
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ క్రూయిజ్ ప్రయాణానికి ప్రకటన విడుదలైంది. రీజెంట్ సెవెన్ సీస్ అనే సంస్థ "వరల్డ్ ఆఫ్ స్ల్పెండర్" పేరుతో 140 రోజుల క్రూయిజ్ ప్రయాణాన్ని ప్రకటించింది. మియామి నుండి న్యూయార్క్ వరకు వెళ్లే ఈ సెవెన్ సీస్ స్ల్పెండర్ క్రూయిజ్ 6 ఖండాలు, 40 దేశాలు, 71 ఓడరేవులను కవర్ చేస్తుంది. ఈ విలాస సాగర యాత్ర 2027 జనవరి 11న ప్రారంభం కానుంది.
టికెట్ ధరలు ఇలా..
"వరల్డ్ ఆఫ్ స్ల్పెండర్" క్రూయిజ్ ఎక్కడం సామాన్యుల తరం కాదు. ఎందుకంటే అంతలా ఉన్నాయి టికెట్ ధరలు. ఎంట్రీ లెవల్ వరండా సూట్ల ఛార్జీలే ఒక్కొక్కరికి సుమారు రూ .80 లక్షల నుండి ప్రారంభమవుతాయి. ఇక టాప్-ఎండ్ రీజెంట్ సూట్ కావాలంటే దాదాపు రూ .7.3 కోట్లు అవుతుంది. వాణిజ్య క్రూయిజ్ మార్కెట్లో ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం.
ఏమిటి ప్రత్యేకతలు?
సముద్ర ఉపరితలంపై అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు అందించడంలో రీజెంట్ సూట్‌లకు సుదీర్ఘ ఖ్యాతి ఉంది. ప్రతి పోర్ట్ లోనూ ప్రైవేట్ కారు, డ్రైవర్, ఇన్-సూట్ స్పా, క్యూరేటెడ్ ఫైన్ ఆర్ట్, 4,000 చదరపు అడుగుల ప్రైవేట్ స్పేస్ వంటి అల్ట్రా-ఎక్స్ క్లూజివ్ వసతులను అతిథులకు కల్పిస్తుంది.
రీజెంట్ 2026లో సెవెన్ సీస్ ప్రెస్టీజ్ లో ఇంకా పెద్ద స్కైవ్యూ రీజెంట్ సూట్ ను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. దీని ధర ఒక్క రోజుకి సుమారు రూ .20-22 లక్షలు. ఇది అత్యంత ఖరీదైన సూట్ రేటుగా రికార్డుకెక్కింది.
ఆరు ఖండాలలో ప్రయాణం
2027 "వరల్డ్ ఆఫ్ స్ప్లెండర్" క్రూయిజ్ అతిథులు లాస్ ఏంజిల్స్, సిడ్నీ, సింగపూర్, మాలిబు, ముంబై వంటి ప్రధాన నగరాల్లో రాత్రి బస చేసి ఆరు ఖండాల గుండా 35,668 నాటికల్ మైళ్ళు (66,057 కిమీ) ప్రయాణిస్తారు.
మార్గం వెంట 486 కాంప్లిమెంటరీ షోర్ విహారయాత్రలు, మూడు ప్రత్యేకమైన తీరప్రాంత గాలా ఈవెంట్ లు, ఇంటర్‌కాంటినెంటల్ బిజినెస్ లేదా ఫస్ట్-క్లాస్ విమానాలు, లగ్జరీ హోటల్ బసలు, లగేజ్ సర్వీస్, ప్రీమియం బేవరేజీలు, స్పెషాలిటీ డైనింగ్, వాలెట్ లాండ్రీ, వై-ఫై, 24 గంటల ఇన్-సూట్ డైనింగ్ వంటివెన్నో ఈ విలాస ప్రయాణంలో ఉన్నాయి.
ఈ క్రూయిజ్‌కు భారత్‌లో నాలుగు స్టాప్ లు ఉన్నాయి. ముంబై, మంగళూరు, కొచ్చి, గోవాలో ఈ క్రూయిజ్‌ను యాత్రికులు ఎక్కొచ్చు.