ఆపదలో చేయూత.. క్రౌడ్‌ ఫండింగ్‌ | Sakshi
Sakshi News home page

ఆపదలో చేయూత.. క్రౌడ్‌ ఫండింగ్‌

Published Mon, Oct 30 2023 4:35 AM

Crowdfunding explained sakshi Special - Sakshi

శాంతి, ఏకాంబరం దంపతులు (పేరు మార్చాం) తొలి కాన్పులో పుత్రుడు అని తెలియగానే పొంగిపోయారు. బాబును చూస్తూ భవిష్యత్తుపై ఎన్నో కలలుగన్నారు. చిన్నారి మూడేళ్ల వయసుకొచ్చేసరికి కదల్లేని స్థితి ఏర్పడింది. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ చిన్నారుల ఆస్పత్రిలో చూపించారు. స్పైనల్‌ మసు్క్యలర్‌ అట్రోఫీ(ఎస్‌ఎంఏ)తో బాధపడుతున్నట్టు తేలింది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే విదేశాల నుంచి ‘జోల్‌జెన్స్‌మా’ అనే ఇంజెక్షన్‌ను తీసుకొచ్చి ఇవ్వాలి.

ఇందుకు సుమారు రూ.16 కోట్లు అవుతుందని వైద్యులు వెల్లడించారు. ఈ సమయంలో బాబు తల్లిదండ్రులకు ‘ఇంపాక్ట్‌ గురూ’ ప్లాట్‌ఫామ్‌ సంజీవనిగా కనిపించింది. చిన్నారి ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరిస్తూ విరాళాలకు (ఫండ్‌ రైజింగ్‌) పిలుపునిచ్చారు. మూడున్నర నెలల్లో 65,000 మంది దాతల ఉదారంతో ఊహించనిది సాధ్యమైంది. విదేశాల నుంచి సదరు ఇంజెక్షన్‌ను తీసుకొచ్చి ఇవ్వడంతో బాబు కోలుకున్నాడు.


వేణు నెట్‌ బ్రౌజింగ్‌ చేస్తున్న సమయంలో ఓ బాలిక లివర్‌ సమస్యతో బాధపడుతుందన్న ‘కెట్టో’ ప్రకటన కనిపించింది. అది క్లిక్‌ చేయగా, ఆ సమస్య నుంచి బయటపడేందుకు రూ.30 లక్షలు అవుతుందని, దాతలు దయతలిస్తేనే తన కుమార్తె బయటపడుతుందంటూ చిన్నారి తల్లి ఆవేదనతో చెబుతున్న మాటలకు వేణు చలించిపోయాడు. కానీ, కాలేయ చికిత్సకు భారీ మొత్తాన్ని పేర్కొనడంపై అతడిలో అనుమానం కలిగింది. సదరు ప్రకటన నిజమేనా..? అంత ఖర్చు అవుతుందా..? ప్రభుత్వాలు ఎందుకు సాయం చేయవు? ఆస్పత్రులు అయినా బాధితుల విషయంలో కొంత లాభాపేక్ష తగ్గించుకుని చికిత్సలకు ముందుకు రావచ్చుగా..? ఇలాంటి ప్రశ్నలు మెదిలాయి. చివరికి తన సందేహాలన్నీ పక్కన పెట్టేసి రూ.500 అప్పటికప్పుడు డొనేట్‌ చేశాడు.
 

ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచి్చనా, తమ వల్ల ఏమవుతుంది? అంటూ కుదేలు అయిపోవాల్సిన పని లేదని శాంతి దంపతుల కథనం ధైర్యాన్నిస్తోంది. ఆరోగ్య పరంగా ఎంత కష్టం వచి్చనా, దాతల నుంచి విరాళాలు తెచ్చి పెట్టేందుకు నేడు ఎన్నో వేదికలు పనిచేస్తున్నాయి. వేలాది మంది బాధితుల కుటుంబాల్లో సంతోషానికి దారి చూపిస్తున్నాయి. అదే సమయంలో ఇలాంటి బాధితులకు సాయం చేశామనే సంతృప్తి దాతలకు లభిస్తోంది. కాకపోతే విరాళం ఇచ్చే ముందు కాస్తంత విచారించి, కథనం నిజమైనదేనని నిర్ధారించుకోవడం ద్వారా తమ దానం నిష్ఫలం కాకుండా చూసుకోవచ్చు. మెడికల్‌ క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు ఎలా పనిచేస్తాయో తెలుసుకుంటే.. వీటి సాయం పొందడమే కాకుండా, వీటి ద్వారా నలుగురికీ తోచినంత సాయం చేయడానికి అవకాశం లభిస్తుంది.

