ప్రపంచంలోనే అతి చౌక బైక్ ఇదే..ధర వింటే

Detel launches world cheapest electric bike  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత సరసమైన ఫీచర్ ఫోన్, టీవీని తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్ బ్రాండ్ డీటెల్ సంస్థ తాజాగా మరో ఆవిష్కరానికి నాంది పలికింది. ప్రపంచంలోని చౌకైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని లాంచ్ చేసింది.  డీటెల్ ఈజీ పేరుతో కేవలం 19,999 (జీఎస్‌టీ అద‌నం) రూపాయలకు  విడుదల చేసింది.

ఎల‌క్ట్రిక్ బైక్‌ ఫీచర్లు
48 వాట్ల 12ఏహెచ్ ఎల్ఐఎఫ్ఈపీవో 4 బ్యాట‌రీని ఈ వాహనంలో అమర్చింది. దీన్ని పూర్తిగా చార్జింగ్ చేసేందుకు 7 నుంచి 8 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. ఒక్క‌సారి ఫుల్ చార్జింగ్ చేస్తే 60 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ప్రయాణించవచ్చు.  6 పైప్ కంట్రోల‌ర్‌తో కూడిన 250 వాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది,  బైక్ గంట‌కు గ‌రిష్టంగా 25 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకుపోతుంది. రిజిస్ట్రేష‌న్‌, డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవ‌స‌రం లేదు.

కాలుష్య ఉద్గారాలను నిరోధించే క్రమంలో, ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు ప్రోత్సాహం లభిస్తున్న తరుణంలో ఎల‌క్ట్రిక్  బైక్‌ను తీసుకొచ్చినట్టు డిటెల్ కంపెనీ వ్య‌వ‌స్థాప‌క సీఈవో యోగేష్ భాటియా  తెలిపారు. పర్యావరణం పట్ల పెరుగుతున్న అవగాహన, పెట్రోల్ ధరలు పెరగడం, కఠినమైన ఉద్గార నిబంధనలు వంటి వివిధ అంశాల కారణంగా భారతదేశంలో ఈవీ పరిశ్రమ అభివృద్ధి చెందుతోందన్నారు.  రానున్న రోజుల్లో దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు మంచి డిమాండ్ ఉంటుంద‌ని అన్నారు. ఇప్ప‌టికే ఎంతో మంది ఈ వాహ‌నాల‌ను వాడేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నార‌ని  అలాగే ఆ వాహ‌నాల కొనుగోలుపై స‌బ్సిడీని కూడా లభిస్తోందని చెప్పారు.నిత్యం త‌క్కువ దూరంప్ర‌యాణించేవారికి ఈ బైక్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిపారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  తీసుకొచ్చిన 'ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ' ద్వారా, విద్యుత్ వాహనాల వినియోగం గతంలో కంటే ఇప్పుడు పెరుగుతుందని భాటియా చెప్పారు.ఈ పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఆటో-రిక్షాలు,  సరుకు రవాణా వాహకాలు కొనుగోలుపై 30,000 రూపాయలు, కార్లపై 1.5 లక్షల వరకు సబ్సిడీకి అర్హులని తెలిపారు.  కాగా ఢిల్లీకి  చెందిన డీటెల్ కంపెనీ ఇప్ప‌టికే 299 రూపాయలకే  చీపెస్ట్ ఫీచ‌ర్ ఫోన్‌ను, అతిచౌకగా 3,999కే టీవీని అందించిన సంగతి తెలిసిందే. 

Election 2024

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top