దివాలా తీసిన రియల్ ఎస్టేట్ డెవలపర్ సూపర్‌టెక్‌.. ఆ 25 వేల మంది పరిస్థితి ఏంటి?

Developer Supertech Declared Bankrupt, 25000 Home Buyers May Be Impacted - Sakshi

ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌ సూపర్‌టెక్‌ కంపెనీ దివాలా తీసినట్లు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) నేడు ప్రకటించింది. సూపర్‌టెక్‌ సంస్థ బకాయిలు చెల్లించడంలో విఫలం అయ్యిందంటూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యుబీఐ) దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ ఎన్‌సీఎల్‌టీ బెంచ్ ఈ తీర్పు ఇచ్చింది. హితేష్ గోయల్'ను దివాలా ప్రక్రియ పరిష్కార నిపుణుడిగా నియమించింది. ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్‌సీఏఎల్‌టీ)లో అప్పీల్ దాఖలు చేస్తామని రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌ సూపర్‌టెక్‌ పేర్కొంది. 

ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన ఆదేశాల వల్ల పలు సంవత్సరాలుగా కంపెనీలో తమ ఇళ్లను బుక్ చేసుకున్న 25 వేల మంది గృహ కొనుగోలుదారులపై ప్రభావం పడే అవకాశం ఉంది అని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ విషయంపై స్పందించిన కంపెనీ.. "అన్ని ప్రాజెక్టులు ఆర్థికంగా లాభదాయకంగా ఉన్నందున, ఏ పార్టీకి లేదా ఆర్థిక రుణదాతకు నష్టం కలిగించే అవకాశం లేదు. ఈ ఆదేశాల వల్ల మరే ఇతర సూపర్‌టెక్‌ గ్రూప్ కంపెనీ కార్యకలాపాలను ప్రభావితం చేయదు" అని రియల్ ఎస్టేట్ సంస్థ తెలిపింది. గత 7 ఏళ్లలో 40,000 కంటే ఎక్కువ ఫ్లాట్లను అందజేసిన గొప్ప రికార్డు మాకు ఉంది. మా 'మిషన్ కంప్లీషన్ - 2022' కింద మా కొనుగోలుదారులకు ఫ్లాట్లను ఇవ్వడం కొనసాగిస్తాము, 2022 డిసెంబర్ నాటికి 7,000 యూనిట్లను డెలివరీ చేయాలనే లక్ష్యాన్ని మేము చేపట్టాము అని సంస్థ తెలిపింది. 

సూపర్‌టెక్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ మోహిత్ అరోరాను ఈ విషయమై ప్రస్తావించగా.. "సూపర్‌టెక్ లిమిటెడ్‌లో దాదాపు 11-12 హౌసింగ్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి, వాటికి సంబందించి దివాలా చర్యలు ప్రారంభమయ్యాయి. వీటిలో 90 శాతం ప్రాజెక్టులు పూర్తయ్యాయి’ అని పేర్కొన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి దాదాపు రూ.150 కోట్ల రుణాలు తీసుకుంటే, సూపర్‌టెక్ లిమిటెడ్ రుణాల మొత్తం దాదాపు రూ. 1,200 కోట్లు అని ఆయన తెలిపారు. అరోరా తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌‌టీలో లగ్జరీ ప్రాజెక్ట్ సూపర్‌నోవా సహా పలు ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్న గ్రూప్‌లో మూడు, నాలుగు ఇతర కంపెనీలు ఉన్నాయి. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ) కింద కంపెనీల దివాలా పరిష్కార ప్రక్రియపై ఎన్‌సీఎల్‌టీ అథారిటీ ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా ఎన్‌సీఏఎల్‌టీలో అప్పీల్ చేయవచ్చు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోయిడాలోని సూపర్‌టెక్‌ ట్విన్ టవర్లను మే 22న కూల్చివేస్తామ నోయిడాని అధికారులు ప్రకటించారు. 

(చదవండి: కొత్త కారు కొనేవారికి షాక్ ఇచ్చిన బీఎండబ్ల్యూ..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top