మనోళ్లకు దాన గుణం ఎక్కువే..
2021 వరల్డ్‌ గివింగ్‌ ఇండెక్స్‌ ప్రకారం దానంలో భారత్‌ 14వ స్థానంలో ఉంది. అపరిచితులకు మన దేశంలో 61 శాతం మంది సాయం చేస్తున్నారు. కాకపోతే విశ్వసనీయత విషయంలో ఉండే సందేహాలు ఈ దాతృత్వాన్ని మరింత విస్తరించకుండా అడ్డుకుంటున్నాయని చెప్పుకో వచ్చు. బాధితులకు, దాతలకు మధ్య వేదికగా నిలిచే విశ్వసనీయ సంస్థలు వస్తున్న కొద్దీ, క్రౌడ్‌ ఫండింగ్‌ మరింత పరిడవిల్లుతూనే ఉంటుంది. మరింత మంది బాధితులకు చేయూత లభిస్తుంది.

నిధుల సమీకరణ ఇలా..?
► చికిత్సలకు దాతల సాయం అవసరమైన వారు క్రౌండ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌లను (ఇంపాక్ట్‌గురూ, మిలాప్, కెట్టో మొదలైనవి) సంప్రదించాలి.
► పాన్, ఆధార్, మెడికల్‌ డాక్యుమెంట్లు సమర్పించాలి.  
► వీటిని క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ధ్రువీకరించుకుంటుంది. తగిన విచారణ అనంతరం బాధితుల కథనం నిజమేనని నిర్ధారించుకున్న తర్వాత వారి తరఫున నిధుల సమీకరణ పేజీని అవి సిద్ధం చేస్తాయి.
► ఇక ఇక్కడి నుంచి నిధుల సమీకరణ మొదలవుతుంది. సాయం అవసరమైన వారు ఈ పేజీ లింక్‌ను తమ నెట్‌వర్క్‌లో షేర్‌ చేసుకోవాలి. తమ వంతు ప్రచారం కలి్పంచుకోవాలి. అలాగే, ప్లాట్‌ఫామ్‌లు సైతం ప్రచారానికి తమ వంతు సాయం అందిస్తాయి.  
► సమీకరించే విరాళంలో ఎక్కువ మొత్తాన్ని కమీషన్‌ రూపంలో మినహాయించుకునేందుకు సమ్మతి తెలియజేస్తే, వారి తరఫున క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు సైతం విస్తృత ప్రచారాన్ని చేపడతాయి.
► బాధితులు ఎదుర్కొంటున్న సమస్య, వైద్యులు చెబుతున్న వెర్షన్, చికిత్సకు ఎంత ఖర్చవుతుంది? తదితర వివరాలన్నీ ఈ పేజీలో ఉంటాయి. దాతలు విరాళం చెల్లించేందుకు పేమెంట్‌ లింక్‌లు కూడా అక్కడ కనిపిస్తాయి.  
► కనీసం 300–350 అంతకంటే ఎక్కువ విరాళాలనే అనుమతిస్తున్నాయి.  
► దాతలు చేసే చెల్లింపులన్నీ కూడా ప్రత్యేక ఖాతాలో జమ అవుతాయి.  
► కావాల్సిన మొత్తం వచి్చనా.. లేదంటే గడువు ముగిసినా లేదంటే అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి అకాలంగా మరణించినా నిధుల సమీకరణ ముగిసిపోతుంది.
► అనంతరం ఈ మొత్తం నుంచి కమీషన్‌ మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని హాస్పిటల్‌/బాధితులకు క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు చెల్లిస్తాయి. ఇలా చేసే ముందు హాస్పిటల్‌ బిల్లులను చెక్‌ చేస్తాయి.  
► విరాళం ఇచి్చన వారికి ఎప్పటికప్పుడు మెయిల్‌ ద్వారా బాధితుల తాజా ఆరోగ్య పరిస్థితిపై వివరాలను ఇవి అప్‌డేట్‌ చేస్తుంటాయి.  

