ఆదాయాలు ఉన్న కంపెనీలకు చెందిన వారు ఉండగా, 42 శాతం మంది 10 బిలియన్‌ డాలర్ల పైగా టర్నోవరు ఉన్న సంస్థల్లో పని చేస్తున్నారు.

‘ఎప్పటికప్పుడు మారిపోయే వ్యాపార పరిస్థితుల్లో రిస్కుల నిర్వహణ సామర్థ్యాలనేవి వ్యూహాత్మక ప్లానింగ్‌లోనూ, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలోనూ భాగంగా ఉంటే బోర్డు సభ్యులు, వ్యాపారవేత్తలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎలాంటి రిస్కులు తలెత్తే అవకాశం ఉందనేది తెలిస్తే బిజినెస్‌ లీడర్లు తమ వ్యూహాల అమలుకు ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవచ్చు‘ అని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్‌నర్‌ శివరామ కృష్ణన్‌ చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top