వైజాగ్‌ పోర్టులో క్రూయిజ్‌ టెర్మినల్‌

Cruise terminal at Vizag port - Sakshi

ఏడాదిలో అందుబాటులోకి

పోర్టు డిప్యూటీ చైర్మన్‌ దుర్గేశ్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విశాఖపట్నం పోర్ట్‌ ట్రస్ట్‌ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ప్రపంచస్థాయి క్రూయిజ్‌ టెర్మినల్‌ ఏడాదిలో సాకారం కానుంది. ఈ ప్రాజెక్టుకు రూ.96 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సంస్థ డిప్యూటీ చైర్మన్‌ దుర్గేశ్‌ దూబే వెల్లడించారు. హైదరాబాద్‌లో గురువారం జరిగిన ట్రేడ్‌ మీట్‌ సందర్భంగా సాక్షి బిజినెస్‌ బ్యూరోతో ఆయన మాట్లాడారు. ‘మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం సహకారంతో క్రూయిజ్‌ టెర్మినల్‌ నెలకొల్పుతున్నాం. పర్యాటక రంగ వృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుంది. క్రూయిజ్‌లో 2,000 మందికిపైగా ప్రయాణించే సామ ర్థ్యం ఉంటుంది’ అని వివరించారు. ఆయనింకా ఏమన్నారంటే..

అడ్డంకుల్లేని రవాణా..: రైలు, రోడ్డు మార్గంలో వివిధ ప్రాంతాల నుంచి పోర్టుకు.. అలాగే పోర్టు నుంచి వివిధ రాష్ట్రాలకు సరుకు రవాణాకు ఎటువంటి అడ్డంకులు లేకుండా పెద్ద ఎత్తున మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నాం. తూర్పు ప్రాంతంలో ప్రధాన పోర్టుగా నిలవాలన్నది మా లక్ష్యం. ఇందుకోసం మౌలిక వసతులకు 2–3 ఏళ్ల లో రూ.1,000 కోట్లు వెచ్చిస్తున్నాం. పబ్లిక్, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో వెస్ట్, ఈస్ట్‌ క్యూ బెర్త్‌ల ఆధునీకరణకు రూ.488 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పోర్టును కంటైనర్‌ ట్రాన్షిప్‌మెంట్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం.  

హైదరాబాద్‌ నుంచి..: ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి ప్రధానంగా ముంబై పోర్ట్‌ ద్వారా కార్గో రవాణా జరుగుతోంది. ఏటా 30 లక్షల టన్నుల సరుకు విదేశాలకు ఎగుమతి అవుతోంది. వైజాగ్‌ పోర్ట్‌ సమీపంలో ఉన్నప్పటికీ భాగ్యనగర వర్తకులు ముంబై నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. అర్హతగల వర్తకులకు చార్జీల్లో భారత్‌లో అత్యధికంగా 80 శాతం తగ్గింపు ఇస్తున్నాం. చార్జీల పరంగా చవకైన పోర్టు ఇదే. హైదరాబాద్‌ నుంచి ముంబైకి వెళ్తున్న కార్గోలో 10 లక్షల టన్నులు వైజాగ్‌ పోర్ట్‌ నుంచి జరిగేలా ప్రణాళికతో ఉన్నాం.  

► కోవిడ్‌ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా నౌకలు, కంటైనర్ల కొరత ఉంది. చార్జీలు అధికమయ్యాయి. పరిశ్రమపై తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. సాధారణ స్థితికి రావడానికి 6–12 నెలలు పట్టొచ్చు. 2020–21 మాదిరిగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం పోర్ట్‌ ట్రస్ట్‌ రూ.1,400 కోట్ల ఆదాయం ఆశిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 6.89 కోట్ల టన్నుల సరుకు రవాణా జరిగింది. 2021–22లో 7.1 కోట్ల టన్నులు ఆశిస్తున్నాం. పోర్టు కార్గో రవాణాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటా 30 శాతముంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top