విశ్వసించడం ఎలా..?
సాయం అవసరమైన వారికి క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు మార్గాన్ని చూపిస్తున్నాయి. మరి విరాళం ఇచ్చే వారు ఈ కథనాలను విశ్వసించేది ఎలా..? ఈ సందేహం చాలా మందికి వస్తుంది. మన దేశంలో విరాళాలకు సంబంధించి భౌతిక వేదికలే ఎక్కువ. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల సేవలు ఇటీవలి కాలంలోనే వెలుగులోకి వచ్చాయి. ఇంటర్నెట్‌ విస్తరణ ఇందుకు వీలు కలి్పంచిందని చెప్పుకోవాలి.

ఆన్‌లైన్‌ ప్రపంచంలో అన్నింటినీ నమ్మలేం. సైబర్‌ మోసాలు గణనీయంగా పెరిగిపోయిన నేపథ్యంలో, అన్నీ విచారించుకున్న తర్వాతే విరాళం ఇవ్వడం సురక్షితంగా ఉంటుంది. కోటక్‌ ఆల్టర్నేటివ్‌ అస్సెట్‌ మేనేజర్స్‌ సీఈవో (ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజీ) లక్ష్మీ అయ్యర్‌ దీనిపై తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘నాకు రిఫరల్‌ ద్వారా వచ్చే వాటికే నేను దానం చేస్తాను. ఈ విషయంలో నా మార్గం చాలా స్పష్టం. సులభంగా డబ్బులు సంపాదించే మోసగాళ్లకు కొదవ లేదు’’అన్నది లక్ష్మీ అయ్యర్‌ అభిప్రాయంగా ఉంది.

సన్సేరా ఇంజనీరింగ్‌ జాయింట్‌ ఎండీ ఎఫ్‌ఆర్‌ సింఘ్వి ఈ విషయంలో సందేహాలు వ్యక్తం చేశారు. ‘‘చాలా వరకు విరాళాలు కోరుతున్న ఆన్‌లైన్‌ కేసులు వైద్య పరమైనవే ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో అవి పేర్కొనే చికిత్సల వ్యయాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. నాకు ఒక ఆస్పత్రితో అనుబంధం ఉంది. కనుక చికిత్సల వ్యయాల గురించి తెలుసుకోగలను’’అని పేర్కొన్నారు.

ఇలాంటిదే ఒక విరాళం కేసులో చికిత్సకు రూ.18–24 లక్షలు ఖర్చువుతుందన్న కొటేషన్‌ కనిపించగా, దీనిపై విచారించగా, తెలిసిన హాస్పిటల్‌లో రూ.5–6 లక్షలకే చేస్తున్నట్టు విని ఆశ్చర్యపోయినట్టు సింఘ్వి తెలిపారు. నిజానికి కొన్ని కేసుల్లో భారీ అంచనాలు పేర్కొంటున్న ఉదంతాలు లేకపోలేదు. హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న బాధితుల తరఫున నిధుల సమీకరణ కార్యక్రమాలు నడిపించే కొందరు మోసగాళ్ల ఉదంతాలు సైతం లోగడ వెలుగు చూశాయి. అలా అని కష్టాల్లో ఉన్న బాధితులకు విరాళాలు ఆగకూడదు కదా..?  

ముందస్తు పరిశీలన
క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు చికిత్సల వ్యయాలను ముందుగానే నిర్ధారించుకుంటామని చెబుతున్నాయి. హాస్పిటల్‌ వ్యయ అంచనాలను, చారిత్రక గణాంకాలు, బీమా థర్డ్‌ పార్టీ అగ్రిగేటర్‌ సంస్థల డేటా ఆధారంగా పోల్చి చూస్తామని ఇంపాక్ట్‌గురూ సీఈవో జైన్‌ తెలిపారు. తమ ప్యానల్‌ డాక్టర్లతోనూ దీనిపై నిర్ధారించుకుంటామని చెప్పారు. నిధుల సమీకరణ నిజమైన కారణాలతో చేసినప్పటికీ, తర్వాత ఆ నిధులు దురి్వనియోగం కాకుండా ఉండేందుకు కూడా ఇవి చర్యలు తీసుకుంటున్నాయి. ‘‘ఇంపాక్ట్‌ గురూ వేదికగా సమీకరించే నిధుల్లో 80 శాతానికి పైగా నేరుగా హాస్పిటల్స్‌కు బదిలీ చేస్తున్నాం. ఈ హాస్పిటల్స్‌ కూడా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ జాబితాలోనివే’’అని జైన్‌ తెలిపారు. తమ ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్‌ చేసే వైద్య పరమైన కేసుల్లో విరాళాలను హాస్పిటల్‌ బ్యాంక్‌ ఖాతా ద్వారానే తీసుకోగలరని కెట్టో అంటోంది.  
► బాధితుల కేవైసీ పత్రాలను ముందుగా ఇవి నిర్ధారించుకుంటాయి.
► వైద్య పరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకుని వాటిని తనిఖీ చేస్తాయి.
► తమ ప్యానెల్‌ వైద్యులతో మాట్లాడి నిర్ధారణకు వస్తాయి.
► అవసరమైతే క్షేత్రస్థాయిలో హాస్పిటల్‌కు తమ ఉద్యోగిని పంపించి వాస్తవమా, కాదా అన్నది నిర్ధారించుకుంటాయి.  

ప్రచార మార్గం..
ఇంపాక్ట్‌ గురూ, కెట్టో, మిలాప్‌ ఇవన్నీ ప్రముఖ మెడికల్‌ క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు. ఆన్‌లైన్‌ ప్రకటనలు, సామాజిక మాధ్యమాల ద్వారా బాధితుల తరఫున విరాళాల సమీకరణకు ఇవి ప్రచారం కలి్పస్తుంటాయి ఇంటర్నెట్‌ బ్రౌజ్‌ చేసే సమయంలో వైద్య చికిత్సల కోసం సాయం కోరుతూ ఈ సంస్థలకు సంబంధించి ప్రకటనలు కనిపిస్తుంటాయి. వీటిని క్లిక్‌ చేసి చూశారంటే, తర్వాత కూడా అలాంటి ప్రకటనలే మళ్లీ మళ్లీ కనిపిస్తుంటాయి.

ప్రకటనల్లో బాధితుల కథనానికి ఆధారంగా వైద్యులు జారీ చేసిన లెటర్, టెస్ట్‌ రిపోర్ట్‌లను ఉంచుతున్నాయి. సామాజిక మాధ్యమాలతోపాటు, బాధితులు సైతం తమకు తెలిసిన వారికి ఈ లింక్‌లు పంపి సాయం కోరవచ్చు. ఒక్కసారి కావాల్సిన నిధులు లభించగానే, ఈ ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమం ముగుస్తుంది. ఈ సంస్థలు విరాళం ఇచి్చన వ్యక్తులను నెలవారీ స్కీమ్‌లతో ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రతి నెలా తోచినంత దానం ఇచ్చే విధంగా స్కీమ్‌లు తీసుకొచ్చాయి. విరాళాలకు సెక్షన్‌ 80జీ కింద పన్ను మినహాయింపు కల్పిస్తున్నాయి.

బాధితుల అనుభవాలు..
లాహిరి సోదరికి బ్రెయిన్‌ టీబీ నిర్ధారణ కావడంతో 2019 డిసెంబర్‌లో నిధుల సమీకరణ కోసం మిలాప్‌ సంస్థను సంప్రదించారు. మిలాప్‌ ఆమె అభ్యర్థనకు చక్కగా స్పందించింది. ఫొటోగ్రాఫ్‌లు, డాక్యుమెంట్లు అడిగారు. అవన్నీ ఇవ్వడంతో, వాటి ఆధారంగా ఒక ప్రచార ప్రకటనను మిలాప్‌ రూపొందించింది. తెలిసిన వారి సాయంతో దీనికి మంచి ప్రచారం కలి్పంచుకోవాలని మిలాప్‌ సూచించింది. తాము ఆ ప్రచారాన్ని చేపట్టబోమని, బాధితులే సొంతంగా నిర్వహించడం వల్ల మరింత విశ్వసనీయత ఉంటుందనే సూచన వచ్చింది.

దీంతో లాహిరి తనకు తెలిసిన వారికి షేర్‌ చేశారు. అలా రూ.45,000 విరాళాలు వచ్చాయి. ఇందులో మిలాప్‌ తన కమీషన్‌గా రూ.5,000 మినహాయించుకుని, రూ.40,000ను లాహిరి చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చెల్లించింది. కానీ, మిలాప్‌ ద్వారా చేసిన ప్రచారం లాహిరి బంధు మిత్రులకు తెలిసిపోవడంతో, వారి నుంచి ఆమెకు మరో రూ.12 లక్షలు విరాళాల రూపంలో నేరుగా వచ్చాయి. మిలాప్‌ రూపొందించిన ప్రచారమే లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదని లాహిరి అనుభవం చెబుతోంది. దురదృష్టవశాత్తూ లాహిరి సోదరి బ్రెయిన్‌ టీబీతో 2020 ఫిబ్రవరిలో మరణించారు.

విజయం ఎంత?
మీరా అనే వ్యక్తి సైతం, తన భర్త సర్జరీ కోసం కెట్టో ద్వారా నిధుల సమీకరణ చేయగా, మంచి ఆదరణే లభించింది. కెట్టో రిప్రజెంటేటివ్‌ ఎప్పటికప్పుడు ఆమెతో సంపద్రింపులు చేస్తూ సహకారం అందించడంతో, సర్జరీకి కావాల్సిన మొత్తం 48 గంటల్లోనే సమకూరింది. దేశ, విదేశాల్లోని స్నేహితులు, కుటుంబ సభ్యులు విరాళం ఇచ్చేందుకు సముఖంగా ఉన్నారని తెలిసినా, అందుకు వీలుగా కెట్టో ప్లాట్‌ఫామ్‌ సాయాన్ని ఆమె తీసుకున్నారు.

ఎక్కడ ఉన్నా కెట్టో ద్వారా విరాళం పంపడం సులభమని భావించి అలా చేసినట్టు చెప్పారు. అయితే, అందరికీ ఇదే తరహా అనుభవం లభిస్తుందా..? ప్రతి ఫండ్‌ రైజింగ్‌ విజయవంతం అవుతుందా? అంటే నూరు శాతం అవును అని చెప్పలేం. ఇదంతా తమకున్న పరిచయాలు, ఎంపిక చేసుకున్న ప్లాట్‌ఫామ్, రూపొందించిన ప్రకటన, ప్లాట్‌ఫామ్‌ నుంచి ప్రచారం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ‘‘కొన్నేళ్ల క్రితం మేము సాయం కోసం ఇంపాక్ట్‌ గురూ ప్లాట్‌ఫామ్‌ను సంప్రదించాం.

ఇంపాక్ట్‌ గురూ దాతల నెట్‌వర్క్‌ సాయంతో నిధులు సమకూర్చుతారని అనుకున్నాం. కానీ, ఇంపాక్ట్‌ గురూ అలా చేయలేదు. ప్రచార కార్యక్రమం పేజీని రూపొందించి, ఆ లింక్‌ను తమ పరిచయస్తులతో పంచుకోవాలని సూచించింది’’అని ఓ వ్యక్తి అనుభవం చెబుతోంది. తమ ప్లాట్‌ఫామ్‌పై వేలాది ప్రచార కార్యక్రమాలు నమోదవుతున్నందున.. ప్రతీ ఒక్క ప్రచారాన్ని తామే సొంతంగా చేపట్టడం సాధ్యం కాదని ఇంపాక్ట్‌ గురూ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పీయూష్‌ జైన్‌ స్పష్టం చేశారు. దాతల కమ్యూనిటీ నుంచి మంచి స్పందన వస్తుందనుకుంటే, తాము తప్పకుండా ప్రమోట్‌ చేస్తుంటామని చెప్పారు.

కొంచెం కమీషన్‌..
క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ లు మొత్తం విరాళం నుంచి నిరీ్ణత మొత్తాన్ని కమీషన్‌/చార్జీ కింద మినహాయించుకుంటున్నాయి. ఇది ఒక్కో సంస్థలో ఒక్కో విధంగా ఉంటుంది. ‘‘అంతర్జాతీయంగా చూస్తే ప్రతీ మెడికల్‌ క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఎంతో కొంత స్వల్ప ఫీజును వసూలు చేస్తున్నాయి. తమ కార్యకలాపాలు నిర్విరామంగా కొనసాగేందుకే ఇలా చేస్తున్నాయి. టెక్నాలజీ సదుపాయాలు, సిబ్బంది, నిధుల సమీకరణ, ముందస్తు విచారణలకు సంబంధించి వ్యయాలు అవుతాయి. మేము నిలదొక్కుకున్నప్పుడే మా లక్ష్యాన్ని (ఫండ్‌ రైజింగ్‌) సాధించగలం’’ అని పీయూష్‌ జైన్‌ తెలిపారు. ఈ ప్లాట్‌ఫామ్‌లలో కొన్ని ప్రీమియం సేవలను కూడా ఆఫర్‌ చేస్తున్నాయి. ఇంపాక్ట్‌ గురూ అయితే 0 శాతం, 5 శాతం, 8 శాతం ఇలా మూడ్‌ స్కీమ్‌ల కింద ఈ సేవలను ఆఫర్‌ చేస్తోంది.

మోసాలుంటాయ్‌.. జాగ్రత్త
అవగాహన, జాగ్రత్తలు లేకపోతే ఆన్‌లైన్‌ మోసాల బారిన పడే రిస్క్‌ ఉంటుంది. క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విరాళాలు కోరినా లేక విరాళం ఇచ్చినా సరే.. ఆ తర్వాత ఫోన్‌ కాల్‌ లేదా వాట్సాప్‌ మెస్సేజ్‌ లేదా మెయిల్‌ రావచ్చు. కష్టంలో ఉన్న బాధితులకు సంబంధించి అందులో సాయం కోరొచ్చు. లేదంటే అప్పటికే విరాళం ఇచ్చిన కేసుకు సంబంధించి అప్‌డేట్‌ అంటూ మోసగాళ్లు మెయిల్‌ పంపించొచ్చు. ఒక్కసారి విరాళం ఇస్తే, ఆ తర్వాత నుంచి క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు ఇతర బాధితులకు సంబంధించిన వివరాలను మెయిల్స్, వాట్సాప్‌ మెస్సేజ్‌లు, కాల్స్‌ రూపంలో మార్కెటింగ్‌ చేస్తుంటాయి. ఇదంతా ఇబ్బందికరంగా అనిపించొచ్చు.

చాలా మంది సాయం చేయాలని భావిస్తుంటారని, బాధితుల వివరాలను వారు మెయిల్‌ లేదా వాట్సాప్‌ సందేశాలు, కాల్స్‌ రూపంలో తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని జైన్‌ తెలిపారు. ఇవి వద్దనుకునే వారు అన్‌సబ్‌స్క్రయిబ్‌ చేసుకోవాలని సూచించారు. క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు అన్నీ కూడా సురక్షిత చెల్లింపుల సాధనాలనే వినియోగిస్తున్నాయి. కానీ, వీటి పేరుతో సైబర్‌ నేరస్థులు ఆకర్షించే కథనాలు, మోసపూరిత పేమెంట్‌ లింక్‌లు పంపించి, బ్యాంక్‌ ఖాతాలో బ్యాలన్స్‌ మొత్తాన్ని ఊడ్చేసే ప్రమాదం లేకపోలేదు. అందుకే విరాళం ఇచ్చే ముందు సంబంధిత సంస్థల యూఆర్‌ఎల్‌ను జాగ్రత్తగా గమనించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

 
Advertisement
 
Advertisement